సర్వం తాళమయం:రివ్యూ..

- March 09, 2019 , by Maagulf
సర్వం తాళమయం:రివ్యూ..

తారాగణం : జివి. ప్రకాష్ కుమార్, అపర్ణ బాలమురళి, నెడిముడి వేణు, వినీత్, ఇళంగో కుమారవేల్ 
ఎడిటింగ్ : ఆంటోనీ 
సినిమాటోగ్రఫీ : రవి యాదవ్ 
మ్యూజిక్ : ఏఆర్ రహమాన్ 
నిర్మాత : లతా మేనన్ దర్శకత్వం : రాజీవ్ మేనన్

సర్వం తాళమయం.. టైటిల్ లోనే ఇది సంగీత ప్రధానమైన సినిమా అనే అర్థం ఉంది. ఇప్పటి వరకూ ఏ భాషలో అయినా సంగీత ప్రధానంగా వచ్చిన సినిమాలు ఫ్లాప్ అయిన సందర్భాలు చాలా తక్కువ. కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయినా కనీసం ప్రేక్షకుల హృదయాలనైనా గెలిచాయి. అలాంటి నేపథ్యంలో చాలాకాలం తర్వాత కర్ణాటిక్ శాస్త్రియ సంగీతంలో పాటలు కాకుండా ఓ మృదంగ విద్వాంసుడి కథగా వచ్చిన ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం..

కథ :

జాన్సన్ ఆంటోనీ ఓ దళిత కుర్రాడు(జివి ప్రకాష్). తండ్రి మృదంగాలు తయారు చేస్తుంటాడు. ఆంటోనీ హీరో విజయ్ కి వీరాభిమాని. ఆయన సినిమాలు విడుదలైనప్పుడు థియేటర్స్ వద్ద డ్రమ్స్ వాయిస్తుంటాడు. అందుకోసం చదువును కూడా నిర్లక్ష్యం చేస్తాడు. అదే ఊరిలో మృదంగం వాయించడంలో పద్మభూషణ్ అందుకున్న విద్వాంసుడు పాలకొల్లు రామస్వామి ఆంటోనీ తండ్రి వద్దే మృదంగాలు కొంటుంటాడు. ఓ రోజు తను తయారు చేసిన మృందంగాన్ని అర్జెంట్ గా రామస్వామికి ఇచ్చి రమ్మంటాడు. అలా వెళ్లిన ఆంటోనీ ఆ ప్రోగ్రామ్ లో రామస్వామి ప్రతిభకు ముగ్ధుడై తను కూడా ఎలాగైనా మృదంగం నేర్చుకోవాలనుకుంటాడు. కానీ కర్ణాటిక్ సంగీతం అంటే ఒకే వర్గానికి చెందిన సొత్తుగా ఫీలయ్యే మనుషులు రామస్వామి చుట్టూ ఉంటారు. మరి వారిని దాటుకుని ఆంటోనీ మృదంగం నేర్చుకున్నాడా..? రామస్వామి, ఆంటోనీని శిష్యుడుగా అంగీకరించాడా..? మృదంగాలు తయారు చేసేవాళ్లు దాంట్లో ప్రావీణ్యం సంపాదించే క్రమంలో ఆంటోనీ ఫేస్ చేసిన సమస్యలేంటీ అనేదిమిగతా కథ.

విశ్లేషణ :

కొన్ని సినిమాలు మాత్రమే చూస్తున్నప్పుడు.. తర్వాత ఆనందాన్ని, అనుభూతుల్ని మిగల్చడంతో పాటు అభిప్రాయాల్నీ మారుస్తుంటాయి. లేదా అభిప్రాయాల్లో భేదాలు తెస్తాయి. అంటే ఆ సినిమా ప్రయోజనం నెరవేరినట్టే.. అలా చూస్తే సర్వంతాళమయం ఈ అన్ని ఫీలింగ్స్ ను ఇస్తుంది. సో దర్శకుడు తను ఏదైతే అనుకున్నాడో.. అది ప్రేక్షకులను చేరినట్టే. సినిమా కోసం యేళ్ల తరబడి టైమ్ తీసుకునే మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ రాజీవ్ మేనన్ ఈ సారి లేట్ అయినా మళ్లీ మనల్ని విశ్వనాథ్ కాలంనాటి సినిమాలకు తీసుకువెళ్లాడు. అలాగని ఇది ఈ తరానికి నచ్చని కథాంశం కాదు. బోర్ కొట్టే కథ అస్సలే కాదు. నేటి యూత్ కు కనెక్ట్ అవుతూనే.. శాస్త్రీయ సంగీతం అంటే, కర్ణాటిక్ మ్యూజిక్ అంటే ఒక కులానికి చెందినది కాదని.. సంగీతం వంశంపారంపర్యంగా వచ్చే ఆస్తి కాదని ఖచ్చితంగా చెప్పేశాడు దర్శకుడు. సంగీతం హృదయ సంబంధమైనది. దానికి కులం మతం, ప్రాంతం అంటూ ఏమీ ఉండవని తేల్చేస్తాడు. ఈ క్రమంలో అతను ఎంచుకున్న కథ.. పాత్రలు.. వారి సామాజిక వర్గాలు.. ఇలా దేంట్లోనూ దర్శకుడు రాజీపడలేదు. విమర్శించాల్సిన చోట తగ్గలేదు.. ప్రశంసించాల్సిన చోటా తగ్గలేదు. అందుకే ఈ కథ చూస్తున్నంత సేపూ ఓ నిజాయితీ కనిపిస్తుంది. ఎన్నో సన్నివేశాలు మనసున్న ప్రతి ఒక్కరినీ కదిలిస్తాయి. సినిమాలో చాలా పాత్రలున్నా.. ప్రధానంగా ఆంటోనీ, మృదంగ విద్వాంసుడు రామస్వామి(నెడిముడి వేణు) అతని మాజీ శిష్యుడు మణి(వినీత్) చుట్టే తిరుగుతుంది.

ఇక సంగీతం పేరుతో సాగే టివి ప్రోగ్రామ్స్ పైనా సెటైర్ వేసిన దర్శకుడు ఫైనల్ గా ఆ ప్రోగ్రామ్స్ వల్ల టాలెంట్ కూడా తెలుస్తుందని ఒప్పుకోక తప్పలేదు. అలాగే ‘‘కర్ణాటక సంగీతం అంటే బావి లాంటిది అనుకున్నాం.. కానీ అది నది. నిరంతరం ప్రవహిస్తుంది. అందులో ఎన్నో పిల్లకాలువలు, ఏర్లు, కలుస్తుంటాయి. అయినా దాని ప్రవాహం స్వచ్ఛంగానే ఉంటుంది’’ అని ప్రధాన పాత్రధారి రామస్వామితో చెప్పించిన విధానమూ ఆకట్టుకుంటుంది. ఈ సీన్ మనకు కె విశ్వనాథ్ ‘సప్తపది’ క్లైమాక్స్ ను గుర్తుకు తెస్తుంది. ఇక చాలామంది చెప్పుకున్నట్టు ఇది శంకరాభరణం లాగానే శాస్త్రీయ సంగీత నేపథ్యంలోనే ఉన్నా.. అదిప్పుడు ప్రమాదంలో ఉంది. దాన్ని కాపాడాలనే తాపత్రయం కనిపించదు. మార్పును ఆహ్వానించాలి అనే పాజిటివ్ లైన్ తో ముగుస్తుంది.


ఆర్టిస్టుల పరంగా ప్రతి ఒక్కరూ హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఇచ్చారు. హీరో జీవి ప్రకాష్ కు ఇది ఖచ్చితంగా లైఫ్ టైమ్ మెమరబుల్ రోల్. కానీ పాలకొల్లు రామస్వామి పాత్రలో నటించిన మళయాల లెజెండరీ యాక్టర్ నెడిముడి వేణు నటనే సినిమాకు హైలెట్. నెగెటివ్ రోల్ లో కూడా వినీత్ ఆకట్టుకున్నాడు. హీరోయిన్ అపర్ణ బాలమురళి పాత్ర పరిమితం అయినా.. హీరో గోల్ రీచ్ అయ్యేందుకు తోడ్పడుతుంది.. జివి ప్రకాష్ తండ్రి పాత్రలో నటించిన మరో సూపర్ టాలెంటెడ్ యాక్టర్ ఇళాంగో కుమారవేల్ మరోసారి తన ముద్ర వేస్తాడు.

ఇక ఈ సినిమాకు టెక్నికల్ సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ కుదిరింది. ఏఆర్ రహమాన్ సంగీతం మెస్మరైజ్ చేస్తుంది. పాటలు కానీ, నేపథ్య సంగీతం కానీ మళ్లీ పాత రహమాన్ ను చూపిస్తాయి. ఒక రకంగా రహమాన్ సంగీత ఈ సినిమాకు బ్యాక్ బోన్. తర్వాత సినిమాటోగ్రఫీ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుంది. ప్రతి ఫ్రేమ్ పెయింటింగ్ లా ఉంటుంది. మాటలు సూపర్బ్. పాటలూ డబ్బింగ్ సినిమాలా కాకుండా స్ట్రెయిట్ సినిమాలా కనిపిస్తాయి. లిరిక్స్ ఆకట్టుకుంటాయి. ఆర్ట్ వర్క్, ఎడిటింగ్ ఏదీ తక్కువ అని చెప్పలేం. ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతమే.. ఇక దర్శకుడు రాజీవ్ మీనన్ గురించి దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అతన్లాంటి దర్శకుడు ఇలా మరీ టైమ్ తీసుకోకుండా కనీసం మూడేళ్లకో సినిమా అయినా తీస్తే.. సినిమాకు కథ వాల్యూ ఎంత గొప్పదో న్యూ కమర్స్ కు తెలుస్తుంది..

ఫైనల్ గా : హృదయమున్న ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా.. సర్వం తాళమయం

మాగల్ఫ్ రేటింగ్ : 3.75/5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com