బాలికల అపహరణ విషయంలో పాక్‌పై ఒత్తిడి పెంచిన సుష్మా స్వరాజ్‌

- March 26, 2019 , by Maagulf
బాలికల అపహరణ విషయంలో పాక్‌పై ఒత్తిడి పెంచిన సుష్మా స్వరాజ్‌

దిల్లీ: పాకిస్థాన్‌లో ఇద్దరు హిందూ అక్కాచెల్లెళ్లను అపహరించి బలవంత మతమార్పిడి చేయించిన ఘటనపై కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్‌ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఇద్దరు బాలికలను వెంటనే ఇంటికి పంపాలంటూ పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై ట్విటర్ వేదికగా ఒత్తిడి పెంచారు. మైనర్లయిన వారు మతమార్పిడి నిర్ణయాన్ని సొంతంగా ఎలా తీసుకోగలరని చురకలంటించారు.''అమ్మాయిల వయసుల విషయంలో ఎలాంటి అనుమానాలు లేవు. రవీనా 13 సంవత్సరాలు కాగా రీనాకు 15 ఏళ్లు. అంత చిన్న వయసులో వారిద్దరూ మతమార్పిడి, వివాహ నిర్ణయాన్ని సొంతంగా తీసుకున్నారంటే..నయా పాకిస్థాన్‌ ప్రధాని కూడా నమ్మలేరు. వెంటనే వారిని వాళ్ల ఇంట్లో అప్పగించండి'' అని సుష్మా స్వరాజ్‌ అన్నారు.

పాకిస్థాన్‌ సింధ్‌ ప్రావిన్స్‌లో హోలీ పర్వదినాన ఇద్దరు హిందూ అమ్మాయిలను మతఛాందసవాదులు అపహరించిన విషయం తెలిసిందే. బలవంతంగా మార్పిడి చేసి వారికి వివాహం జరిపించారు. ఈ ఘటనపై అక్కడి హిందూ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. వారి సోదరుడు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకూ ఏడుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఉదంతం వెలుగులోకి వచ్చిన వెంటనే సుష్మాస్వరాజ్‌ అక్కడి భారత హై కమీషన్‌ కార్యాలయాన్ని నివేదిక కోరారు. దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ కూడా అక్కడి అధికారులను ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com