హైదరాబాద్‌:లాక్‌డౌన్ నిబంధనలు మరింత కఠినం

- April 21, 2020 , by Maagulf
హైదరాబాద్‌:లాక్‌డౌన్ నిబంధనలు మరింత కఠినం

తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకూ తీవ్రమవుతోంది. అందులోనూ గ్రేటర్ హైదరాబాద్‌లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో మహానగరంలో మరింత కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పగడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ప్రధానంగా నగరంలో గుర్తించిన కంటైన్మెంట్‌ జోన్లలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, రాచకొండ సీపీ మహేష్ భగవత్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో మే 7వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ పొడిగించిన విషయం తెలిసిందే. దీంతో నగరంలో నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు బాస్‌లు హెచ్చరిస్తున్నారు.
నగరంలో వేలాది మంది సిబ్బందితో 24 గంటలు లాక్‌డౌన్‌ను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేసే దిశగా ముందుకు వెళ్తున్నారు. అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు వచ్చిన వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నరు. ఈ మేరకు 49 వేల కేసులు నమోదుచేసి, సుమారు 70 వేల వాహనాలను పోలీస్ అధికారులు సీజ్ చేసినట్లు సమాచారం. ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాలని, అప్పుడే కరోనా వైరస్‌ను కట్టడి చేయగలుగుతామని, ప్రజలు సహకరించాలని కోరుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com