దుబాయ్:వైద్యంలో డాక్టర్ల నిర్లక్ష్యం..మరింత కఠినంగా శిక్షించాలని కోరిన దుబాయ్ ప్రాసిక్యూషన్

దుబాయ్:వైద్యంలో డాక్టర్ల నిర్లక్ష్యం..మరింత కఠినంగా శిక్షించాలని కోరిన దుబాయ్ ప్రాసిక్యూషన్

దుబాయ్:వైద్య సేవలు అందించటంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లకు విధించిన తీర్పుపై దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ అప్పీల్ కు వెళ్లింది. పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ రోగిని శాశ్వతంగా కదలకుండా చేసిన ఆ ముగ్గురు డాక్టర్లకు మరింత కఠినమైన శిక్ష విధించాలని దుబాయ్ ప్రాసిక్యూషన్ కోర్టును కోరింది. గతేడాదిలో పాతికేళ్ల ఎమిరాతి యువతి రౌడ అల్ మయినీ శ్వాస సంబంధిత ఇబ్బందులతో డాక్టర్లను సంప్రదించింది. ముక్కులో ఎముకకు ఆపరేషన్ చేయాలని సూచించిన డాక్టర్లు..ఆపరేషన్ సమయంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆమె కోమాలోకి వెళ్లింది. చూపు, విడికిడి శక్తిని కొల్పోయింది. ప్రస్తుతం ఆమె వంద శాతం వికలాంగురాలిగా మంచానికే పరిమితం అయ్యింది. ఓ నర్సు పర్యవేక్షణలో రోజులు గడుపుతోంది. చిన్న ఆపరేషన్ కోసం వెళ్లిన యువతికి తమ నిర్లక్ష్యంతో జీవితాన్నే నాశనం చేసిన ఆ ముగ్గురు డాక్టర్లను కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఆపరేషన్ చేసిన సర్జన్ తో పాటు మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన డాక్టర్, అతని అసిస్టెంట్ కు ఏడాది జైలు శిక్ష విధించింది.  తాత్కాలిక నష్టపరిహారంగా Dh51,000లు చెల్లించాలని ఆదేశించింది. అయితే..ఎంతో భవిష్యత్తు ఉన్న యువతిని జీవితాంతం మంచానికే పరిమితం చేసిన ఆ ముగ్గురు డాక్టర్ల ప్రస్తుత శిక్ష సరిపోదని బాధితులు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. మరింత కఠినంగా శిక్షించటంతో పాటు తగిన నష్టపరిహారాన్ని ఇప్పించాలని దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ కోరింది. ఇదిలాఉంటే ఆపరేషన్ లో పాల్గొన్న ఆ ముగ్గురు డాక్టర్ల సర్టిఫికెట్లను రద్దు చేయటంతో పాటు ఆపరేషన్ జరిగిన ఆస్పత్రిని సీల్ చేసిన విషయం తెలిసిందే.

Back to Top