కోవిడ్ 19: కువైట్ లో పూర్తిస్థాయి కర్ఫ్యూ..ప్రజలు సహకరించాలని కోరిన ప్రభుత్వం

- May 09, 2020 , by Maagulf
కోవిడ్ 19: కువైట్ లో పూర్తిస్థాయి కర్ఫ్యూ..ప్రజలు సహకరించాలని కోరిన ప్రభుత్వం

కువైట్:కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలను మరింత కఠినతరం చేస్తోంది కువైట్ ప్రభుత్వం. ఇందులోభాగంగా దేశంలో ఇక పూర్తిస్థాయి కర్ఫ్యూ విధించేందుకు రంగం సిద్ధం చేసింది. ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి ఈ నెల 30 వరకు పూర్తిస్థాయి కర్ఫ్యూ అమలులో ఉంటుందని అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి అనస్ అల్ సలెహ్ వెల్లడించారు. కరోనా నియంత్రణపై ప్రస్తుత పరిస్థితిని కేబినెట్ లో చర్చించిన తర్వాత మీడియా కాన్ఫరెన్స్ లో మాట్లాడిన మంత్రి ' మీ స్వీయ రక్షణ కోసం ప్రస్తుత పరిస్థితిలో అంతిమ దశ నిర్ణయాలు తీసుకోక తప్పటం లేదు. ప్రస్తుత విపత్తు నుంచి బయటపడేందుకు వీలుగా పూర్తి స్థాయి కర్ఫ్యూ విధిస్తున్నాం. కర్ఫ్యూ  సజావుగా అమలు అయ్యేందుకు ప్రజలు, ప్రవాసీయులు భద్రతా బలగాలకు సహకరించాలని కోరుతున్నాం. కరోనా కట్టడికి అవసరమైన అన్ని చర్యలను ఆరోగ్య శాఖ అధికారులు చేపడతారు. పరిస్థితులు క్రమంగా మెరుగుపడి మళ్లీ సాధారణ జనజీవనం నెలకొంటుంది' అని అన్నారు.

కర్ఫ్యూ రోజుల్లో రెండు గంటలు మాత్రం ప్రజలు బయటికి వచ్చేందుకు అనుమతి ఇచ్చారు. ప్రతి రోజు సాయంత్రం 4.30 నుంచి 6.30 వరకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చినా..నివాస ప్రాంగణాలను దాటి ఎక్కువ దూరం వెళ్లకూడదని కూడా షరతులు విధించారు. అలాగే కర్ఫ్యూ సడలింపు సమయంలో కార్లలో తిరిగేందుకు కూడా అనుమతి లేదని మంత్రి స్పష్టం చేశారు. ఇదిలాఉంటే అత్యవసర విభాగాలైన ఆస్పత్రులు, విద్యుత్, భద్రతల బలగాలు, నీటి సరఫరా ఉద్యోగులకు మాత్రం కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు. అలాగే ఆయిల్ రంగానికి కూడా కర్ఫ్యూ వర్తించదని మంత్రి స్పష్టం చేశారు.  

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com