కోవిడ్ 19:సంక్షోభంలో సమన్వయంతో ముందుకు వెళ్దాం..యజమానులు, కార్మికులకు ఖతార్ పిలుపు

- April 15, 2020 , by Maagulf
కోవిడ్ 19:సంక్షోభంలో సమన్వయంతో ముందుకు వెళ్దాం..యజమానులు, కార్మికులకు ఖతార్ పిలుపు

దోహా:కరోనాతో ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం నెలకొని ఉంది. ఈ సంక్షోభ పరిస్థితుల్లో ప్రైవేట్ సెక్టర్ లోని యజమానులు, కార్మికులు పరస్పరం సహకరించుకోవటం ద్వారా గడ్డు కాలాన్ని గట్టెక్కవచ్చని ఖతార్ ప్రభుత్వం సూచించింది. ఒకరినొకరు తోడ్పాటు అందించుకోవటం ద్వారా సాంఘికంగా, ఆర్ధికంగా జరిగే నష్టాలను నివారించగలమని, అది రెండు వర్గాలకు శ్రేయస్కరమని..దీర్ఘకాలిక మనుగడకు దోహదం చేస్తుందని కార్మిక, సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖ హితువు పలికింది.
అంతేకాదు..ఈ విపత్కర పరిస్థితుల్లో అటు యజమానులు, ఇటు కార్మికులు అనుసరించాల్సిన నియమాలను, పరస్పర ప్రయోజనాలకు సంబంధించి కొన్ని కీలక సూచనలు చేసింది. ప్రస్తుతం బిజినెస్ కొనసాగిస్తున్న సెక్టార్స్ లోని కార్మికులకు విధిగా బేసిక్ శాలరీతో పాటు ఆహారం, నివాస సౌకర్యాల వంటి ఇతర సదుపాయలను కల్సించాల్సి ఉంటుంది. అయితే..వ్యాపార కార్యాకలాపాలు నిలిచిపోయిన రంగాలకు సంబంధించి ఉద్యోగులు, కార్మికులు యాజమాన్యానికి తోడ్పాటు అందించాలని, కంపెనీ మూసివేసిన కాలానికి జీతాలు లేని సెలవులు తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉండాలని సూచించింది.

*ప్రస్తుతం సంక్షోభం నెలకొని ఉన్నా..ఒప్పందం చేసుకున్న ప్రకారం కార్మికులకు ఆహారం, నివాస సదుపాయాలు నేరుగా అందిస్తున్న యజమాన్యాలు, అలవెన్స్ రూపంలో అందిస్తున్న యాజమాన్యాల అదే తరహాలో సౌకర్యాలను కొనసాగించాల్సిందేనని కార్మిక శాఖ స్పష్టం చేసింది. ఆహారం, నివాస సౌకర్యాల వంటి సౌకర్యాలకు ఛార్జ్ వేస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ కార్మికులు అందుకు అంగీకరించొద్దని కూడా స్పష్టం చేసింది.

*ఇక కరోనాకు చికిత్స తీసుకుంటున్నా, అనుమానిత కేసులుగా డాక్టర్ల పర్యవేక్షణలో నిర్బంధంలో ఉండాల్సి వచ్చినా అలాంటి కార్మికులకు బేసిక్ శాలరీతో పాటు అన్ని అలవెన్సులు యాజమాన్యాలు అందించాల్సిందే. నిర్బంధంలో ఉన్న కాలానికి సిక్ లీవ్ వర్తించినా వర్తించకపోయినా జీతం చెల్లించాల్సిందేనని కూడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

*అదే సమయంలో కార్మిక చట్టం నిబంధనలకు లోబడి యజమాని కార్మిక ఒప్పందాలను రద్దు చేసుకోవచ్చిని మంత్రిత్వశాఖ తెలిపింది. అయితే..నోటిస్ పిరియడ్ లో ఉన్న కార్మికుడికి అందాల్సిన అన్ని బినిఫిట్స్ ఖచ్చితంగా అందించి..అతను స్వదేశానికి వెళ్లేందుకు ఉచితంగా విమాన టికెట్ అందించటంతో పాటు అతను స్వదేశానికి వెళ్లే వరకు తిండి, నివాస సదుపాయాలను కొనసాగించాలని కూడా కార్మిక మంత్రిత్వ శాఖ తన సూచనల్లో స్పష్టం చేసింది. 

అంతేకాదు కార్మికులు సంక్షేమం కోసం హాట్ లైన్ నెంబర్  40280660ను ఏర్పాటు చేసింది. వర్క్ ప్లేసులో నివాస ఏర్పాట్లలో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరిగిన వెంటనే తమకు సమాచారం అందించాలని వెల్లడించింది. అంతేకాదు..నెంబర్ 5 ద్వారా 92727 నెంబర్ కు మెసేజ్ రూపంలో కూడా ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేసింది. మెసేజ్ చేసే వారు పర్సనల్ నెంబర్, విసా నెంబర్ ను తప్పనిసరిగా పంపించాల్సి ఉంటుంది. ఈ సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. 

--రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com