తెలంగాణ:కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం..
- August 17, 2020
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలు సంభవిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు.గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు, మరో మూడు నాలుగు రోజుల పాటు భారీ, అతి భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని చెప్పారు. ఏ ఒక్కరి ప్రాణం పోకుండా కాపాడడమే ప్రధాన లక్ష్యంగా అధికార యంత్రాంగం పనిచేయాలని, ఎక్కడికక్కడ కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి 24 గంటల పాటు నిరంతరాయంగా పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు. సహాయక చర్యలు చేపట్టడానికి ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడవద్దని, అవసరమైన నిధులు సిద్ధంగా ఉన్నాయని సిఎం వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పట్టణాల నుంచి ప్రతీ రోజు నివేదిక తెప్పించుకుని, పరిస్థితిని బట్టి చర్యలు తీసుకోవాలని చెప్పారు.
రాష్ట్రంలో వానలు, వరదలు, వాటి వల్ల తలెత్తిన పరిస్థితిపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ, రెవెన్యూ, జల వనరులు, విద్యుత్, మున్సిపల్, పంచాయతీ రాజ్, వ్యవసాయం, రహదారులు – భవనాలు తదితర శాఖలకు చెందిన సీనియర్ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేశారు. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, కరీంనగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు వరదల ఉధృతి ఎక్కువున్న నేపథ్యంలో అక్కడి పరిస్థితిని సీఎం ప్రత్యేకంగా సమీక్షించారు.
గడిచిన నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చెరువులు నిండాయి. అన్ని జలాశయాల్లో నీరు వస్తున్నది. నదులు, వాగులు, వంకలు పొంగుతున్నాయి. ఇప్పటి వరకు పరిస్థితి అదుపులోనే ఉంది. కానీ రాబోయే మూడు నాలుగు రోజులు కూడా చాలా ముఖ్యం.ఈశాన్య మధ్యప్రదేశ్, ఉత్తర చత్తీస్ గఢ్, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ ప్రాంతాలలో కొనసాగుతున్న అల్పపీడనం, అల్పపీడనానికి అనుబంధంగా 5.8 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం వల్ల భారీ వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయి. దీనికి తోడు ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఈనెల 19 న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. మరో వైపు గోదావరి, కృష్ణ, తుంగభద్ర, ప్రాణహిత, ఇంద్రావతి నదులకు నీరందించే క్యాచ్ మెంట్ ఏరియా కలిగిన ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ అన్ని కారణాల వల్ల రాబోయే రోజుల్లో భారీ వర్షాలు పడి, భారీగా వరదలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి, రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలను అంచనా వేసి అందుకు తగినట్లు ఏర్పాట్లు చేసుకోవాలి’’ అని ముఖ్యమంత్రి కోరారు.
రాష్ట్రంలో దాదాపు అన్ని చెరువులు నిండి, అలుగు పోస్తున్నాయి. మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టిన ఫలితంగా చెరువు కట్టలు పటిష్టంగా తయారయ్యాయి. గతంలో ఇలాంటి వర్షాలు వస్తే వేల సంఖ్యలో చెరువు కట్టలు తెగేవి. బుంగలు పడేవి. కానీ మిషన్ కాకతీయ వల్ల చెరువుల నిల్వ సామర్థ్యం పెరిగింది. కట్టలు పటిష్టం అయ్యాయి. మిషన్ కాకతీయలో చేపట్టని కొన్ని చిన్న పాటి కుంటలకు మాత్రమే నష్టం వాటిల్లింది. అయితే రాబోయే రోజుల్లో ఇంకా వర్షాలు పడే అవకాశం ఉన్నందున, చెరువులకు వరద నీరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ప్రతీ చెరువునూ ప్రతీ నిత్యం గమనిస్తూనే ఉండాలి’’ అని సిఎం ఆదేశించారు.
వరంగల్ నగరాన్ని ముంచెత్తిన వానలు, వరదల పరిస్థితిని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమీక్షించారు. అక్కడ చేపట్టిన సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. వరంగల్ నగరంలో స్వయంగా పర్యటించి, పరిస్థితిని పర్యవేక్షించి, అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్ మంగళవారం ఉదయం హెలి కాప్టర్లో వరంగల్ వెళతారు. ఆ జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు సత్యవతి రాథోడ్ కూడా వీరితో కలుస్తారు. మంత్రుల బృందం నగరంలో పర్యటించి, పరిస్థితిని పర్యవేక్షిస్తుంది. వరంగల్ ఎంజిఎంను సందర్శిస్తారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహిస్తారు. వానలు, వరదలు, కరోనా పరిస్థితిని సమీక్షిస్తారు. తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయాలు తీసుకుంటారు.
సమావేశంలో ముఖ్యమంత్రి చెప్పిన ముఖ్య విషయాలు:
- ఎంత విపత్తు వచ్చినా సరే ప్రాణనష్టం జరగవద్దనేదే ప్రభుత్వ లక్ష్యం. ఇతరత్రా నష్టాలు సంభవిస్తే ఏదోలా పూడ్చుకునే అవకాశం ఉంది. కానీ, ప్రాణాలు తిరిగి తేలేము. కాబట్టి విపత్తు నిర్వహణలో ప్రాణాలు కాపాడడమే అత్యంత ప్రధానమనే విషయాన్ని అధికార యంత్రాంగం గుర్తించాలి. దానికి అనుగుణంగా పనిచేయాలి. ప్రజలు కూడా వాతావరణం బాగా లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా, ఇబ్బంది కలిగినా, ముంపు ప్రమాదం ఉన్నా వెంటనే అధికార యంత్రాంగానికి సమాచారం అందించాలి. కూలిపోయే పరిస్థితిలో ఉన్న ఇండ్లలో ఎట్టి పరిస్థితుల్లో ఉండొద్దు. కాజ్ వేల వద్ద వరద నీరు రోడ్లపైకి వస్తున్నది. అక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు నీటి ప్రవాహానికి ఎదురెళ్లి ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దు.
- గోదావరి నదికి భారీ వరద వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏటూరు నాగారం, మంగపేట మండలాలతో పాటు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉండే ముంపు గ్రామాలను, ప్రాంతాలను గుర్తించాలి. అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.
- గోదావరికి భారీ వరద వస్తే భద్రాచలం పట్టణానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి భద్రాచలం పట్టణంలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో జాగ్రత్తగా ఉండాలి.
- నీటి ముంపు పొంచి ఉన్న ప్రాంతాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక సహాయక శిబిరాలు ఏర్పాటు చేయాలి. ఈ శిబిరాల్లో అందరికీ కావాల్సిన వసతి, భోజనం ఏర్పాటు చేయాలి. కోవిడ్ నుంచి రక్షణ కోసం మాస్కులు, శానిటైజర్లు అందించాలి.
- మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఎక్కడికక్కడే ఉండి తమ ప్రాంతాల్లో సహాయ చర్యలను పర్యవేక్షించాలి.
- వర్షాలు, వరదల వల్ల జరిగిన పంట నష్టంపై వ్యవసాయ శాఖ అధికారులు అంచనాలు తయారు చేయాలి.
- పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల అధికారులు ప్రతీ రోజు ప్రతీ పట్టణం, ప్రతీ గ్రామం నుంచి తాజా పరిస్థితిపై నివేదిక తెప్పించుకోవాలి. ఆ నివేదిక కలెక్టర్ల ద్వారా కార్యదర్శికి, అక్కడి నుంచి ప్రధాన కార్యదర్శికి చేరాలి. దానికి అనుగుణంగా ఎక్కడ ఏది అవసరమో ఆ చర్య తీసుకోవాలి. సహాయక చర్యల్లో ఎక్కడా ఎలాంటి అశ్రద్ధ, జాప్యం జరగవద్దు.
- ప్రస్తుతం తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటూనే భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు అనుసరించాల్సిన శాశ్వత వ్యూహాన్ని అధికార యంత్రాంగం రూపొందించుకోవాలి. ఏ స్థాయిలో వర్షం వస్తే, ఎక్కడ ఎంత నీరు వస్తుంది? ఏ నదికి ఎంత వరద వస్తుంది? అప్పుడు ఏ ప్రాంతాలు మునిగే అవకాశం ఉంది? అలా జరిగితే ఏ చర్యలు తీసుకోవాలి? ఎంత వర్షం వచ్చినా సరే ముంపుకు గురికాకుండా లోతట్టు ప్రాంతాలను ఎలా కాపాడాలి? ఎక్కడ రోడ్లపైకి నీరు వచ్చే అవకాశం ఉంది? ఎక్కడ కాజ్ వేల మీదుగా నీరు ప్రవహించవచ్చు? రోడ్లకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుంది? తదితర అంశాలపై విస్తృతంగా అధ్యయనం చేసి వ్యూహం ఖరారు చేయాలి. అన్ని పట్టణాల్లో మున్సిపల్ శాఖ, పోలీసుతో కలిసి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి. విపత్తు జరిగిన వెంటనే రంగంలోకి దూకే విధంగా వారిని సిద్ధం చేయాలి.
- అన్ని నదుల వద్ద ఫ్లడ్ ట్రాక్ షీట్ తయారు చేయాలి. నదుల్లో నీటి ప్రవాహం ఎక్కువైతే జరిగే పరిణామాలను అంచనా వేయాలి. గతంలో నదులు పొంగి ప్రవహించినప్పుడు ఎలాంటి పరిస్థితి తలెత్తిందో ట్రాక్ రికార్డు ఉండాలి. దాని ఆధారంగా భవిష్యత్ ప్రణాళిక సిద్ధం చేయాలి.
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వానలు, వరదలు సంభవిస్తే ఏమి చేయాలనే విషయంలో ఆంధ్రప్రాంతాన్నిదృష్టిలో పెట్టుకుని మాత్రమే వ్యవహరించారు. దానికి అనుగుణంగానే ప్రణాళికలు, ఏర్పాట్లు చేశారు. తెలంగాణ గురించి ఆనాడు పట్టించుకోలేదు. తెలంగాణకు వానలు వచ్చినా, వరదలు వచ్చినా, విపత్తులు వచ్చినా వాటిని పరిగణలోకి కూడా తీసుకోలేదు. తెలంగాణ వచ్చిన తర్వాతనైనా తెలంగాణ దక్పథంలో విపత్తుల నిర్వహణ వ్యూహాన్ని రూపొందించుకోవాలి. ఇది శాశ్వత ప్రాతిపదికన జరగాలి. ఫ్లడ్ మేనేజ్మెంట్ ఆఫ్ తెలంగాణ పాలసీ తయారు కావాలి.
- వర్షాకాలంలో సంభవించే అంటు వ్యాధులు, ఇతరత్రా వ్యాధుల విషయంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు సరైన అవగాహన కల్పించాలి. క్షేత్ర స్థాయిలో వైద్య సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాలి. అన్ని ప్రభుత్వ వైద్య శాలల్లో అవసరమైన మందులు సిద్ధంగా ఉంచాలి. ఇది కేవలం ఈ ఒక్క సంవత్సరానికే కాకుండా ప్రతీ వానాకాలంలో వైద్య పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో సరైన వ్యూహం రూపొందించి, అమలు చేయాలి.
- రాష్ట్ర రాజధానితో పాటు అన్ని జిల్లా కేంద్రాలలో కంట్రోల్ రూములు 24 గంటల పాటు నిరంతరాయంగా నడవాలి. ఎక్కడి నుంచి ఏ ఫోన్ కాల్ వచ్చినా స్వీకరించి, తక్షణం సహాయం అందించాలి. కంట్రోల్ రూముల్లో రెవెన్యూ, పోలీస్, జల వనరుల శాఖ, విద్యుత్ శాఖ తదితర ముఖ్యమైన శాఖల ప్రతినిధులుండాలి.
మంత్రులు మహమూద్ అలీ,కె.టి రామారావు, నిరంజన్ రెడ్డి,ఈటల రాజేందర్,జగదీష్ రెడ్డి,వేముల ప్రశాంత్ రెడ్డి,తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ట్రాన్స్ కో – జెన్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు, సిఎంవో ముఖ్యకారదర్శి నర్సింగ్ రావు, కార్యదర్శులు భూపాల్ రెడ్డి, స్మితా సభర్వాల్, సిఎం ఓ.ఎస్.డి శ్రీధర్ దేశ్ పాండే, డిజిపి మహేందర్ రెడ్డి, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నరసింహా చారి, జి.ఎ.డి కార్యదర్శి వికాస్ రాజ్, మునిసిపల్ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, వ్యవసాయ ముఖ్య కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, పంచాయతిరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, జలవనరుల ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, పంచాయతి రాజ్ కమిషనర్ రఘునందన్ రావు, ఎంఎయుడి కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, డిసాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి రాహుల్ బొజ్జా, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి, జిహెచ్ ఎంసి కమిషనర్ లోకేశ్, టిఎస్ఎస్పిడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి, ఇఎస్ సి మురళీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!