మసూద్ అజర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించిన ఐక్యరాజ్యసమితి.. ఇది భారత్ విజయమన్న మోదీ

- May 02, 2019 , by Maagulf
మసూద్ అజర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించిన ఐక్యరాజ్యసమితి.. ఇది భారత్ విజయమన్న మోదీ

జైషే మొహమ్మద్ అధ్యక్షుడు మౌలానా మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతామండలి నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ ఈ ప్రయత్నాన్ని అడ్డుకుంటూ వచ్చిన చైనా ఇప్పుడు తన వైఖరి మార్చుకోవడంతో ఈ చర్య సాధ్యమైంది.

"ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు భారీ విజయం"
ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరుకు ఈ చర్య ఊపునిస్తుందని, దీనికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు అని ఐక్యరాజ్యసమితిలో భారత రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు. "ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఐక్యరాజ్య సమితి ఆంక్షల కమిటీ ఛైర్‌పర్సన్ తెలియచేశారని సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు. 2009 నుంచి మనం దీనికోసం ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఇటీవల కూడా భారత్ మరోసారి దీనికోసం ప్రయత్నించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయంగా భారత్‌ చేస్తున్న పోరాటానికి ఇది మద్దతునిచ్చే అంశం. భారత్‌కు సంబంధించి ఇది పెద్ద విజయం" అని ఆయనన్నారు. "యూఎస్, యూకే, ఫ్రాన్స్‌లతో పాటు ఎన్నో ఇతర దేశాలు కూడా ఎలాంటి షరతులూ లేకుండా ఈ తీర్మానానికి మద్దతు పలికారు. ఉగ్రవాదానికి ఏమాత్రం సహించబోమన్న దేశాలన్నింటికీ ఇదో పెద్ద విజయం" అని అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు.

భారత ప్రధాని మోదీ ఏమన్నారు...
ఇది భారతదేశానికి గొప్ప విజయమని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఆయన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ, "మసూద్ అజర్‌ను ఐక్యరాజ్యసమితి తీవ్రవాదిగా ప్రకటించాలనే విషయంలో ప్రపంచమంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది. ఇది ఎంతో సంతోషించాల్సిన విషయం. భారతదేశం ఎంతో కాలంగా తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తోంది. ఈ పోరాటంలో భారతదేశానికి లభించిన గొప్ప విజయం" అని అన్నారు. అంతేకాకుండా, ఇది ఆరంభం మాత్రమేనని, ఇక ముందు ఇంకా చాలా జరుగుతాయని కూడా ఆయన అన్నారు.

చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గెంగ్ షువాంగ్ ఏప్రిల్ 30న బీజింగ్‌లో మీడియాతో మాట్లాడారు.
ప్రశ్న: పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే సంస్థపై చైనా వైఖరి మారుతోందంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత?
1267 కమిటీ జాబితాలో మసూద్ పేరును చేర్చడంపై మా వైఖరిని ఎన్నోసార్లు స్పష్టం చేశాం. ఓ రెండు అంశాలను ఇప్పుడు వెల్లడించాలనుకుంటున్నా. చర్చలు, సంప్రదింపుల ద్వారా ఈ అంశాన్ని పరిష్కరించాలనేది మొదటి అంశం. చాలామంది సభ్యులు ఇదే కోరుకుంటున్నారని భావిస్తున్నా. దీనికి సంబంధించిన సంప్రదింపులు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ అంశంపై ఇప్పటికే కొంత పురోగతి కూడా ఉంది. సభ్యులందరి సహకారంతో ఈ అంశం పరిష్కారమవుతుందని భావిస్తున్నా.

ప్రశ్న: మే 1వ తేదీన మసూద్ అజార్‌పై నిషేధం విధించే అంశంపై చైనా తన వ్యతిరేకతను విడనాడుతోందంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత?
దీనిపై మా వైఖరి సుస్పష్టం. సభ్యులందరితో చర్చలు జరుపుతున్నాం. సరైన చర్చల ద్వారా ఈ అంశం పరిష్కారమవుతుందని మేం నమ్ముతున్నాం. నిర్మాణాత్మక విధానంలో సమస్య పరిష్కారానికి చర్చలు, సంప్రదింపులు కొనసాగుతాయి. 

నిషేధంపై పాకిస్తాన్ ఏమంది? 
రాజకీయంగా ప్రేరేపితమైన ప్రయత్నాలే దీనికి కారణమని మాకు తెలుసు. కమిటీలో చర్చలు జరుగుతున్న రహస్య అంశాలపై ప్రత్యేకించి భారత మీడియాలో వచ్చిన కథనాలే దీనికి కారణం. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే, పుల్వామా దాడితో సంబంధం లేకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదేదో తమ విజయమని, తమ వాదనలు నిజమయ్యాయని భారత్ లేదా భారత మీడియా పేర్కొనడం అవాస్తవం, అర్థరహితం. తమ భూభాగం నుంచి ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలు జరగడానికి వీల్లేదని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటనకు అనుగుణంగానే మా చర్యలుంటాయి. కశ్మీర్‌లో జరుగుతున్న ఉగ్రవాద ఘటనలకు మసూద్‌కు సంబంధం ఉందనే ఆరోపణలను మేం అంగీకరించలేదు. అందుకే ఇంతకాలం మసూద్‌ను నిషేధిత ఉగ్రవాదుల జాబితాలో చేర్చలేదు. కానీ, కశ్మీర్లో జరుగుతున్న హింసకు కారణాలు అంతర్గతం, స్వతంత్రం కోసం జరుగుతున్నవి, అందువల్లే మేం ఇప్పుడు దీని వల్ల నష్టపోయేదేమీ లేదు. ఆస్తుల జప్తు, ఆయుధ వినియోగంపై ఆంక్షలు, ప్రయాణాలపై నిషేధం వంటివి అమల్లోకి వస్తాయి. వాటిని మేం అమలుచేస్తాం.

చైనా ఏమంటోంది? 
అన్ని పక్షాల మధ్యన ఏకాభిప్రాయం, తగిన సాక్ష్యాధారాల ఆధారంగా నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరిగే ఏ ప్రక్రియకైనా చైనా మద్దతునిస్తుంది. 1267 కమిటీకి కూడా కొన్ని నిర్దిష్ట విధానాలున్నాయి. ఇటీవలే ఈ అంశానికి సంబంధించిన సాక్ష్యాలు, ఇతర ఆధారాలను సంబంధిత దేశాలు పునస్సమీక్షించి 1267 కమిటీకి సమర్పించాయి. వీటన్నింటినీ కూలంకషంగా అధ్యయనం చేయడంతో పాటు, సంబంధిత పక్షాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత మసూద్‌ను నిషేధిత జాబితాలో చేర్చేందుకు చైనాకు ఇక ఎలాంటి అభ్యంతరాలూ లేవు. అంతర్జాతీయంగా ఉగ్రవాదంపై పోరులో మనమంతా ఐక్యరాజ్య సమితి నిబంధనలు, విధానాలకు అనుగుణంగా నడచుకోవాల్సిన అవసరాన్ని, పరస్పర గౌరవం, చర్చల ద్వారా విభేదాల పరిష్కారం, ఏకాభిప్రాయ సాధన, సాంకేతిక అంశాలను రాజకీయం చేసే ప్రయత్నాలను అడ్డుకోవడం వంటి ఎన్నో విషయాలను అందరూ గౌరవించాలనే ఈ నిర్ణయం స్పష్టం చేస్తుంది.
 
మసూద్ అజర్ ఎవరు?
మౌలానా మసూద్ అజర్ 1968లో తూర్పు పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో పుట్టారు. కరాచీలోని బినోరీ పట్టణంలోని మతపరమైన జామియా ఉలూమ్-ఇ-ఇస్లామీ యూనివర్సిటీలో చదివారు. తర్వాత అక్కడే టీచర్ అయ్యారు. కరాచీలో ఉన్నప్పుడు అప్ఘానిస్తాన్‌లో జీహాద్ ట్రైనింగ్ కోర్స్ తీసుకోమని తనకు సూచించారని ఆయన పుస్తకం 'ది విర్చూస్ ఆఫ్ జీహాద్' అనే పుస్తకంలో చెప్పినట్లు కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి. 1994లో అప్పట్లో లీడింగ్ మిలిటెంట్ గ్రూప్ అయిన హర్కతుల్ ముజాహిదీన్ కోసం శ్రీనగర్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలతో భారత అధికారులు మసూద్ అజర్‌ను అరెస్ట్ చేశారు. కానీ 1999లో ఐసీ-184 విమానాన్ని హైజాక్ చేశాక దానిని అప్ఘానిస్తాన్‌లోని కాందహార్ తీసుకెళ్లిన సమయంలో బంధీలను విడిపించడానికి బదులు మసూద్, మరో ఇద్దరిని జైలు నుంచి విడుదల చేసినపుడు అతడి పేరు పతాక శీర్షికల్లో వచ్చింది. 1999లో తిరిగి పాకిస్తాన్ చేరుకోగానే మసూద్ అజర్ జైష్-ఎ-మొహమ్మద్ సంస్థను స్థాపించారు.

ఐక్యరాజ్యసమితి 2002లో 'జైష్-ఎ-మొహమ్మద్'ను టెర్రరిస్ట్ సంస్థల జాబితాలో చేర్చడంతో పాకిస్తాన్ దానిని నిషేధించింది. కానీ జైష్-ఎ-మొహమ్మద్‌పై నిషేధం విధించినా మసూద్ అజర్‌ను మాత్రం అరెస్ట్ చేయలేదు. అతడిని జేఈఎంకు బలమైన పట్టు ఉన్న దక్షిణ పంజాబ్‌లోని స్వేచ్ఛగా జీవించేలా వదిలేశారని పాకిస్తాన్ వార్తాపత్రిక డాన్ 2014 ఫిబ్రవరి 2న కథనం ప్రచురించింది.

మోస్ట్ వాంటెడ్ టాప్ 20 లిస్టులో ఉన్న మసూద్ అజర్‌ను తమకు అప్పగించాలని పాకిస్తాన్‌ను భారత్ కోరింది. 2008లో ముంబయి దాడులకు లష్కరే తోయిబా కారణమని ఆరోపించిన భారత్ మసూద్ అజర్‌తోపాటు తమ జాబితాలో ఉన్న అందరినీ అప్పగించాలని పాకిస్తాన్‌ను కోరింది. కానీ పాక్ వారిని ఇప్పటికీ అప్పగించలేదు. 2016లో పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌పై దాడి తర్వాత పాక్ అధికారులు మసూద్ అజర్‌ను 'ప్రొటెక్టివ్ కస్టడీ'లోకి తీసుకున్నారు. కానీ అతడిపై ఈ దాడి అభియోగాలు మోపలేదు.

మసూద్ అజర్‌ను అంతర్జాతీయ టెర్రరిస్టుగా ప్రకటించాలని 2016లో భారత్ ఐక్యరాజ్యసమితికి ప్రతిపాదనలు పంపింది. అయితే, పాకిస్తాన్ మిత్రదేశం చైనా భారత ప్రయత్నాలను 'సాంకేతిక కారణాల' సాకుతో అడ్డుకుంది. 2016లో భారత్ ప్రతిపాదనను వీటో అధికారం ఉపయోగించి బ్లాక్ చేసింది. 2017లో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ మసూద్ అజర్‌కు వ్యతిరేకంగా పెట్టిన అదే ప్రతిపాదనను కూడా చైనా మరోసారి అడ్డుకుంది. మసూద్ అజర్ ప్రాణాపాయ పరిస్థితిలో మంచానికే పరిమితమైనట్టు భారత నిఘా వర్గాల ద్వారా తెలిసిందని 2018లో హిందుస్తాన్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com