జూన్ 19న హాస్య బ్రహ్మ జంధ్యాల వర్ధంతి

- June 18, 2020 , by Maagulf
జూన్ 19న హాస్య బ్రహ్మ జంధ్యాల వర్ధంతి

సుదీర్ఘ తెలుగు చలనచిత్ర చరిత్రలో హాస్యానికి ఒక అధ్యాయాన్ని రచించిన రైటర్ జంధ్యాల జూన్ 19, 2001 న మరణించారు. తండ్రి నుండి సంక్రమించిన సాంస్కృతిక వారసత్వం వలన నాటకాల రచనకు శ్రీకారం చుట్టారు. ఇచ్చట గుండెలు మార్చబడును, ఓ చీకటి రాత్రి, సంధ్యారాగం, ఏక్ దిన్ కా సుల్తాన్ వంటి నాటికలు,నాటకాలు రాసి శభాష్ అనిపించుకున్నారు. సినీ దర్శకేంద్రుడు బి. ఎన్. రెడ్డి వద్ద పనిచేయాలనే తలంపుతో 1975 లో మద్రాసు కు పయనమయ్యారు. ఆయన నాటికలు అప్పటికే కళా తపస్వి కె.విశ్వనాథ్ కు చేరడంతో సిరిసిరిమువ్వ చిత్రానికి సంభాషణలు రాసే అవకాశం లభించింది. అంతే వెనక్కి తిరిగి చూసుకోకుండా ముందుకు సాగారు. అయితే తొలిసారి రచన చేసింది 'పెళ్లికాని పెళ్లి' చిత్రానికి.అంచెలంచెలుగా ఎదుగుతున్న జంధ్యాలకు దర్శకత్వ అవకాశం వచ్చింది.తొలిసారిగా 'ముద్దమందారం' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత నాలుగుస్తంబాలాట, శ్రీవారికి ప్రేమలేఖ, అహానా పెళ్ళంట, వివాహ భోజనంబు, ఆనంద భైరవి, రెండు జెళ్ళ సీత, మూడుముళ్లు వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. కె.విశ్వనాథ్ సాగరసంగమం, ఆపద్బాంధవుడు, శంకరాభరణం, సప్తపది, సాగర సంగమం వంటి ఉత్తమ చిత్రాలకు మాటలు రాశారు. ఎన్ టి ఆర్ నటించి సంచలనం సృష్టించిన 'అడవిరాముడు' కి మాటలు రాశారు. 'ఆపద్బాంధవుడు' చిత్రానికి, 'శంకరాభరణం' చిత్రాలకు గాను ఉత్తమ మాటల రచయిత గా రాష్ట్ర ప్రభుత్వ నంది బహుమతిని గెల్చుకున్నారు. దాదాపు 300 చిత్రాలకు ఆయన రచయిత గా పనిచేశారు. తెలుగు తెరపై తారాల్లా వెలిగిపోతున్న ఎందరో కళాకారులని ఆయన తొలి పరిచయం చేశారు. అందులో నరేష్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, సుత్తి వేలు, సుత్తి వీరభద్రరావు, ప్రదీప్, ఇ వి వి సత్యనారాయణ లాంటి దర్శకుడు కూడా ఆయన స్కూల్ నుండి వచ్చినవారే. సంక్షిప్త సంభాషణలు రాయడంలో ఆత్రేయ తర్వాత జంధ్యాలదే అగ్రస్థానం. అంతేకాదు టైటిల్స్ విషయంలోనూ అంతే శ్రద్ద చూపేవారు. ఆయన చూపిన దారిలో నవతరం నడవడమే తనకు నిజమైన నివాళి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com