కోవిడ్-19: దుబాయ్ తిరిగొచ్చే ప్రవాసీయులకు ప్రత్యేక నిర్బంధ మార్గనిర్దేశకాలు

- June 13, 2020 , by Maagulf
కోవిడ్-19: దుబాయ్ తిరిగొచ్చే ప్రవాసీయులకు ప్రత్యేక నిర్బంధ మార్గనిర్దేశకాలు

దుబాయ్:వివిధ దేశాల నుంచి తిరిగివచ్చే ప్రవాసీయులకు నిర్బంధ మార్గనిర్దేశకాలను ప్రకటించింది దుబాయ్ పర్యాటక శాఖ. యూఏఈ వచ్చే ప్రవాసీయులు అంతా హోటల్ లో గానీ, ఇంట్లోగానీ ఖచ్చితంగా 14 రోజుల పాటు నిర్బంధంలో ఉండాల్సిందేనని సూచించింది. ఈ మేరకు హోటల్స్ నిర్బంధం ఉండేవారికి, ఇళ్లలో నిర్బంధంలో ఉండేవారికి సంబంధించి వేర్వేరుగా మార్గనిర్దేశకాలను ప్రకటించింది. కరోనా సంక్షోభానికి ముందు వివిధ కారణాలతో తమ దేశాలకు వెళ్లి చిక్కుకుపోయిన దాదాపు 2 లక్షల మంది ప్రవాసీయులు యూఏఈకి తిరిగి రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు యూఏఈలోని పౌర గుర్తింపు అధికారుల సమాఖ్య ఏర్పాట్లు కూడా చేస్తోంది. అయితే..ఇంత పెద్ద సంఖ్యలో తిరిగి వస్తున్న ప్రవాసీయుల కారణంగా కరోనా తీవ్రత పెరగకుండా ప్రస్తుత మార్గనిర్దేశకాలను విడుదల చేశారు. ప్రతి ప్రయాణికుడు విమాన టికెట్లను కొనుక్కున్న సమయంలోనే ఆయా మార్గనిర్దేశకాలకు సంబంధించి అన్ని సూచనలతో కూడిన వివరాలను తెలియజేస్తారు. లేదంటే ప్రయాణ సమయంలోనైనా వివరిస్తారు. ప్రతి ఒక్కరు COVID-19 DXB యాప్ ను తమ మొబైల్స్ ఇన్ స్టాల్ చేసుకొని తమ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. తద్వారా అందరిపై ఆరోగ్యశాఖ నిఘా పెట్టనుంది. 

14 రోజుల నిర్బంధానికి అనుగుణంగా ప్రవాసీయులు వారి వెసులుబాటును బట్టి హోటళ్లలోనైనా ఉండొచ్చు. లేదంటే అన్ని సౌకర్యాలు ఉంటే ఇంట్లోనైనా ఉండొచ్చు. హోటల్ గదుల్లో ఉండేవారు అందుకు ఛార్జీలను వారే భరించాల్సి ఉంటుంది. నిర్బంధంలో ఉన్న 14 రోజులు ఎట్టి పరిస్థితుల్లోనూ గది నుంచి బయటికి రాకూడదు. ఎవరు ఉండే గదులను వారే శుభ్రపరుచుకోవాలి. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే హోటల్ నిర్వాహకులు ఆరోగ్య శాఖకు సమాచారం అందిస్తారు. 24 గంటల పాటు మొబల్ యాప్ ద్వారా టెలి డాక్టర్ ను సంప్రదించి తగిన సూచనలు పొందవచ్చు. ఫేస్ మాస్క్, హ్యాండ్ గ్లౌవ్స్ తప్పనిసరిగా ధరించాలి. 

ఇక ఇళ్లలో నిర్బంధం ఉండేవారికి ఇంట్లో ప్రత్యేక గది, దానికి అటాచ్ బాత్రూం ఖచ్చితంగా ఉండాలి. నిర్బంధంలో ఉండే వ్యక్తికి సాయం చేసేందుకు పూర్తి ఆరోగ్యవంతుడైన వ్యక్తి అందుబాటులో ఉండాలి. అత్యవసరం అయితే తప్ప వారికి కేటాయించిన గది దాటి రాకూడదు. ఒకవేళ రావాల్సి వస్తే ఫేస్ మాస్క్, హ్యాండ్ గ్లౌవ్స్ ధరించాలి. తరచూ చేతులను సబ్బుతో శుభ్రపరుచుకోవాలి. క్వారంటైన్ గదికి డోర్ ను ప్రతి రోజు శుభ్రపరిచాలి. నిర్బంధంలో ఉన్న వ్యక్తికి డోర్ దగ్గరి నుంచే ఆహారాన్ని అందించాలి. ఒక వేళ ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే హాట్ లైన్ నెంబర్ 800342 కి గానీ, లేదంటే ఆంబులెన్స్ నెంబర్ 997కి గానీ కాల్ చేయాలని దుబాయ్ పర్యాటక శాఖ సూచించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com