ఒక్క మహిళ బిందెతో బయట కనిపించినా ఎమ్మెల్యే రాజీనామా
- January 11, 2016
గోదావరి నీటితో మీ పాదాలను అభిషేకిస్తా రూ.62 వేల కోట్ల ప్రణాళిక పద్దుతో రాష్ట్ర బడ్జెట్ దుబ్బాక పర్యటనలో కేసీఆర్ ఆంధ్రప్రభ దినపత్రిక తెలంగాణ ఎడిషన్ రాష్ట్రం ఏర్పాటైతే నిధులకు కొరత ఉండబోదని తాను ఆనాడే చెప్పానని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలిపారు. సమైక్య రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్లో కేవలం రూ.48 కోట్లే ప్లానింగ్ ఫండ్‌గా పెట్టారని కేసీఆర్ గుర్తు చేశారు. స్వరాష్ట్రంలో ఇప్పుడు రాబోయే బడ్జెట్లో రూ. 62 వేల కోట్లు ప్రణాళిక పద్దు ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ మాసం నుంచి పగటి పూట సాగు కోసం 9 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. మిషన్ భగీరథ మొదటి విడతలో రాష్ట్రంలోని 10 నియోజకవర్గాలకు ఏప్రిల్ 30 నాటికి మంచినీటిని అందించబోతున్నామని స్పష్టం చేశారు. మెదక్ జిల్లా, దుబ్బాక నియోజకవర్గంలో సోమవారం కేసీఆర్ పర్యటించారు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి దుబ్బాక నియోజకవర్గంపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష జరిపారు. స్థానిక వెంకటేశ్వర స్వామి ఆల యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి చిన్ననాటి మిత్రులు, విద్యాభ్యాసం చేసిన గురువులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. సమీక్ష సమావేశంలో కేసీఆర్ స్థానిక ప్రజా ప్రతినిధులను అభివృద్ధి వైపు కార్యోన్ముఖులను చేశారు. లీడర్ అంటే ఇలా ఉండాలంటూ పలు సూచనలు చేశారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చిరకాలం నిలిచిపోయే పనులు చేసి కథానాయకుడిగా పేరు తెచ్చుకోవాలన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటున్నామని వివరించారు. ఇంతటి నిధులు ఎక్కడివని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకొస్తూ తాను ఆనాడే చెప్పానని స్వపరిపాలనలో మన వనరులు మనకే ఉంటే నిధులకు ఎలాంటి ఢోకా ఉండదని వివరించారు. సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రవేశపెట్టిన లక్ష 60 వేల కోట్ల బడ్జెట్లో ప్లాన్ ఫండ్ కేవలం 48 కోట్లే అని గుర్తు చేశారు. ఈ దఫా మన రాష్ట్ర బడ్జెట్లో ప్లాన్ ఫండ్ రూ. 62 వేల కోట్లు ఉండబోతుందని చెప్పారు. ముందు చెప్పిన విధంగానే విద్యుత్ సమస్యను అధిగమించామని తెలిపారు. ఇక వచ్చే ఏప్రిల్ నుంచి 9 గంటల పాటు పగటి పూట సాగుకు విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ఏప్రిల్ 30 నాటికి మిషన్ భగీరథ పథకంలో భాగంగా మెదక్ జిల్లాలోని దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలతో పాటు రాష్ట్రంలోని మరో ఏడు నియోజకవర్గాలకు ఇంటింటికి నల్లా బిగించి మరీ తాగునీరు అందించబోనున్నామని పేర్కొన్నారు. ఇకపై తాగునీటి కోసం ఏ ఒక్క మహిళ బిందెతో బయట కనిపించినా స్థానికంగా ఉండే సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు రాజీనామా చేయాలన్నారు.సుదీర్ఘంగా వివిధ అంశాలపై ప్రసంగించిన కేసిఆర్ దుబ్బాక నియోజకవర్గంపై వరాల జల్లు కురి పించారు. ఎమ్మెల్యేతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు అడిగిన దానికంటే ఎక్కువ నిధులు కేటాయించి అందరిని ఆశ్చర్య పరిచారు. అప్పటికప్పుడు నిధుల మంజూరుకు సంబందించిన జీవోలను తెప్పించి ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్‌రావు, డిప్యూటి స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, కలెక్టర్ రోనాల్డ్‌రోస్, స్మితసబర్వాల్, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, బాబుమోహన్, చింత ప్రభాకర్, మదన్‌రెడ్డి, జెడ్పీచైర్‌పర్సన్ ఎర్రగొల్ల రాజమణిమురళీయాదవ్, జేసి వెంకట్రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









