అనుమానాలు నిజమయ్యాయి.. ఫలితాల్లో తప్పుల వెనుక అసలు కథ

- April 28, 2019 , by Maagulf
అనుమానాలు నిజమయ్యాయి.. ఫలితాల్లో తప్పుల వెనుక అసలు కథ

అనుమానాలు నిజమయ్యాయి.. ఆరోపణలు వాస్తవమని తేటతెల్లమైంది. ఇంటర్‌ ఫలితాల్లో తప్పులు జరిగాయని త్రిసభ్య కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్‌ రెడ్డి. గతేడాది 80 శాతానికి పైగా మార్కులు సంపాదించి ఈ సారి ఫెయిలైన విద్యార్థులకు ఉచితంగా రీవెరిఫికేషన్‌ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

విద్యార్థుల జీవితాలతో ఇంటర్‌ బోర్డు.. గ్లోబరీనా సంస్థలు ఆటలాడుకున్నాయనే కారణంతో తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. ధార్నాలు హోరెత్తుతున్నాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనలు నిజమేనని త్రిసభ్య కమిటీ తేల్చింది. ఇటీవల వెల్లడించిన తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో తప్పులు దొర్లాయని త్రిసభ్య కమిటీ తేల్చినట్లు విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ప్రకటించారు. 531 మంది జాగ్రఫీ విద్యార్థులకు ప్రాక్టికల్‌ మార్కులు పడలేదని కమిటీ గుర్తించినట్లు తెలిపారు. 496 మంది విద్యార్థుల విషయంలో పరీక్షా కేంద్రం కేటాయింపులో పొరపాట్లు జరిగాయని అందువల్లే ఆబ్‌సెంట్‌-పాస్‌ అనే గందరగోళం ఏర్పడిందని వివరించారు. ఒక ఓఎంఆర్‌ పత్రంలో మాత్రం సరిగ్గా బబుల్‌ చేయకపోవడంతో 99 మార్కులకు బదులు సున్నా మార్కులు వచ్చాయని అన్నారు. దీనికి సంబంధించిన అధికారిపై తక్షణం చర్యలు తీసుకుంటామని చెప్పారు.

గతేడాది 80 శాతానికి పైగా మార్కులు సంపాదించి ఈసారి ఫెయిలైన విద్యార్థులకు ఉచితంగా రీవెరిఫికేషన్‌ చేస్తామని హామీ ఇచ్చారు. హాల్‌టికెట్ల జారీ దగ్గర నుంచి ఫలితాల వెల్లడి వరకు ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత ఇచ్చి ఉంటే బాగుండేదని కమిటీ చెప్పిందన్నారు జనార్థన్‌ రెడ్డి. గతంతో పోలిస్తే పబ్లిష్‌ చేసినప్పుడు కొన్ని తప్పులు దొర్లిన విషయాన్ని కమిటీ గుర్తించిందన్నారు. సాంకేతిక సమస్యలతోనే 99 మార్కులకు గాను.. 0 మార్కులు పడ్డాయని, జంబ్లింగ్‌ విధానంలోనూ కొన్ని సమస్యలు వచ్చాయని అభిప్రాయపడ్డారు.ఇటు త్రిసభ్య కమిటీ రిపోర్ట్‌ వచ్చినా.. అటు విద్యాశాఖ కార్యదర్శి గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినా.. తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు తగ్గడం లేదు. ఇంటర్ బోర్డు ముందు ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com