వందే భారత్ మిషన్: ఏ.పికి ప్రత్యేక విమాన సర్వీసులు

- May 20, 2020 , by Maagulf
వందే భారత్ మిషన్: ఏ.పికి ప్రత్యేక విమాన సర్వీసులు

వందేభారత్‌ మిషన్‌లో భాగంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ప్రత్యేక విమానాల్లో తీసుకువస్తున్నారు. రెండో విడతలో ఏపీకి ఈ వారంలో నాలుగు ప్రత్యేక విమానాలు రానున్నాయి. అందులో ఒకటి ఇప్పటికే మనీలా, అబుధాబి నుంచి విశాఖపట్నంకు 148 ప్రయాణికులతో వచ్చింది.సౌదీ నుంచి విజయవాడకు ఇవాళ (మే 20) మరో విమానం రానుంది.

ఎయిరిండియా 1914 విమానం ఇవాళ (మే 20) జెడ్డా నుంచి విజయవాడకు రాత్రి 10గంటల 15నిమిషాలకు రానుంది. ఇదే విమానంలో ప్రయాణించే తెలంగాణ వారిని విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి ఏఐ1407 విమానంలో హైదరాబాద్‌కు చేర్చుతారు. మొదటి విడతలో వయసు పై బడ్డ వారితో పాటు పిల్లలు, వృద్దులు, మహిళలు, అనారోగ్యం బాగా లేని వారికి ప్రాధాన్యం ఇచ్చారు. అందులో కేరళతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. ఈసారి మాత్రం తెలుగువారికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు.

లాక్‌డౌన్‌ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న వారిని తీసుకువచ్చేందుకు చేపట్టిన వందే భారత్‌ మిషన్‌లో భాగంగా ఇవాళ్టి(మే20) నుంచి 27వ తేదీ వరకు మూడు ప్రత్యేక విమానాలు గన్నవరం ఎయిర్‌పోర్టుకు రానున్నాయి. ఎయిరిండియాకు చెందిన తొలి విమానం సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఉన్న కింగ్‌ అబ్దుల్‌ అజీజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇవాళ బయల్దేరి రాత్రి 10.15 గంటలకు ఇక్కడికి చేరుకుంటుంది.

ఈ నెల 23న ఎయిరిండియాకు చెందిన మరో విమానం సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఉన్న కింగ్‌ ఖలీద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరి ఆ రోజు (మే 20) రాత్రి 10.15 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు వస్తుంది. అదే విమానం రాత్రి 11 గంటలకు తిరిగి హైదరాబాద్‌ బయల్దేరుతుంది. వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రవాసాంధ్రులను తీసుకుని న్యూఢిల్లీ నుంచి ఎయిరిండియా విమానం ఈ నెల 27న ఉదయం 11.30 గంటలకు గన్నవరం చేరుకుంటుందని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.

విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం ఎయిర్‌పోర్టులోని అంతర్జాతీయ టెర్మినల్‌ను అధికారులు సిద్ధం చేశారు. ప్రయాణికులు ఇక్కడికి చేరుకోగానే వైద్య పరీక్షలు, థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహిస్తారు. తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులు ద్వారా ప్రయాణికుల ఎంపిక మేరకు ప్రభుత్వ, పెయిడ్‌ క్వారంటైన్‌ సెంటర్లకు తరలిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com