కువైట్:కోవిడ్ 19 వారియర్స్ ప్రొత్సహాకాలు..వైరస్ బారిన పడిన ఉద్యోగులకు అదనపు వేతనం

- June 02, 2020 , by Maagulf
కువైట్:కోవిడ్ 19 వారియర్స్ ప్రొత్సహాకాలు..వైరస్ బారిన పడిన ఉద్యోగులకు అదనపు వేతనం

కువైట్:కరోనా వైరస్ పై ప్రాణాలకు తెగించి పోరాడిన ఫ్రంట్ లైన్ వర్కర్స్, ఇతర సహాయక సిబ్బందికి కువైట్ ప్రభుత్వం ప్రొత్సాహాక నగదు అందించనుంది. ఇందుకోసం ఆయా శాఖల వారీగా ఉద్యోగుల జాబితాను సిద్ధం చేసే కసరత్తు ముమ్మరం చేసింది. ఎలక్ట్రిసిటీ, నీటి సరఫరా మంత్రిత్వ శాఖ నియమించిన కమిటీ ప్రొత్సహాకాలు అందుకునేందుకు అర్హులైన ఉద్యోగుల జాబితాను సిద్ధం చేసేందుకు మినిస్ట్రి అండర్ సెక్రెటరీ ఆధ్వర్యంలో సమావేశం కానుంది. సివిల్ సర్వీస్ కమిషన్ కు ఉద్యోగుల పేర్లను సిఫారసు చేసే ముందే కమిటీ ఉద్యోగుల జాబితాపై అధ్యయనం చేయనుంది. కరోనా సంక్షోభ సమయంలో చురుకుగా పని చేసి...రివార్డ్ అందుకునేందుకు అర్హులైన ఉద్యోగుల పేర్లతో జాబితాను పంపించాలని ఇప్పటికే వివిధ ప్రభుత్వ విభాగాల అధిపతులకు సివిల్ సర్వీస్ కమిషన్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కరోనా సమయంలో ప్రజలకు సేవ చేసిన ఉద్యోగుల పని తీరును బట్టి మూడు విభాగాలు విభజించి నగదు ప్రొత్సహాకాలు అందించనున్నారు. కరోనా పేషెంట్లతో నేరుగా కాంటాక్ట్ లో ఉన్న ఫ్రంట్ లైన్ వర్కర్స్ ను అధిక ప్రధాన్యత ఇవ్వనున్నారు. అలాగే లాక్ డౌన్ సమయంలో తమకు కేటాయించిన లక్ష్యాలను సమర్ధవంతంగా నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగులను రెండో కేటగిరిగా గుర్తించనున్నారు. ఇక కర్ఫ్యూ సమయంలో తమ సాధారణ సేవలకు అదనంగా విధులు నిర్వహించిన వారిని మూడో కేటగిరిగా పరిగణిస్తారు. ఇక విధి నిర్వహణలో కరోనా బారిన పడిన ప్రభుత్వ ఉద్యోగులకు అదనంగా ఆర్దిక సాయం అందించనున్నారు. నెల జీతానికి రెట్టింపు శాలరీ ఇవ్వటం లేదా ఒక విడత KD 8000 స్టైఫండ్ రెండింటిలో ఏదో ఒకటి అమలు చేయనున్నారు. ఫిబ్రవరి 24 నుంచి మే 31 మధ్యకాలాన్ని కమిటీ పరిగణలోకి తీసుకోనుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com