తీరం వెంబడి హై అలెర్ట్ ప్రకటించిన భారత నేవీ

- August 25, 2019 , by Maagulf
తీరం వెంబడి హై అలెర్ట్ ప్రకటించిన భారత నేవీ

లష్కరే తొయిబాకు చెందినట్లుగా అనుమానిస్తున్న ఉగ్రవాదులు తమిళనాడు రాష్ట్రంలోకి ప్రవేశించారన్న నిఘా వర్గాల సమాచారంతో భారత నేవి అలర్ట్ అయ్యింది. తీర ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించింది. కోయంబత్తూరులో హై అలర్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీలంక నుంచి సముద్ర మార్గంలో తీవ్రవాదులు చొరబడి ఉంటారనే నిఘా వర్గాల హెచ్చరికల మేరకు తమిళనాడులో భద్రతను కట్టుదిట్టం చేశారు.

కోయంబత్తూరులో తీవ్రవాదులు చొరబడినట్టు వచ్చిన వార్తలతో అప్రమత్తమైన పోలీసులు అణువణువూ గాలిస్తున్నారు. ప్రముఖ ఆలయాలు, మసీదు, చర్చిలలో బాంబుస్క్వాడ్ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించింది. కోయంబత్తూరులోని ప్రధాన కూడళ్లలో భారీస్థాయిలో బలగాలను మోహరించిన పోలీసు యంత్రాంగం నగరంతో పాటు శివారు ప్రాంతాల్ని కూడా జల్లెడ పడుతోంది. ప్రజలు ఆందోళన చెందవద్దని అపరిచితులతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పాకిస్తాన్‌, శ్రీలంకకు చెందిన ఆరుగురు తీవ్రవాదులు తమిళనాడులోకి చొరబడి ఉంటారని నిఘా వర్గాలు హెచ్చరించాయి.

మరోవైపు గుజరాత్ సముద్ర తీరంలో పాకిస్థాన్‌కు చెందిన రెండు పడవలు కనిపించాయి. కచ్ జిల్లా హరామి నాలా ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న మత్స్యకార పడవలను భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. పడవల్లో అనుమానాస్పద వస్తువులేవీ కనిపించకపోయినా లోతైన దర్యాప్తు నిర్వహించాలని భద్రతా బలగాలు నిర్ణయించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com