ఆఫ్రికా కు వీసా ఊరట

- January 21, 2016 , by Maagulf
ఆఫ్రికా కు వీసా ఊరట

గత కొంతకాలంగా ఇండియా నుంచి తగ్గుతున్న పర్యాటకులను ఆకర్షించడానికి దక్షిణాఫ్రికా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వీసాల జారీ ప్రకియను మరింత సరళం చేయడమే కాకుండా వినూత్నమైన పర్యాటక ప్యాకేజీలను కూడా ప్రవేశపెడుతోంది. 2010 నుంచి దక్షిణాఫ్రికాను సందర్శిస్తున్న పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోందని, దీనికి ప్రధాన కారణం వీసాల జారీలో జరుగుతున్న జాప్యంగా గుర్తించినట్లు సౌత్‌ఆఫ్రికా టూరిజం కంట్రీహెడ్ (ఇండియా) హన్నెలి స్లాబర్ తెలిపారు. రోడ్‌షోలో భాగంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇక నుంచి ఐదు రోజుల్లో వీసా లభించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ముంబై, ఢిల్లీ నగరాల్లో ఐదు రోజులు మిగిలిన పట్టణాల్లో గరిష్టంగా ఏడు రోజుల్లో వీసా జారీ చేయనున్నట్లు తెలిపారు. 2014లో 85,000 మంది భారతీయులు దక్షిణాఫ్రికాను సందర్శించారని, ఈ ఏడాది వీసాల జారీ సులభతరం కావడంతో ఈ సంఖ్య లక్ష దాటుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. దక్షిణాఫ్రికాలో సందర్శించడానికి ఉన్న ప్రాంతాలు, అవకాశాలపై అవగాహన కల్పించడానికి కోల్‌కతా, ఢిల్లీ, హైదరాబాద్, ముంబైల్లో 45 మంది ఎగ్జిబిటర్లు, 1,200 మంది టూర్ ఆపరేటర్లతో రోడ్‌షోలను ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సౌత్‌ఆఫ్రికా టూరిజం జనరల్ మేనేజర్ (ఇంటర్నేషనల్ మార్కెటింగ్) మోనికా లూయెల్ మాట్లాడుతూ సినిమా షూటింగ్‌లను ప్రోత్సహించడానికి అనేక రాయితీలను అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే భారతీయులకు ఆహారపు అలవాట్లకు అనుగుణంగా జైన్, శాఖాహార వంటకాలను కూడా అందిస్తున్నట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com