ఇరాన్‌: చిక్కుకున్న భారతీయుల పై నిర్ణయం తీసుకోండి

- April 01, 2020 , by Maagulf
ఇరాన్‌: చిక్కుకున్న భారతీయుల పై నిర్ణయం తీసుకోండి

ఢిల్లీ:ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జస్టిస్‌ చంద్రచూడ్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇరాన్‌లో 850 మంది భారత యాత్రికులు చిక్కుకున్నారని.. వారిని వెనక్కి తీసుకురావాలని పిటిషనర్‌ కోరారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ అక్కడ చిక్కకున్న వారిలో సుమారు 250 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని, వారికి సరైన వైద్యం అందడం లేదని కోర్టుకు తెలిపారు. కరోనా లక్షణాలు లేనివారిని హోటళ్లలో ఉండమంటున్నారని.. కానీ అక్కడ సరైన మందులు కూడా అందుబాటులో లేవని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.

అనంతరం సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. ఇరాన్‌ నుంచి చాలా మందిని వెనక్కి తీసుకొచ్చామని కోర్టుకు తెలిపారు. అక్కడ ఉన్నవారికి భారత రాయబార కార్యాలయం ద్వారా సరైన సదుపాయాలు అందేలా చూస్తున్నామన్నారు. ఇరాన్‌లోని భారతీయుల భద్రతను కేంద్రం చూస్తూనే ఉందని చెప్పారు. అనంతరం సుప్రీంకోర్టు స్పందిస్తూ అక్కడ ఉన్నవారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి వెనక్కి తీసుకొచ్చే అంశంపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com