కువైట్:రెసిడెన్సీ నిబంధనలు ఉల్లంఘించినా ఏప్రిల్ 1 నుంచి దేశం విడిచి వెళ్లొచ్చు

- March 31, 2020 , by Maagulf
కువైట్:రెసిడెన్సీ నిబంధనలు ఉల్లంఘించినా ఏప్రిల్ 1 నుంచి దేశం విడిచి వెళ్లొచ్చు

కువైట్:కరోనా దెబ్బకు చట్ట నిబంధనలే మారిపోతున్నాయి. వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ఖైదీలను కూడా విడిచిపెడుతున్నారు. ఇక చట్టాల అమలు విషయంలో నిఖచ్చిగా వ్యవహరించే గల్ఫ్ దేశాలు కూడా వైరస్ భయంతో కొన్ని మినహాయింపులు ఇస్తోంది. ఇందులో భాగంగా రెసిడెన్సీ నిబంధనలు ఉల్లంఘించి వారు ఎలాంటి జరిమానా  చెల్లించకుండానే తమ సొంత దేశాలకు తిరిగి వెళ్లొచ్చని ప్రకటించిన కువైట్ ప్రభుత్వం..తాజాగా అందుకు సంబంధించిన విధి విధానాలను విడుదల చేసింది. కువైట్ లో నివాసం ఉంటూ రెసిడెన్సీ నిబంధనలు ఉల్లఘించిన వారు ఏప్రిల్ 1 నుంచి 30లోపు తమ తమ దేశాలకు తిరిగి వెళ్లిపోతే ఎలాంటి ఫైన్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. పైగా వారికి ఫ్లైట్ టికెట్లను ఉచితంగా అందిస్తామని కువైట్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే..కరోనా క్రైసిస్ ముగిసిన తర్వాత లీగల్ డాక్యుమెంట్స్ తో మళ్లీ తిరిగి రావొచ్చని కూడా ప్రకటించింది. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ తమ దేశాలకు వెళ్లే వారు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఫర్వానియా ఏరియాలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారు పురుషులు అయితే ఫర్వానియా గవర్నరేట్ ప్రాంతంలోని అల్ ముత్తన్న ప్రైమరీ బాయ్స్ స్కూల్, బ్లాక్ 1, స్ట్రీట్ 122 కేంద్రంలో పేరు నమోదు చేసుకోవాలి. అలాగే మహిళల కోసం ఫర్వానియా గవర్నరేట్ ప్రాంతంలోని ఫర్వానియా ప్రైమరీ స్కూల్, బ్లాక్ 1, స్ట్రీట్ 76 లో కేంద్రం ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వారంలో ఏ రోజైనా తమ పేర్లను రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఆయా దేశాలకు ఫ్లైట్ తేదీల వివరాలను కూడా వెల్లడించింది.
ఇండియా : ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 15 వరకు
ఫిలిప్పిన్స్ : ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 5 వరకు
ఈజిప్టియన్ : ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 10 వరకు
బంగ్లాదేశ్ : ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 20 వరకు
శ్రీలంక : ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 25 వరకు
ఇతర దేశస్తులు : ఏప్రిల్ 26 నుంచి ఏప్రిల్ 30 వరకు

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com