ఇటలీలో ఒక్కరోజే 793 కరోనా మరణాలు

- March 22, 2020 , by Maagulf
ఇటలీలో ఒక్కరోజే 793 కరోనా మరణాలు

ఇటలీలో కరోనా మహమ్మారి మారణహోమమే సృష్టిస్తోంది. వందల మంది ప్రాణాలను బలిగొంటూ ఉగ్రరూపంతో విరుచుకుపడుతోంది. యావత్తు దేశం నిర్బంధంలో ఉన్నా కొత్తవారి శరీరంలోకి తన కోరల్ని చొప్పిస్తూనే ఉంది. తొలినాళ్లలో సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే ఎంతటి ఉపద్రవం తెచ్చిపెడుతోందో మిగిలిన దేశాలకు రుచి చూపిస్తోంది. శనివారం ఒక్కరోజే ఆ దేశంలో 793 మంది వైరస్‌ వల్ల ప్రాణాలు కోల్పోయారు. వైరస్‌ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ఒక దేశంలో ఒక్కరోజు ఇంతమంది మృత్యువాత పడడం ఇదే అత్యధికం. ఇటలీలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,825కు చేరింది. మరో 6,557 మంది కొత్తగా వైరస్‌ బారిన పడ్డారు. ప్రముఖ నగరం మిలన్‌ సమీపంలోని ఉత్తర లోంబార్డీ ప్రాంతంలోనే 3000 మంది మరణించడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గత 10 రోజుల నుంచి ఇటలీ పూర్తిగా నిర్బంధంలోనే ఉంది. అయినా గత రెండు రోజుల్లో 1,420 మంది మృతిచెందడం గమనార్హం. దీన్ని బట్టి ప్రజలు పాటిస్తున్న సామాజిక దూరం వంటి కట్టుబాట్లను దాటుకొని వైరస్‌ విజృంభిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేవీ వైరస్‌ను అడ్డుకోవడంలో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయి. దీన్ని బట్టి వైరస్‌ ఏ స్థాయిలోకి చొచ్చుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు.

వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అకారణంగా ఇళ్ల నుంచి బయటకు వచ్చిన వారిపై అక్కడి పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. భారీ జరిమానాలు విధిస్తున్నారు. అత్యవసర పని మీద బయటకు వచ్చామని పౌరులే నిరూపించుకోవాలని ఆదేశించారు. లేనిపక్షంలో కఠిన చర్యలను ఎదుర్కోవాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. ఉదయపు నడకకు సైతం ప్రజలు బయటకు రావొద్దని ఆదేశించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com