కోవిడ్ 19:కార్మికుల ఆరోగ్య భద్రతకు అవగాహన కేంద్రాలు ఏర్పాటు చేసిన దుబాయ్ పోలీస్

- April 10, 2020 , by Maagulf
కోవిడ్ 19:కార్మికుల ఆరోగ్య భద్రతకు అవగాహన కేంద్రాలు ఏర్పాటు చేసిన దుబాయ్ పోలీస్

దుబాయ్:కార్మికుల ఆరోగ్య భద్రత కోసం దుబాయ్ పోలీస్ అవగాహన చర్యలను ముమ్మరం చేసింది. కార్మిక శిబిరాల దగ్గర ప్రత్యేకంగా అవగాహన కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. పని చేసే చోట ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కార్మికులకు క్షుణ్ణంగా వివరిస్తున్నట్లు దుబాయ్ పోలీస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మెర్రీ తెలిపారు. వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించటంలో భాగంగా కార్మిక సంఘాలు, సంబంధిత అధికారులతోనూ చర్చించామని, కార్మికులకు అవసరమైన మాస్కులు, శానిటైజర్ల సరఫరా చేసినట్లు వివరించారు. కార్మికులను తరలించే బస్సులను కూడా పరిశీలించి సామాజిక దూరాన్ని పాటించేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. మరోవైపు యూఏఈలో చిక్కుకుపోయిన పర్యాటకులతో పాటు ప్రవాసీయులను వారి వారి దేశాలకు తరలించేందుకు దుబాయ్ పోలీసులు ఆయా దేశాల రాయబార కార్యాలయాలను, కన్సల్టెన్సీలతో సమన్వయం చేసుకుంటున్నారు. అయితే అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు అయిన నేపథ్యంలో ఎమిరాతి, ఫ్లై దుబాయ్ ఎయిర్ లైన్స్ నుంచి ప్రత్యేక సర్వీసులు నడపనున్నారు. ఇదిలాఉంటే దుబాయ్ లో చేపట్టిన స్టెరిలైజేషన్ కార్యక్రమం సమయంలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైకి వచ్చే వారిపై నిఘా వేశామని దుబాయ్ పోలీస్ చీఫ్ తెలిపారు. రూల్స్ ను బేఖాతరు చేస్తున్న వారిని గుర్తించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, రాడార్ వంటి టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని వెల్లడించారు. నిర్లక్ష్యంగా వ్యహరించిన వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని, అలాగే నిబంధనలు పాటించని వారి ఫోటోలను కూడా పోస్ట్ చేస్తామని ఆయన హెచ్చరించారు. అయితే..ప్రస్తుతానికి ఎక్కువ మంది ప్రజలు మాత్రం నిబంధనలను పాటిస్తున్నారని అన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com