దుబాయ్:ఆర్గాన్స్ డొనేట్ చేసి ముగ్గురి ప్రాణాలు కాపాడిన ఆరేళ్ల ఇండియన్ చిన్నారి

- February 21, 2020 , by Maagulf
దుబాయ్:ఆర్గాన్స్ డొనేట్ చేసి ముగ్గురి ప్రాణాలు కాపాడిన ఆరేళ్ల ఇండియన్ చిన్నారి

దుబాయ్:ఆమె వయస్సు ఆరేళ్లు. లోకం గురించి తెలిసి తెలియని వయస్సు. అయినా..ఇవ్వడంలోని తృప్తి ఎంటో ఆమెకు తెలుసు. తనకు చేతనైన సాయం చేయటం అవతలి వారికి కలిగించే సంతృప్తి ఎంటో తెలుసు. అల్లరి చేస్తూ ఆడుకోవాల్సిన ఆ చిన్న వయస్సులోనే ఇవ్వటంలో, సాయం చేయటంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించిందామె. బతికి ఉన్నన్నాళ్లు అమ్మ పర్సులోంచి డబ్బులు తీసి ఇతరులకు డోనేట్ చేసేది. వీధిలో ఉండే కార్మికులకు తన దగ్గరున్న డబ్బులు ఇచ్చేది. ప్రాణం ఉన్నన్నాళ్లే కాదు..ప్రాణాలు పోయాక కూడా ఆమె ఇవ్వటం మర్చిపోలేదు. తన శరీర అవయవాలనే దానం చేసి మరో ముగ్గురికి ప్రాణభిక్ష పెట్టింది. ముగ్గురికి ప్రాణం పోసి మూడు కుటుంబాల్లో సంతోషం నింపిన ఆ చిట్టితల్లి ఇప్పుడు మన మధ్య లేదు. హర్ట్ అండ్ పల్మరీ బ్లడ్ ప్రెషర్ సంబంధిత వ్యాధితో ఆ చిన్నారి కన్నుమూసింది. అయినా..మరో ముగ్గురిలో ఇంకా ఆమె బ్రతికే ఉంది.

ఆరేళ్ల ఆ చిన్నారి పేరు దివ్యశ్రీ. భారత సంతతికి చెందిన అరుణ కుమార్, కీర్తి దంపతులకు ఒక్కగానొక్క కుమార్తె ఆమె. పుట్టిన ఒక్క బిడ్డ ఎక్కువ కాలం బతకదని ముందే తెలిస్తే ఆ తల్లిదండ్రుల గుండెకోతకు అవధులుండవు. అందరి పిల్లల్లాగే ఆడుతూ పాడుతూ ఉండే బిడ్డ రోజురోజుకి మృత్యువుకు దగ్గరవుతుందని తెలిసి బాధను దిగమింగుకోవటం అంత అషామాషి విషయమేమి కాదు. కానీ, అరుణ కుమార్, కీర్తి దంపతులు అంతటి బాధలను ఓ గొప్ప పనికి పూనుకున్నారు. కూతురు ఆవయవాలను దానం చేసి మరో ముగ్గురి ప్రాణాలను కాపాడాలని నిర్ణయించుకున్నారు. మినిస్ట్రి ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్స్ యాప్ లో దివ్యశ్రీ వివరాలను రిజిస్ట్రర్ చేసి అవయవాలను దానం ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. తన కూతురి త్యాగం ద్వారా అవయవ దాతల కోసం ఎదురుచూస్తున్న ఎంతో మందిలో కొందరి ప్రాణాలనైనా కాపాడాలన్నది ఆ తల్లిదండ్రుల ఆశ.

కీర్తీ, అరుణ కుమార్ నిర్ణయంతో ఆరేళ్ల దివ్యశ్రీ రెండు కిడ్నీలతో పాటు కాలేయాన్ని ఇతరులకు విజయవంతంగా అమర్చారు. ఒక కిడ్నీ దుబాయ్ వ్యక్తికి మరొకటి అబుదాబి వ్యక్తికి  మార్పిడి చేశారు. కాలేయాన్ని సౌదీ అరేబియాలోని వ్యక్తికి అమర్చారు. దివ్యశ్రీ త్యాగంతో ఇప్పుడు ఆ ముగ్గురు కొత్త జీవితాన్ని ఆరంభించారు. ఆ ముగ్గురిలోనే తమ కూతుర్ని చూసుకుంటున్నారు దివ్యశ్రీ తల్లిదండ్రులు. దివ్యశ్రీ కిడ్నీతో నూతన జీవితాన్ని ఆరంభించిన ఏడేళ్ల ఆడమ్ అనే పిల్లాడ్ని ఇటీవలె కలుసుకున్నారు. ఆడమ్ కిడ్నీ దాత కోసం 4 ఏళ్ల పాటు వెయిటింగ్ లిస్టు ఉన్నాడు. ఆ సమయంలో వారంలో మూడు నాలుగు సార్లు ఆస్పత్రికి వెళ్లి డయాలసిస్ చేయించుకోవాల్సి వచ్చేది. వెళ్లిన ప్రతీసారి 5 గంటల పాటు ఆస్పత్రిలోనే ఉండాల్సి వచ్చేది. దీంతో స్కూలుకు వెళ్లలేకపోయేవాడు. దివ్యశ్రీ తల్లిదండ్రుల నిర్ణయం అతని జీవితాన్ని మార్చేసింది. మొహమ్మద్ బిన్ రషీద్ యూనివర్శిటీ ఆఫ్ మెడిసిన్ అండ్ హెల్త్ సైన్సెస్ సహకారంతో అల్ జలీలా చిల్డ్రన్స్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి జరిగింది. ఆ తర్వాత న్యూ లైఫ్ స్టార్ట్ చేసిన ఆడమ్ ఇప్పుడు స్కూలు వెళ్తున్నాడు. ప్రతీ రోజు తన స్నేహితులతో ఆడుకుంటున్నాడు. ఆడమ్ ను దివ్యశ్రీ పేరెంట్స్ కలుసుకోవటంతో అతని కుటుంబసభ్యులు ఎంతో సంతోషంతో వాళ్లకు ఆతిథ్యం ఇచ్చారు. గొప్ప అనుభూతి క్షణాలను ఆ రెండు కుటుంబాలు గడిపాయి. తన కొడుకును కాపాడిన వారిని కలుసుకోవటం చాలా సంతోషంగా ఉందని ఆడమ్ తల్లి చెబుతోంది.

దివ్యశ్రీ తల్లి కీర్తి మాట్లాడుతూ...' నా కూతురికి చిన్ననాటి నుంచే ఇవ్వటం అలవాటు. ఇతరులకు డబ్బు అవసరమైనప్పుడు పది, వంద అని తేడా చూడదు. తన దగ్గరున్నవి
ఇచ్చేసేది. అంతేకాదు కొన్ని సందర్భాల్లో నా పర్సులోని డబ్బులు కూడా తీసిచ్చేది. తాను చనిపోయాక కూడా నా చిట్టితల్లి ఇవ్వటం మానుకోలేదు' కూతురు త్యాగాన్ని గుర్తు
చేసుకుంది. దివ్యశ్రీ తండ్రి అరుణ కుమార్ మాట్లాడుతూ..' పోస్ట్ మార్టం నిర్వహించి తన కూతురి అవయవాలను ఇతరులకు ఇవ్వడమనే నిర్ణయం నాకు చాలా డిఫికల్ట్ గా
అనిపించింది. ఎందుకంటే ఇప్పటి వరకు మా కుటుంబంలో ఎవరికి ఇలాంటి పరిస్థితి తలెత్తలేదు. పోస్ట్ మార్టం నిర్వహించాల్సిన సిచ్యూవేషన్ ఫేస్ చేయలేదు. కానీ, సమయం లేదు. పర్టిక్యులర్ టైంలోనే సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే..ట్రాన్స్ ప్లాంటేషన్ ఇంపార్టెన్స్ ను డాక్టర్ల నుంచి తెలుసుకున్నాను. నా కూతురు చేయబోయే త్యాగంతో ఒక కుటుంబంలో ఒక ప్రాణం నిలబడుతుంది. అతను పెరిగి పెద్దవాడై పెళ్లి చేసుకుంటాడు. పిల్లలు పుడతారు. అలా నా కూతురు ఒక కుటుంబంలో కొన్ని జనరేషన్లను కాపాడినట్లు అవుతుంది. కొద్దిగా కష్టతర నిర్ణయమే అయినా..కొందరి ప్రాణాలు నిలబడతాయనే సంకల్పంతో అవదానం చేయాలనే నిర్ణయానికి వచ్చాం' అని అన్నారు.

మొహమ్మద్ బిన్ రషీద్ యూనివర్శిటీ ఆఫ్ మెడిసిన్ అండ్ హెల్త్ సైన్సెస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ సర్జన్ డాక్టర్ ఫర్హాద్ ఖేరాద్మాండ్ జనహి మాట్లాడుతూ' దివ్యశ్రీ బ్రెయిన్ డెడ్ కండీషన్లలో ఆమె హార్ట్ బీట్ ను రెండు వారాల పాటు కొనసాగించి అవయవాలను ప్రిసర్వ్ చేశామన్నారు. దివ్య శ్రీ పేరెంట్స్ ఆర్గన్స్ డొనేట్ చేసేందుకు ఒప్పుకున్న వెంటనే దుబాయ్, అబుదాబి కిడ్నీలను ట్రాన్స్ ప్లాంట్ చేశారని, సౌదీ అరేబియాలో కాలేయ మార్పిడి జరిగిందని వివరించారు. దివ్యశ్రీ తరహాలో ఆర్గాన్స్ డొనేట్ చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్ అన్నారు. ప్రస్తుతం 25 మంది ఆర్గాన్స్ కోసం వెయిటింగ్ లిస్టులో ఉన్నారని, మరో 2500 మంది కిడ్నీ ఫెయిల్యూర్ తో బాధపడుతున్నారని డాక్టర్ ఫర్హాద్ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com