క్వారంటైన్ ఎఫెక్ట్:జీసీసీ దేశాల నుంచి భారత్ వెళ్లే విమానాలకు భారీగా పెరిగిన రద్దీ

- March 19, 2020 , by Maagulf
క్వారంటైన్ ఎఫెక్ట్:జీసీసీ దేశాల నుంచి భారత్ వెళ్లే విమానాలకు భారీగా పెరిగిన రద్దీ

గల్ఫ్ దేశాల నుంచి వచ్చే వారు మార్చి 18 నుంచి తప్పనిసరిగా 14 రోజుల పాటు నిర్బంధంలో ఉండాలన్న భారత ప్రభుత్వ ప్రకటన ప్రవాసీయుల్లో గందరగోళం సృష్టించింది. నిర్బంధ సమయంలో తాము ఎక్కడ ఉండాలి, ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయో తెలియక ప్రవాసీయుల ఆందోళనకు కారణమైంది. దీంతో నిర్బంధాన్ని తప్పించుకునేందుకు మార్చి 18(బుధవారం) కంటే ముందే ఇండియా చేరుకునేందుకు ప్రయత్నించటంతో మంగళవారం (మార్చి 17)న యూఏఈ విమానాశ్రయాలన్ని ప్రయాణికులతో రద్దీగా కనిపించాయి. కొందరు ప్రవాసీయులైతే మార్చి 18 తర్వాత రోజులకుగాను టికెట్లు బుక్ చేసుకున్నా..వాటిని ప్రీపోన్ చేసుకునేందుకు ప్రయత్నించారు. మార్చి 18కి ముందే భారత్ చేరుకొని 14 రోజుల నిర్బంధాన్ని తప్పించుకునేందుకు వాళ్లు ప్రయాసపడటం కనిపించింది.

కరోనా కట్టడికి నిజానికి ప్రపంచదేశాలన్ని విమాన ప్రయాణికుల పట్ల కఠిన నిబంధనలు అమలు చేస్తున్న విషయం తెలిసింది. జీసీసీ దేశాలైన యూఏఈ, ఒమన్, కువైట్, ఖతార్ కూడా కరోనా బారిన పడటంతో ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తప్పసరిగా 14 రోజుల నిర్బంధాన్ని పాటించాలని, మార్చి 18న జీసీసీ దేశాల నుంచి ఇండియా చేరుకునే తొలి విమాన ప్రయాణికుల నుంచే నిర్బంధ చర్యలు ప్రారంభం అవుతాయని దుబాయ్ లోని ఇండియా కౌన్సిల్ జనరల్ వెల్లడించారు. అయితే..ఈ 14 రోజుల నిర్బంధ సమయంలో తాము ఎక్కడ ఉండాలి, ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేసిందనేది మాత్రం ప్రవాసీయులకు స్పష్టమైన సమాచారం లేదు. దీంతో నిర్బంధ సమయంలో కష్టాలు ఎదుర్కొవాల్సి వస్తుందేమోనని వారిలో భయాందోళన నెలకొంది. దీనికితోడు అత్యవసరంగా వ్యాపార కార్యకలాపాల కోసం భారత్ చేరుకునే వారు కూడా ఈ 14 రోజుల నిర్బంధం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారం నిమిత్తం తాను అత్యవసరంగా కొచ్చికి వెళ్లాల్సి ఉందని, అయితే..14 నిర్బంధం తమకు సమస్యగా మారిందని ఓ ప్రవాసీయుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

అలాగే నిర్బంధం విషయంలో ఆయా రాష్ట్రాలు ఒక్కో విధానాన్ని అనుసరిస్తుండటం కూడా ప్రవాసీయుల గందరగోళానికి కారణం అవుతోంది. నిర్బంధం సమయంలో తాము ఎక్కడ ఉండాలనేది స్పష్టత కరువైందని తెలిపారు. కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు స్వీయ నిర్బంధం విధానాన్ని అనుసరిస్తున్నాయి. మహారాష్ట్ర క్వారంటైన్ లో ఉన్న వారి చేతికి విమానాశ్రయాల్లోనే స్టాంప్ లు వేస్తున్నాయి. ఇక ఢిల్లీ ప్రభుత్వం పే అండ్ యూజ్ పద్దని నిర్బంధ వసతిని కల్పించింది. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ శివార్లలో నిర్బంధ వసతిని ఏర్పాటు చేసింది. అయితే..దీనికి సంబంధించి ఏయే రాష్ట్రంలో ఎలాంటి వసతులు కల్పిస్తుందనేది మాత్రం తమకు అధికారుల నుంచి సరైన సమాధానం లేకపోవటంతో ప్రస్తుత పరిస్థితి యుద్ధాన్ని తలపించేలా ఉందని వాపోతున్నారు. దీంతో ఎలాగైన నిర్బంధ కాలాన్ని తప్పించుకునేందుకు మార్చి 18లోపే భారత్ చేరుకోవాలని ప్రయత్నించటంతో మంగళవారం గల్ఫ్ దేశాల నుంచి భారత్ వచ్చే విమానాలకు ఒక్కసారిగా రద్దీ పెరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com