బాలు కోసం అపోలో ప్రతాప్‌ రెడ్డికి ఉపరాష్ట్రపతి వెంకయ్య ఫోన్

- August 27, 2020 , by Maagulf
బాలు కోసం అపోలో ప్రతాప్‌ రెడ్డికి ఉపరాష్ట్రపతి వెంకయ్య ఫోన్

దేశీయ, విదేశీ ప్రఖ్యాత వైద్య నిపుణుల వీడియో కాల్‌ పర్యవేక్షణలో చికిత్స..స్పందిస్తున్న ఎస్పీ బాలు

న్యూఢిల్లీ: భారతీయ భాషలన్నింటిలోను తన గాన మాధుర్యంతో సంగీత ప్రియులను అలరించిన బాలుని కరోనా నుంచి కాపాడేందుకు భారతావని అంతా ఒక్క తాటిపైకి వచ్చి సర్వమత ప్రార్థనలు చేస్తోంది. అందరి ప్రార్థనలు ఫలించే దిశగా బాలులో కొద్దిపాటి కదలికలు వచ్చాయని, కంటి సైగలను అర్థం చేస్కుంటున్నారని వస్తోన్న వార్తలు అందరినీ కాస్త ఊరటపరుస్తున్నాయి. కానీ బాలులో ఈ మాత్రం కదలికలు రావడం వెనుక భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నిరంతర పర్యవేక్షణ కూడా ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ నెల 5న కరోనా బారిన పడ్డ బాలు కోలుకుంటున్నట్లు ఉంటూనే 11 వ తేదీన అకస్మాత్తుగా కుప్పకూలి కోమాలోకి వెళ్లిపోయారు. విశ్వ ప్రయత్నాలు చేసినా ప్రయోజనం పెద్దగా లేదని భావించిన ఎంజీఎం వైద్యశాల ఆయన అభిమానులను దృష్టిలో ఉంచుకుని విడుదల చేసిన ప్రత్యేక మెడికల్‌ బులిటెన్‌ అందరినీ ఆందోళనకు గురిచేసింది. బాలు ఆరోగ్యం విషమించిందని, ఐసీయూ లో వెంటిలేటర్‌ పై కృత్రిమశ్వాస తో ఉన్నారన్నది ఆ బులిటెన్‌ సారాంశం. వాస్తవానికి అప్పటికే బాలు ని రక్షించలేని స్థాయిలో కరోనా ఇన్ఫెక్షన్‌ ఊపిరితిత్తులుతో పాటు ప్రధాన అవయవాలను కమ్మేసిందని, రెమిడిసివర్‌ ఇంజెక్షన్లతో పాటు డెక్సా మిథాసిన్‌ స్థాయి కూడా దాటి అసలు చేయి దాటి పోయిందని వైద్యులు చేతులెత్తేశారు.

ఈ విషయాన్ని ఎస్పీ కుమారుడు చరణ్‌ ద్వారా తెలుసుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్‌ వెంటనే తన తండ్రికి విషయాన్ని చేరవేసింది. వెంకయ్య కూడా వెంటనే ప్రధాని మోదీ కి కూడా సమాచారం ఇవ్వడంతో పీఎంఓ ఎంజీఎం వైద్యశాలను ఢిల్లీ లోని ఎయిమ్స్‌ తో పాటు విదేశాలలోని నిపుణుల బృందాలతో వీడియో కాల్స్‌ ద్వారా చికిత్స అందించే ఏర్పాట్లను ప్రధాని కార్యాలయం సమన్వయం చేసింది.

దీంతో బాలు క్రమేపీ కోలుకోవడం ప్రారంభించారు. పీఎంఓతో పాటు ఉపరాష్ట్రపతి కార్యాలయం రోజూ మోనిటర్‌ చేస్తుండడం తో వైద్యులు ప్రత్యేక దృష్టిని పెట్టారు. ప్రపంచ స్థాయిలో విజయవంతం అయిన అనేక ప్రయోగాలను బాలు పై ప్రయోగించి ఎలాగైనా బాలుని రక్షించాలని అహర్నిశలూ కృషి చేసారు. దీంతో బాలు చికిత్స కు స్పందించడం మొదలు పెట్టారు.

అదే సమయంలో బాలు కి నడుము కింది భాగం పూర్తిగా వైద్యానికి స్పందించడం లేదని  విదేశీ వైద్యుల బృందం గుర్తించింది. అందుకోసం ప్రత్యేకంగా ఉండే 5 కోట్ల విలువైన ఒక ఫిజియోథెరోఫీ యంత్రాన్ని కొనుగోలు చేయాలని ఎం జీ ఎం వైద్యశాలకు సూచించింది. ఎంజీఎం వైద్యశాల యాజమాన్యం కూడా అది తర్వాత ఎవ్వరికీ పనికిరాకపోయినా కేవలం బాలు కోసం దాన్ని కొనుగోలు చేయాలని పెద్దమనసుతో నిర్ణయించింది. అయితే అలాంటివి వెంటనే అందుబాటులో లేకపోవడం, విదేశాలనుంచి తెప్పించినా కనీసం ఆరు వారాలు సమయం పట్టే పరిస్థితి ఉండడంతో ఏం చేయాలో పాలుపోక ఎంజీఎం యాజమాన్యం ఆలోచనలో పడింది.

అయితే ఇలాంటి యంత్రం దక్షిణభారత దేశం మొత్తంలో కేవలం ఒక్క చెన్నై అపోలో లో నే ఉంది. ఈ విషయం తెలుసుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించి అపోలో గ్రూప్‌ వైద్యశాలల చైర్మన్‌ ప్రతాప్‌  రెడ్డితో మాట్లాడారు. ఫిజియోథెరోఫీ యంత్రాన్ని బాలు వైద్యం కోసం కొన్ని రోజులపాటు అపోలో నుంచి ఎంజీఎంకి తరలించాలని వెంకయ్య కోరారు. దీనికి ప్రతాప్‌సి రెడ్డి కూడా అదే రీతిలో స్పందించి యంత్రాన్ని ఎంజీఎం ఆస్పత్రికి తరలించడానికి అంగీకరించారు. దీంతో ఆ ప్రక్రియ ప్రారంభం అయ్యి ఆఘమేఘాలపై ప్రస్తుతం సాగుతోంది. ఆ ప్రక్రియ కూడా గురువారం మధ్యాహ్నానికి ముగిసి చికిత్స ప్రారంభం అయితే మరో ఒకటి రెండు రోజుల్లో బాలు ఆరోగ్యం మరింత మెరుగుపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అని వైద్యులు చెబుతున్నారు. ఇలా మన వెంకయ్య ఉపరాష్ట్రపతి హోదాలో ఉన్నా తన అభిమాన గాయకుడు, కుటుంబ సన్నిహితుడు, తమ జిల్లా, ప్రాంత, రాష్ట్ర, దేశానికి చెందిన బాలుని కాపాడడానికి చేస్తోన్న ప్రయత్నాలు అందరికీ తెలియచేయాలన్న లక్ష్యంతో ఈ ప్రత్యేక కథనాన్ని లాయర్‌ మీకు అందిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com