మహమ్మారిపై మానవత్వంతో విజయం..దుబాయ్ లో గురునానక్ దర్బార్ గురుద్వారా సేవలు

- July 15, 2020 , by Maagulf
మహమ్మారిపై మానవత్వంతో విజయం..దుబాయ్ లో గురునానక్ దర్బార్ గురుద్వారా సేవలు

దుబాయ్:ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పీడిస్తున్న వేళ సొంత దేశంలోనే కొందరికి కష్టాలు తప్పటం లేదు.అలాంటిది దేశంగానీ దేశంలో భారతీయుల ఆకలి కష్టాలను తీర్చటమే కాకుండా..స్వదేశానికి తిరిగివచ్చే స్థోమత లేని వాళ్ల సొంత ఖర్చులతో ఇండియాకు చేరవేస్తోంది గురునానక్ దర్బార్ గురుద్వారా సంస్థ. కరోనా పీడ నుంచి యూఏఈలోని ఇండియన్లను ఆదుకొని వారికి భరోసాగా నిలుస్తోంది. అంతర్జాతీయ విమానాలు రద్దైన సమయంలో ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి యూఏఈలో చిక్కుకుపోయిన భారతీయులను వారి స్వస్థలాలకు చేరవేయటంలో ఎంతో కృషి చేసింది. ఇంకా చేస్తోంది కూడా. గురునానక్ దర్బార్ గురుద్వారా ఏర్పాటు చేసిన 9 ప్రత్యేక విమానాల ద్వారా గత జూన్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 1750 మందిని వారి సొంతూర్లకు చేరుకున్నారు. కరోనా సంక్షోభంతో ఉద్యోగాలు పోయి, ఆర్ధికంగా సమస్యలు ఎదుర్కొంటూ తిండి కూడా లేకుండా ఇబ్బంది పడుతున్న సమయంలో వారికి తగిన సాయం అందించింది ప్రశంసలు అందుకుంటోంది. గురునానక్ దర్బార్ గురుద్వారా సాయంతో ఇండియా చేరుకున్న వారిలో 150 మందికి ఉచితంగా టికెట్లు అందించారు. మరో 50 మందికి డిస్కౌంట్ తో టికెట్లు సమకూర్చారు. అంతేకాదు దాదాపు 9 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి ఇండియా వెళ్లటానికి డబ్బులు కూడా లేని 25 మంది గురునానక్ దర్బార్ గురుద్వారా ఏర్పాటు చేసిన ఛార్టెర్డ్ విమానం ద్వారా ఇవాళ ఇండియాకు పయనం అయ్యారు. అంతేకాదు..కరోనా ఒడిదుడుకులతో ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న వారిలో దాదాపు 1000 మందికి ఆహార పొట్లాలను అందజేశారు. అలాగే 300-400 వరకు మందికి నిత్యావసర సరుకులను అందించారు.

ఈ సందర్భంగా గురునానక్ దర్బార్ గురుద్వారా ఛైర్మన్ సురేందర్ సింగ్ కాంధారి మాట్లాడుతూ..సేవకు సిక్కులు ఎల్లపుడూ ముందుంటారు అని అన్నారు. తమకు ఎంతగానో సహకరించిన సుఖ్ దేవ్ సింగ్, ఖల్సా మోటర్ సైకిల్ క్లబ్ కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే దుబాయ్ స్థానిక అధికారుల తోడ్పాటను మరిచిపోలేమని ప్రశంసించారు. మనమంతా ఒకే దేవుడి బిడ్డలమని, దేశం, మతం, కులంతో సంబంధం లేకుండా మనిషికి మనిషి సాయం చేసుకోవాలని అన్నారాయన. కరోనా సంక్షోభం జీవితంలో సేవ గుణం అవసరాన్ని చాటి చెప్పిందని అభిప్రాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com