మాట నిలబెట్టుకోలేని స్థితిలో కేసీఆర్
- October 30, 2019
హైదరాబాదు: కేసీఆర్ గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతుబంధు పథకంకు కొన్ని ఇబ్బందులు తప్పడంలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఈ సారి రైతులకు రైతుబంధు పథకం కింద ఇవ్వాల్సిన నగదు జాప్యం అయ్యేలా కనిపిస్తోంది. ఒకవేళ రైతు బంధు పథకానికి ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఇచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అక్టోబర్ నెల జీతాలు చెల్లించలేని పరిస్థితి తలెత్తుతుందని కేసీఆర్ సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
రైతు బంధు జాప్యంకు నిధుల కొరతే కారణమా..?
ఖజానాలో నిధుల కొరత ఉన్నందున ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని కాస్త ఆలస్యంగా అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రైతు బంధు పథకాన్ని ఈ సారి కాస్త ఆలస్యం చేసి ముందుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని ఆర్థికశాఖకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఖరీఫ్ మరియు రబీ సీజన్లకుగాను ప్రతి రైతుకు ఎకరాకు రూ.5000 ఇస్తూ కేసీఆర్ ప్రభుత్వం గతేడాది రైతు బంధు పథకం ప్రారంభించింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రబీ ఖరీఫ్ సీజన్లకు రూ.12వేల కోట్లు బడ్జెట్‌ను కేటాయించింది. అయితే నిధుల కొరత కారణంగా ఈ సారి చెల్లింపుల్లో ఆలస్యమయ్యేలా కనిపిస్తోందని ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి.
ఉద్యోగుల జీతాలు చెల్లించేందుకు రూ. 2300 కోట్లు అవసరం
ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్న ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు రూ. 2300 కోట్లు ప్రతినెల అవసరం అవుతాయి. ఇక ప్రభుత్వం తరపున పలు ప్రాజెక్టు పనుల పూర్తిచేసేందుకు కాంట్రాక్ట్ ఇచ్చిన కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతోంది. ఇప్పటికే కాంట్రాక్టర్లకు ఏడాదిగా బిల్లులు చెల్లించలేదని సమాచారం. ఇదిలా ఉంటే రైతుబంధు పథకం కింద ఖరీఫ్ సీజన్‌కు 40 లక్షల మంది రైతులకు రూ.4,400 కోట్లు ప్రభుత్వం సహాయం చేసింది. అయితే ఇదే ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన మరో 14 లక్షల మంది రైతులకు ఇంకా డబ్బులు చెల్లించలేదని సమాచారం.
10 ఎకరాల సీలింగ్ విధానం తీసుకొచ్చే ప్రతిపాదన..?
ఇదిలా ఉంటే రైతు బంధు పథకం అమలు చేసేందుకు 10 ఎకరాలకు సీలింగ్ విధానం తీసుకురావాలని ప్రభుత్వం ప్రతిపాదించనున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రతి రైతుకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు రూ.5వేలు ఇవ్వడం వల్ల కొందరు ధనవంతులైన రైతులు బాగా లాభపడుతున్నారనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో సీలింగ్ పద్ధతిని తీసుకురావాలని ప్రభుత్వం ప్రతిపాదించనున్నట్లు సమాచారం. ఇలా 10 ఎకరాల వరకు సీలింగ్ విధించడం వల్ల ఏడాదికి రూ.2500 కోట్లు ఆదా అవతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
వ్యవసాయ శాఖ గణాంకాలు ఏం చెబుతున్నాయి..?
వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం తెలంగాణలో 50.91 లక్షల రైతులు ఉన్నారు. ఇందులో 7.39శాతం మంది రైతులు ఎకరం లేదా అంతకంటే తక్కువగా భూమి కలిగి ఉన్నారు. మరో 15.62శాతం మంది రైతులకు ఒకటి లేదా రెండెకరాల భూమి కలిగి ఉండగా.. 16.67 శాతం మందికి మూడు నుంచి నాలుగు ఎకరాలు ఉన్నట్లు వ్యవసాయ శాఖ పేర్కొంది. ఇక నాలుగు నుంచి ఐదెకరాల భూమి ఉన్నవారు 13.59శాతం ఉండగా ఐదు లేదా 10 ఎకరాలలోపు ఉన్న రైతులు 21.10శాతం ఉన్నారు. ఇక 10 ఎకరాల పైన ఉన్నవారు 10.85శాతంగా ఉన్నట్లు వ్యవసాయశాఖ గణాంకాలు చెబుతున్నాయి.
విమర్శలకు దిగిన ప్రతిపక్షాలు
రైతు బంధు పథకం అమల్లో ప్రభుత్వం జాప్యం వహించడంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. గతేడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆగమేఘాలపై ప్రభుత్వం రబీ సీజన్‌కోసం అక్టోబర్‌లో రైతు బంధు పథకం కింద రైతులకు డబ్బులు చెల్లించిందని, ఖరీఫ్ సీజన్‌కోసం గతేడాది జూన్‌లోనే డబ్బులు చెల్లించిందని చెప్పారు. కానీ ఈసారి నవంబర్ నెల వస్తున్నప్పటికీ రబీ సీజన్‌కు చెల్లించాల్సిన డబ్బులపై స్పష్టత ఇవ్వడం లేదని జీవన్ రెడ్డి విమర్శించారు. ప్రధానమంత్రి సమ్మాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం మూడు ఇన్స్‌టాల్‌మెంట్స్‌లో రైతులకు డబ్బులు చెల్లిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చెల్లించడం లేదని మండిపడ్డారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..