బీసీసీఐ ఖజానాకు తూట్లు పొడిచే విధంగా ఐసీసీ నిర్ణయం

- March 04, 2019 , by Maagulf
బీసీసీఐ ఖజానాకు తూట్లు పొడిచే విధంగా ఐసీసీ నిర్ణయం

బిసిసిఐ-ఐసీసీ మధ్య మరో కుంపటి రగిలేందుకు రంగం సిద్ధమౌతోంది. పాకిస్తాన్ విషయంలో బిసిసిఐ వినతిని కనీస పరిశీలన లేకుండానే తోసిపుచ్చిన ఐసీసీ, అదే బిసిసిఐ పరిధిలో లేని అంశంపై ఆ సంస్థను బాధ్యురాలిని చేసేందుకు మాత్రం ఒత్తిడి తెస్తోంది. వరల్డ్ కప్ లో ఆడకుండా ఉగ్రవాద స్వర్గధామం పాకిస్థాన్ ను అడ్డుకోవాలన్న బిసిసిఐ విన్నపాన్ని లెక్కపెట్టని అంతర్జాతీయ క్రికెట్ మండలి-ఐసీసీ పన్ను రాయితీల పేరిట బిసిసిఐ నుంచి నిధులు రాబట్టే యత్నాలకు తెరలేపింది. క్రికెట్ కు అంతగా ఆదరణ లేని దేశాలలో ఆటకు ప్రాచుర్యం కల్పించాలనే సాకుతో భారత క్రికెట్ నియంత్రణ మండలి నుంచి భారీగా పన్ను రాయితీలు ఆశిస్తోంది. వచ్చే టి 20 ప్రపంచ కప్ 2021, వన్డే ప్రపంచ కప్ 2023 లకు బిసిసిఐ ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో కనీస పక్షం 150 కోట్ల రూపాయల తగ్గకుండా పన్ను రాయితీలు ఇవ్వాలని ఐసీసీ పట్టుబడుతోంది. దుబాయ్ లో జరిగిన సిఇఓల సమావేశంలో పన్ను రాయితీల అంశంపై ఐసీసీ ఛైర్మన్ శశాంక్ మనోహర్ ఈ విషయంలో గట్టి హామీ కోసం ఒత్తిడి తెచ్చారు.ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ తో ఇతర క్రికెటింగ్ దేశాలు ప్రపంచ కప్ లో ఆడకుండా నిలువరించాలన్న బిసిసిఐ వినతిని ఐసీసీ చాలా తేలికగా తీసుకుంది. ఏ దేశాన్ని ఇతర సభ్య దేశాలతో క్రికెట్ ఆడవద్దని చెప్పడం ఐసీసీ నియమావళికి విరుద్ధమనే ఒకేఒక్క మాటతో భారతీయుల మనోభావాలను దెబ్బతీసిన ఐసీసీ ఛైర్మన్ శశాంక్ మనోహర్…. బిసిసిఐ ఖజానాకు తూట్లు పొడిచేందుకు మాత్రం ముందుకొచ్చారు. ఈ చర్యతో బిసిసిఐకి ఐసీసీ లో ప్రథమ విరోధి అనే పేరును మనోహర్ మరోమారు సార్ధకం చేసుకున్నారు. రెండు వరల్డ్ కప్ ల పేరిట కోట్లాది రూపాయల నిధులను భారతీయుల నుంచి పిండుకునేందుకు ఐసీసీ శతవిధాలుగా ఒత్తిడి తెస్తోంది. భారతీయ పన్ను చట్టాలు ఏ ఒక్క సంస్థ కోసమో మార్చడం సాధ్యం కాదని బిసిసిఐ మొత్తుకుంటున్నా ఐసీసీ వదిలిపెట్టడం లేదు. భారత ప్రభుత్వం పన్ను రాయితీలు కల్పించకపోతే, ఆ బాధ్యత, భారం బిసిసిఐ వహించాలని ఒత్తిడి తెస్తోంది.
 
రాయితీలు ఎందుకు?

అసలు టి20 వరల్డ్ కప్ 2021, వన్డే ప్రపంచ కప్ 2023 లకు ఎందుకోసం, ఏఏ పద్దుల కింద రాయితీలు ఇవ్వాలనే అంశాలపైనా రెండు సంస్థల మధ్య సంపూర్ణ అంగీకారం కుదరడం లేదు. పన్ను రాయితీలు ఇచ్చే అధికారం బిసిసిఐకి లేకపోవడం, ఇండియాలో బ్రాడ్ కాస్టర్లకు ప్రత్యేకంగా రాయితీలు ఇవ్వాల్సిన అవసరమూ బిసిసిఐ కి కన్పించకపోవడంతో రెండు సంస్థల మధ్య అవగాహన సాధ్యం కావడం లేదని విశ్లేషకులు అంటున్నారు. క్రీడా ప్రసారాల పరికరాలకు పన్ను రాయితీల పేరిట ఐసీసీ చేస్తున్న ప్రతిపాదనలు బిసిసిఐకి రుచించడం లేదు. ఐసిసికి భారతదేశంలో క్రికెట్ ప్రసారాలకు సంబంధించిన భాగస్వామి ఇప్పటికే పూర్తిస్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కారణంగా ప్రత్యేక రాయితీలు ఎందుకివ్వాలని బిసిసిఐ పెద్దల వాదన. రెండు సంస్థల వాదనలు ఎలా వున్నా చివరికి ఈ భారం ఆయా టోర్నీల స్పాన్సరర్లపై పడడం ఖాయంగా కన్పిస్తోంది. భారత ప్రభుత్వంపై పన్ను రాయితీల కోసం ఒత్తిడి తెచ్చ పరిస్థితుల్లో బిసిసిఐ లేకపోవడం, ఆరు నూరైనా తమకు రాయితీలు ఇవ్వక తప్పదంటున్న ఐసిసి వైఖరితో స్పాన్సరర్లు అదనపు భారం మోయక తప్పడం లేదు. ఐసీసీ, బిసిసిఐ నిబంధనలు, టోర్నీల ప్రసారాల కాంటాక్టుల్లో పన్ను భారం మీరితే ఆయా ప్రసార సంస్థలు భరించాలని స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అదనపు భారాన్ని ప్రసార సంస్థలపైనే మోపేందుకు ఐసీసీ, బిసిసిఐ సిద్ధమౌతున్నాయి. ఈ వెసులుబాటు కారణంగా వచ్చే సార్వత్రిక ఎన్నికలు ముగిసే దాకా పన్ను రాయితీలపై తేల్చేందుకు బిసిసిఐకి వెసులుబాటు లభించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com