తెలంగాణదర్పం ఉట్టిపడేలా కొత్త సచివాలయం..డిజైన్ గీసిన ఆ ఆర్కిటెక్ ఎవరో తెలుసా?

- July 17, 2020 , by Maagulf
తెలంగాణదర్పం ఉట్టిపడేలా కొత్త సచివాలయం..డిజైన్ గీసిన ఆ ఆర్కిటెక్ ఎవరో తెలుసా?

 

నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పరిపాలన కేంద్రమైన సచివాలయం సరికొత్త దర్పం సంతరించుకోనుంది. డెక్కన్ కాకతీయ శైలిలో సమీకృత సచివాలయ భవన నిర్మాణం తెలంగాణాకు తలమానికంగా నిలవబోతోంది. ఫ్రాన్స్‌లోని ప్యాలెస్ ఆఫ్ వర్సెల్స్ స్ఫూర్తిగా తెలంగాణ సంస్కృతి, పచ్చదనానికి ప్రధాన్యం ఇస్తూ..కాకతీయ శైలిని మేళవిస్తూ రాష్ట్రానికే దిగ్గజ భవనంగా గుర్తింపు ఉండేలా సచివాలయ భవనం డిజైన్ దాదాపు ఖరారైంది. అయితే..తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు రాష్ట్ర దర్పం ఉట్టిపడేలా..మచ్చుకు కూడా వాస్తు దోషాలు లేకుండా..పర్యావరణ హితంగా, విశాలంగా, పార్కింగ్ స్థలానికి, గ్రీనరీకి లోటులేకుండా కొత్త సచివాలయం భవనాన్ని డిజైన్ చేసిన ఘనత ప్రముఖ అర్కిటెక్ ఆస్కార్, అతని భార్య పొన్నికి దక్కుతుంది. కొత్త సచివాలయ భవంతి కోసం దాదాపు పది నమూనాలను పరిశీలించిన ప్రభుత్వం..ఆస్కార్, పొన్ని జంట డిజైన్ చేసిన భవింతిని దాదాపుగా ఖరారు చేసింది.

చెన్నైకి చెందిన ఆస్కార్, పొన్ని జంటకు అంతర్జాతీయంగా పలు ప్రముఖ భవనాలను డిజైన్లు అందించిన అనుభవం ఉంది. హర్వార్డ్ యూనివర్సిటీలో అర్కిటెక్ అడ్వాన్స్డ్ ప్రొఫెషనల్ స్టడీస్ లో స్పెషలైజేషన్ చేసిన ఈ జంట ప్రతిభను మెచ్చి పలు యూనివర్సిటీలు డాక్టరేట్ లతో గౌరవించాయి. న్యూయార్క్ లోని పలు ఆకాశ హర్మ్యాలు, స్టేడియంలు, హస్సిటల్స్, పెద్ద పెద్ద హోటల్స్, పలు సంస్థల భవనాలను డిజైన్ చేసి తమ నైపుణ్యం చాటుకున్నారు. అలాగే ఖతార్, దోహాలో పలు ప్రభుత్వ భవనాలు, యూనివర్సిటీలు, మెడికల్ కాలేజీలు, స్టేడియంలు, ఐటీ పార్క్స్, బయోటెక్ పార్క్స్, నానో టెక్నాలజీ పార్క్స్, టౌన్ షిప్స్, ఫ్యాక్టరీలకు డిజైన్లు అందించారు. ఇలా తమ డిజైన్ ల ఎప్పటికప్పుడు ప్రతిభ చాటుతూ వస్తున్న ఆస్కార్, పొన్ని దంపతులకు ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ విభాగంలో ఇప్పటివరకు 131 అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ ప్రతిభ పురస్కారాలు దక్కాయి. ఇక ఇప్పుడు 500 కోట్లతో నిర్మించ తలపెట్టిన తెలంగాణ కొత్త సచివాలయాన్ని డెక్కన్ కాకతీయ శైలితో రాష్ట్ర వైభవాన్ని చాటేలా డిజైన్ అందించి మరోసారి తమ సత్తా నిరూపించుకుందీ ఈ జంట.

ఇక కొత్త నిర్మాణంలో ఫీచర్స్ ఒకసారి చూస్తే, ఇది పూర్తి వాస్తు ప్రకారం రూపొందించిన డిజైన్. అత్యుత్తమ దక్షిణభారత సంప్రదాయంలో, డెక్కన్ కాకతీయ శైలిలో సమీకృత సచివాలయ భవన నిర్మాణం తెలంగాణాకు తలమానికంగా ఉంటుంది. మనోహరమైన కాకతీయుల నిర్మాణశైలిలో విలక్షణ స్మారక చిహ్నంగా సమీకృత కొత్త సచివాలయ నిర్మాణం జరగనుంది. మొత్తం 27 ఎకరాల స్థలంలో కేవలం 20% మాత్రమే సమీకృత భవన నిర్మాణానికి, మిగిలిన 80% ఉద్యానవనానికి, ఫౌంటైన్ల కోసం వినియోగించనున్నారు. సైట్లో 60% స్థలం, అందమైన పచ్చికబయళ్లతో కూడి, కర్బన రసాయనాలను నియంత్రించే విధంగా, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పరిచేలా ఉంటుంది.

భవన నిర్మాణానికి 20 శాతం స్థలాన్ని ఉపయోగించి, మిగిలిన స్థలాన్ని ల్యాండ్ స్కేప్‌లు, రాష్ట్ర అధికార పుష్షమైన తంగేడు పువ్వు ఆకారంలో ఫౌంటెయిన్లు నిర్మించనున్నారు. కాంప్లెక్స్ లో ఓ శిశుసంరక్షక కేంద్రం, దేవాలయం, మసీదు, ఇతర ప్రార్థనా మందిరాలు, క్యాంటీన్, ఫైర్ స్టేషన్, బ్యాంకులు, ఏటీఎంలకు ప్రత్యేక భవనాలు, విజిటర్స్ కోసం ప్రత్యేక పార్కింగ్ తదితర సౌకర్యాలు కూడా ఉండేలా నమూనాను రూపొందించారు. ఒకేసారి 800 కార్లు పార్కు చేసుకునేలా, రెండు హెలికాప్టర్లు ల్యాండ్ అయ్యేలా డిజైన్ చేశారు. ఇక ఇందులో మొత్తం ఆరు అంతస్తులుంటాయి. వీటికి ఏ విధమైన వాస్తు దోషం లేకుండా నిపుణులను సంప్రదించి మరీ ఈ భవనాన్ని నిర్మించనున్నారు. ప్రభుత్వం వెల్లడించిన డిజైన్ ప్రకారం 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీర్ఘ చతురస్రాకారంలో కొత్త సచివాలయం రూపుదిద్దుకోనుంది. ఇక ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న సచివాలయం గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ లో, కృత్రిమ విద్యుత్ దీపాలు అవసరం లేకుండా సహజమైన వెలుతురుపడేలా ఉంటుంది. భవనం మొత్తం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో స్మార్ట్ బిల్డింగ్ కాన్సెప్ట్‌లో నిర్మితమవుతుంది. స్మార్ట్ లైటింగ్ కంట్రోళ్లు, మోషన్ సెన్సార్లు, ఆటోమాటిక్ స్విచ్చులు, టైమర్లు, డిమ్మింగ్ కంట్రోళ్లు లాంటి హంగులన్నిటినీ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. 

--శ్రీకాంత్ చిత్తర్వు(ఎడిటర్-ఇన్-చీఫ్,దుబాయ్ )

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com