సినిమా ట్విస్టులను మించిన కర్నాటక రాజకీయ సంక్షోభం

- July 15, 2019 , by Maagulf
సినిమా ట్విస్టులను మించిన కర్నాటక రాజకీయ సంక్షోభం

కర్ణాటక:అసమ్మతి చల్లారడం లేదు. రెబల్‌ ఎమ్మెల్యేలు దారికి రావడం లేదు. మనసు మార్చుకుని సొంత ఇంటికి వచ్చినట్టే వచ్చిన ఎమ్మెల్యేలు..మళ్లీ యూటర్న్‌ తీసుకోవడంతో కర్నాటక సంకీర్ణం మరోసారి గందరగోళంలో పడింది. సినిమా ట్విస్టులను మించి కర్నాటకలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఎత్తుకుపై ఎత్తులు, వ్యూహాలకు, ప్రతివ్యూహాలతో కన్నడ పొలిటికల్‌ ఎపిసోడ్‌ రసవత్తరంగా మారింది. అసమ్మతి ఎమ్మెల్యేలు నాగరాజు, సుధాకర్‌ మళ్లీ రెబల్‌ గూటికి చేరడంతో తలలు పట్టుకుంటున్నారు కాంగ్రెస్‌, జేడీఎస్‌ నేతలు.

బుజ్జగింపులతో అసమ్మతి నేతలు ఏమాత్రం లొంగడం లేదు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ కూడా రంగంలోకి దిగారు. శనివారమే ఆయన బెంగళూరుకు చేరుకుని వరుస సమావేశాలు నిర్వహించారు. రెబల్ ఎమ్మెల్యేలను ఎలా దారికి తెచ్చుకోవాలనేదానిపై చర్చించారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసిన కథ మళ్లీ మొదటికి రావడంతో వ్యూహాలకు పదును పెట్టారు కాంగ్రెస్‌-జేడీఎస్‌ నేతలు.

ఇవాళ ప్రారంభమయ్యే శాసనసభా సమావేశాల్లోనే సంకీర్ణ ప్రభుత్వం భవితవ్యం తేలాలా కనిపిస్తోంది. ఇప్పటికే తాను బలపరీక్షకు సిద్ధమని ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించారు. ఈ నేపథ్యంలో విశ్వాస పరీక్షను ఎదుర్కొంటారా లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు ఇవాళ సమావేశం కానున్న కాంగ్రెస్‌ శాసన సభా పక్షం.. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. తదుపరి ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై సమాలోచనలు చేయనున్నారు.

ఎన్ని ప్రయత్నాలు చేసినా రెబల్‌ ఎమ్మెల్యేలు మాత్రం బెట్టు వీడడం లేదు. ఎవరెన్ని చెప్పినా మా రాజీనామాలను వెనక్కి తీసుకునేది లేదంటూ ముంబయిలో ఉన్న అసమ్మతి నేతలు మరోసారి స్పష్టం చేశారు. నాగరాజు కూడా ముంబై రెబల్‌ శిబిరంలో చేరిపోయారు. ఆయనతో పాటు బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి అశోక్‌ కూడా వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి బీజేపీ లాక్కొంటోందని కాంగ్రెస్‌-జేడీఎస్ నేతలు మండిపడుతున్నారు. ఒక్కొక్కరి 50 నుంచి 100 కోట్లు ఆశచూపి ఆకర్షిస్తోందని ఆరోపిస్తున్నారు.

సంకీర్ణ సర్కార్ మైనార్టీలో పడిందని.. సీఎం కుమారస్వామి తక్షణమే రాజీనామా చేయాలని బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప డిమాండ్‌ చేశారు. సీఎంకు నిజంగా ప్రజాస్వామ్యంపై గౌరవముంటే.. రాజీనామా చేసి ఇవాళ సభలో బలపరీక్షకు సిద్ధం కావాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే కాంగ్రెస్‌, జేడీఎస్‌, బీజేపీ నేతలు.. తమ ఎమ్మెల్యేలను హోటల్స్‌, రిసార్ట్స్‌ల్లో ఉంచి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com