మాస్కో లాక్‌డౌన్‌

- March 30, 2020 , by Maagulf
మాస్కో లాక్‌డౌన్‌

మాస్కో: చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకొనేందుకు రష్యా కఠిన చర్యలు మొదలుపెట్టింది. సమూహ వ్యాప్తి చెందకుండా ముందుజాగ్రత్తగా రాజధాని మాస్కోను లాక్‌డౌన్‌ చేస్తున్నట్టు ప్రధాని మిఖాయిల్‌ మిషుస్తిన్‌ ప్రకటించారు. ఇలాంటి చర్యలకు మిగతా ప్రాంతాలన్నీ సంసిద్ధమవ్వాలని సూచించారు.

గతవారమే ప్రజలెవ్వరూ పనుల్లోకి వెళ్లొద్దని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆదేశించారు. కచ్చితంగా స్వీయ నిర్బంధం పాటించాలని సూచించినా ప్రజలెవ్వరూ పట్టించుకోలేదు. యథేచ్చగా ఉద్యానవనాలు, సముద్ర తీరాల్లో విహరించారు. అందుకే ఆదివారం రాత్రి మాస్కో మేయర్‌ సెర్గా సోబ్యానిన్‌ కఠిన ఆంక్షలు అమలు చేశారు. ఫలితంగా సోమవారం నగరంలో రెస్టారెంట్లు, కేఫ్‌లు సహా నిత్యావసరం కాని దుకాణాలన్నీ మూతపడ్డాయి.

'మాస్కో తరహాలోనే ఇతర నగరాల్లోనూ లాక్‌డౌన్‌కు సంసిద్ధం అవ్వాలని ప్రాంతీయ నేతలకు సూచించాను' అని ప్రధాని మిషుస్తిన్‌ అన్నారు. ఈ వారం రష్యన్లు ఎవరూ పనిచేయొద్దని, వేతనాలు చెల్లిస్తామని గత బుధవారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం రష్యాలో 1534 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఎనిమిది మంది మృతిచెందారు. రాజధాని నగరంలోనే వెయ్యికి పైగా బాధితులు ఉన్నారు. ముఖాలను గుర్తించే కెమేరాల వ్యవస్థ ఆధారంగా పోలీసులు గస్తీ నిర్వహించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com