యూఏఈ: ఎదైమైనా మమ్మల్ని భారత్ కు పంపించండి..రాయబార కార్యాలయాలకు ప్రవాసీయుల వినతులు

- April 13, 2020 , by Maagulf
యూఏఈ: ఎదైమైనా మమ్మల్ని భారత్ కు పంపించండి..రాయబార కార్యాలయాలకు ప్రవాసీయుల వినతులు

యూఏఈ: కరోనా వైరస్ దెబ్బకు గల్ఫ్ కంట్రీస్ లోని కార్మికుల జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. కరోనా సంక్షోభంతో ఉపాధి కొల్పోయిన కార్మికులు, విజిట్ వీసా మీద వెళ్లిన వారు ఎప్పుడెప్పుడూ విమాన సర్వీసులకు అనుమతి దొరుకుతుందా..ఎప్పుడు ఇంటికి వెళ్తామా అన్నట్లు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దేశంగానీ దేశంలో రోజురోజుకీ పరిణామాలు ఎలా మారుతాయోననే ఆందోళన, మరోవైపు కరోనా వైరస్ భయంతో ఎటూ పాలుపోని పరిస్థితిలో రోజులు గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో తమను ఎలాగైనా భారత్ పంపించేలా ఎర్పాట్లు చేయాలంటూ యూఏఈ, అబుధాబి, దుబాయ్ రాయబార కార్యాలయాలకు విన్నతులు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. కొందరు ఫోన్ల ద్వారా, మరికొందరు ఈ-మెయిల్స్ ద్వారా, ఇంకొందరు రాయబార కార్యాలయాల సోషల్ పేజీల ద్వారా అధికారులకు తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. కరోనా వైరస్ ప్రబలుతున్న విపత్కర సమయంలో భారత్ లోని తమ కుటుంబాలకు తమ అవసరం ఎంతైనా ఉందని, ఏదీ ఏమైనా తమను భారత్ తరలించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అవసరమైతే కరోనా నిర్ధారిత పరీక్షలు నిర్వహించిన తర్వాతే భారత్ వెళ్లేందుకు అనుమతించాలని అంటున్నారు. 

అబుధాబిలోని ఇండియన్ ఎంబసీ, దుబాయ్ లోని ఇండియన్ కాన్సులెట్ కు తక్కువలో తక్కువగా 2,500 మంది ప్రవాసీయులు తమను భారత్ తరలించే ఏర్పాట్లు చేయాలంటూ సంప్రదించినట్లు తెలుస్తోంది. వెయ్యిమంది తాము వ్యక్తిగతంగా ఇండియన్ మిషన్లను సంప్రదిస్తే..మరో వెయ్యి మంది కార్మికులు ఉపాధి కొల్పోవటంతో వారి యజమాని కార్మికులను భారత్ తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఇండియన్ మిషన్లను సంప్రదింస్తున్నారు. 

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు వేలాదిగా ప్రవాసీయులు ఉన్నఫళంగా తమను భారత్ కు పంపించాలనే విజ్ఞప్తులు ఏమి రాలేదని యూఏఈలోని భారత రాయబారి పవన్ కపూర్ వెల్లడించారు. మరోవైపు దుబాయ్ లోని ఇండియన్ కాన్సూలేట్ కు వెయ్యి మంది వరకు వ్యక్తిగత వినతులు వచ్చాయని, మరో వెయ్యి మంది కార్మికుల తరపున వారి యజమాని తమను సంప్రదించారని కాన్సులేట్ జనరల్ విపుల్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో కూడా ఎలాగైన తమను భారత్ పంపించాలనే వినతులు వస్తున్నాయని ఆయన వెల్లడించారు. అయితే..పదుల వేలల్లో ప్రవాసీయులు భారత్ వెళ్లేందుకు ఎదురుచూస్తున్నారనే ప్రచారంలో మాత్రం నిజం లేదని డిప్లామాటిక్ ఉన్నతాధికారులు స్పష్టత ఇచ్చారు.

అయితే..భారత్ ప్రస్తుతం పూర్తి లాక్ డౌన్ అమలులో ఉందని, ప్రజా ప్రయోజనాల కోణంలో లాక్ డౌన్ పొడిగించే అవకాశాలు కూడా లేకపోలేదని ఎంబసీ అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్తితుల్లో ప్రవాసీయులను భారత్కు తరలించే అవకాశాలు లేవన్నారు. భారత ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందేనని తెలిపారు. విమాన సర్వీసుల తిరిగి ప్రారంభం అయ్యాక దశల వారీగా అందర్ని భారత్ కు వెళ్లేందుకు అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com