దుబాయ్ లో 'శివ' ఆరాధన

- February 25, 2020 , by Maagulf
దుబాయ్ లో 'శివ' ఆరాధన

ఆద్యంతరహితుడికి అణువణువూ  సేవే -దుబాయ్ లో మహాశివరాత్రి పర్వదివశ మహోత్సవం లోకరక్షణ కై ఆ ఆదిదంపతులను సేవించిన సంస్కార మహోదధి బృందం. 

ఏ అతీంద్రియ మాయయో ఈ జగత్తును నడిపిస్తోందో ,మాయా కల్పనా కల్పన ల  వైచిత్రీ చిత్రీవృతమని వేదం కీర్తిస్తోందో అదే స్వరూపం శక్తి తో కూడిన  ఈశ్వర శక్తి అని సనాతన ధర్మం విశ్వాసం. 

ఆ ఈశ్వర శక్తిని నిరంతరం మనం ఏదో రూపం లో స్మరిస్తూనే ఉంటాము . అయితే విశేష పర్వదినమైన మహాశివరాత్రి నాడు ఎంతో భక్తివిశ్వాసాలతో అర్చించుకునే అద్భుతమైన అవకాశం అదృష్టం ఆ పరమేశ్వరుడు దుబాయ్ లోని మా తెలుగు వారికి ప్రసాదించడం మా సుకృతం . 

శ్రీ వికారి నామ సంవత్సరం మాఘమాసం బహుళ పక్ష చతుర్దశి తిథి నాడు అనగా 21 ఫిబ్రవరి శుక్రవారము  మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని సంస్కార మహోదధి బృందం ఆధ్వర్యవం లో జరిగిన జరిగిన వైదిక కార్యక్రమం అత్యంత వైభవం గా జరిగింది. 

అంతకు ముందు 20 వ తేదీ అనగా గురువారము నాడు ఉదయం కైలాస శంకరుడు రవి కొమర్రాజు దంపతుల పూజలందుకొని బర్ దుబాయ్ లోని దేవాలయాన్ని సందర్శించి అటుపిమ్మట విచ్చేసిన  శ్రీ పార్వతీ పరమేశ్వరులను షార్జా లోని  సుబ్రహ్మణ్య శర్మ ఇంట్లో అర్ఘ్య , పాద్యాలు , ఆసనం ఏర్పాటు చేసి ఆ తరువాత  మంగళ స్నానాలు గావించి తదనంతరం పెండ్లి కుమారునిగా, పెండ్లి కుమార్తె గావించి  అలంకరించినారు. ఆ రాత్రి వారింట్లో బసచేసిన వధూవరులను 21 వ తేదీ ఉదయం మేళ తాళాల వాయిద్యాల నడుమ పశుపతి పరివారము తో కల్యాణ వేదిక అయిన దుబాయ్ లోని  శ్రీనివాస శాస్త్రి ఇంటికి వేంచేసినారు . 

అదే రోజు ఉదయం కల్యాణ వేదిక పై సకల దేవతలను ఆహ్వానిస్తూ  గురుప్రార్ధన , గణపతి పూజ, పుణ్యహవచనము , పంచగవ్య ప్రాశన , రక్షాబంధనము  గావించి ,దిక్పాలకులను కలశ రూపం లో అర్చించి  మండపారాధన ను గావించిన ఋత్విక్కులు ఆ ఉమామేశ్వరులకు  వేదిక పై  స్థిరాసనం ఏర్పాటు చేసారు. 

తదనంతరం రుద్రహోమము , పంచసూక్త హోమము గావించి అర్చన , నివేదన ,హారతి , మంత్రపుష్పము తో నీరాజనం మరియు తీర్ధ ప్రసాద వితరణ తో నాటి ఉదయం కార్యక్రమం ముగిసింది. 

తిరిగి సాయంత్రం జపానుష్టానాల అనంతరం మరల మండప పూజ చేసి , అటుపిమ్మట ప్రదోషకాలములో భక్తులందరితో దీప ప్రజ్వలన గావించి జ్యోతిర్లింగార్చన చేసి నివేదన మరియు హారతి గావించారు . 

సరిగ్గా రాత్రి 8గంటలకు స్వదేశము నుండి తెచ్చిన పుట్టమన్నుకు సమంత్రకముగా మృత్తికా పూజ చేసి సహస్ర లింగార్చనకు అవసరమైన పార్థివ లింగములను భక్తులతో తయారుజేయించడం జరిగింది. ఈ సమయం లో భక్తులందరూ శ్రీ లలితా సహస్రనామము , లక్ష్మీ అష్టోత్తరము , విష్ణు సహస్రనామములతో బాటు లింగాష్టకమును పఠించినారు . 

రాత్రి పదిగంటలకు పీఠ ప్రతిష్టాపన  చేసి , భక్తులతో మహాన్యాసమును జేయించినారు , ఆ తరువాత పూర్తి విశదీకరణ తో షోడశావరణను గావించినారు . 
సరిగ్గా రాత్రి 12 గంటలకు లింగోధ్బవ సమయందు రుద్రాభిషేకమును ప్రారంభించి ఏకాదశ రుద్రాభిషేకము తో సహస్రలింగార్చన గావించారు . ఇది సుమారు 2 గంటలపాటు సాగింది.  

తిరిగి 22 వ తేదీ శనివారం  ఉదయం 2 గంటల సమయం నుండి 5 గంటల సమయం వరకు శ్రీపార్వతీ పరమేశ్వరుల లీలా విలాస కళ్యాణమును అత్యంత శ్రద్ధాభక్తులతో నిర్వహించారు. 

అర్చన , మహానివేదన , మంత్రపుష్పము తో నీరాజనం గావించి , తీర్ధ ప్రసాదాల వితరణ తరువాత అటు పిమ్మట భక్తులకు వేద ఆశీర్వచనం అందించారు అర్చకులు. 

ఇలా మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని పూర్తిస్థాయిలో రుద్రహోమం, జ్యోతిర్లింగార్చన , సహస్రలింగార్చన  మరియు పార్వతీ లీలా విలాస కళ్యాణములతో కూడిన విశేష కార్యక్రములతో భక్తుల జాగరణ , ఉపవాస దీక్ష ముగిసింది. 

కార్యక్రమం లో ప్రధాన పాత్ర వహించి,  పూర్తి ద్రవ్య సహకారమును అందించి  ప్రత్యక్షం గా  పాల్గొన్న వారిలో శ్రీనివాస శాస్త్రి  దంపతులు, రాజశేఖర్ దంపతులు , వంశీకృష్ణ  దంపతులు, శ్రీకాంత్ , రాయవరం శ్రీనివాసు, భానుకుమార్  దంపతులు , జితేంద్ర  దంపతులు , రజనీకాంత్ దంపతులు ,సుబ్రహ్మణ్య శర్మ  దంపతులు ,సుబ్బరామరావు కుటుంబ సభ్యులతో పాటు పరోక్షంగా ఇతోధిక సహాయమును అందించిన కామేశ్వర శర్మ దంపతులు , కోటేశ్వర ప్రసాద్ దంపతులు , శ్రీనివాస్ దంపతులు మరియు రవి కొమర్రాజు దంపతులు కూడా ఉన్నారు. 

అంతేకాకుండా ఈ కార్యక్రమానికి హాజరైన శ్రీనివాసమూర్తి , మనోరమాదేవి  దంపతులు , సుదర్శన్  దంపతులు ,  రమేష్  దంపతులు , నరసింహారావు దంపతులు,  సందీప్దంపతులు , అలివేలు  దంపతులు  మరియు  పేర్రాజు దంపతులతో పాటు పలువురు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని భక్తి పూర్వకముగా స్వామి వారి దంపతులను సేవించారు . 

ఈ మొత్తం వైదిక కార్యక్రమమును అర్చకులు శ్రీరామమూర్తి మరియు  మణికంఠ  సశాస్త్రీయము గా నిర్వహించినారు.అత్యంత అద్భుతం గా పూర్తి వైదిక సంప్రదాయం లో జరిగిన ఈ కార్యక్రమం భక్తులందరినీ ఆనంద పరవశులను గావించగా , విశేష భక్తి పారవశ్యం తో తన్మయత్వం చెందినారు.  

ఈ కార్యక్రమును ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహముతో, అలాగే జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ భారతీతీర్థ స్వామివారు మరియు వారి కరకమల సంజాతులు శ్రీ విధుశేఖర భారతీతీర్థ స్వాముల వారలు పూర్ణ ఆశీస్సులతో  తమ సందేశమును పంపుతూ ఇక్కడ ఉన్న సనాతన ధర్మ అనుయాయులందరినీ ఆశీర్వదించినారు.అలాగే ఈ కార్యక్రమును సుబ్రహ్మణ్య శర్మ దంపతులు పర్యవేక్షించడం జరిగింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com