ఎన్నారై విద్యార్థులకు శుభవార్త.!

- November 08, 2019 , by Maagulf
ఎన్నారై విద్యార్థులకు శుభవార్త.!

ఎన్నారైలకు భారత ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎక్కువ మంది ఎన్నారై పిల్లలు ఇప్పుడు ఉన్నత విద్యను అభ్యసించడానికి స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం వారి తల్లిదండ్రుల నెలవారీ ఆదాయ పరిమితిని తాజాగా భారత ప్రభుత్వం సవరించింది. ప్రవాసీల పిల్లలకు స్కాలర్‌షిప్ కార్యక్రమం(ఎస్‌పీడీసీ)లో భాగంగా ఎక్కువ మంది పిల్లలకు లబ్ధి చేకూరేలానే ఆలోచనతో వారి తల్లిదండ్రుల నెలవారీ ఆదాయ పరిమితిని రూ. 2లక్షల 85వేల నుంచి రూ. 3లక్షల 56వేలకు పెంచింది. ఈ మేరకు తాజాగా దుబాయిలోని భారత కాన్సులేట్ తన ట్వీట్‌లో పేర్కొంది.

ఎస్‌పీడీసీ అనేది భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న స్కాలర్‌షిప్ పథకం. ఈ పథకం ద్వారా ప్రవాసీ పిల్లలకు ట్యూషన్ ఫీజు, ప్రవేశ రుసుము, హాస్టల్ ఛార్జీలు (ఆహార ఛార్జీలు మినహా), ఇతర సంస్థాగత ఛార్జీలతో సహా మొత్తం విద్యా వ్యయంలో 75 శాతం మేరకు ఇది పాక్షిక ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈ సహాయం సంవత్సరానికి రూ. 2లక్షల 85వేల వరకు ఉంటుంది. ఈ పథకం ప్రవాస భారతీయులు(ఎన్నారై), పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్(పీఐఓ), ఎంపిక చేసిన 66 దేశాల నుండి ఓవర్సీస్ సిటిజెన్స్ ఆఫ్ ఇండియా(ఓసీఐ) కార్డుదారుల పిల్లలకు వర్తిస్తుంది. ఈ పథకం కింద మొత్తం 150 స్కాలర్‌షిప్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రవాస కార్మికుల పిల్లలకు 50 స్కాలర్‌షిప్‌లు కేటాయించబడ్డాయి. తల్లిదండ్రుల మంత్లీ ఆదాయపరిమితి రూ. రూ. 3లక్షల 56వేలు ఉండాలి. www.spdcindia.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com