16 సంవత్సరాల తర్వాత ఇంటికి చేరిన తెలంగాణ వాసి
- September 02, 2020
దుబాయ్: పాస్‌పోర్ట్ లేనందున గత 16 సంవత్సరాలుగా దుబాయ్‌లో చిక్కుకున్న గల్ఫ్ వలసదారుడు చివరకు సెప్టెంబర్ ఒకటిన (మంగళవారం) తెలంగాణలో తన కుటుంబంతో తిరిగి కలిసాడు. కరోనా మహమ్మారి నేపథ్యంలో యూఏఈ ప్రకటించిన ఆమ్నెస్టీ పధకం క్రింద 1.46 లక్షల దిర్హామ్స్ (సుమారు రూ .29 లక్షలు) భారీ జరిమానాను మాఫీ చేసింది. వివరాల్లోకి వెళితే..
కామారెడ్డి జిల్లాలోని చింతమన్‌పల్లి గ్రామానికి చెందిన నీలా యెల్లయ్య నిర్మాణ సంస్థలో కార్మికునిగా పనిచేసేందుకు 2004 లో యూఏఈ కి రావటం జరిగింది. ప్రతికూల పరిస్థితుల కారణంగా, అతను సంస్థను వదిలి దుబాయ్ మరియు షార్జాలో గత 16 సంవత్సరాలుగా చిన్నాచితకా ఉద్యోగాలు చేశాడు.
యెల్లయ్య దుస్థితి గురించి తెలుసుకున్న రూపేష్ మెహతా (దుబాయ్ లోని సామాజిక సేవా సంస్థ ‘జైన్ సేవా మిషన్’ (జెఎస్ఎమ్) తో స్వచ్ఛందంగా పనిచేస్తున్న) దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ నుండి అత్యవసర సర్టిఫికేట్ (తాత్కాలిక పాస్పోర్ట్) పొందటానికి సహాయం చేశారు. యెల్లయ్య 16 సంవత్సరాల క్రితం యూఏఈ చేరినప్పటి పాత పాస్‌పోర్ట్ వివరాలు అందుబాటులో లేకపోవడంతో తాత్కాలిక పాస్‌పోర్ట్ జారీ చేయడం ఆలస్యం అయిందని 'జెఎస్ఎమ్' తెలిపింది. యెలయ్య భార్య అభ్యర్థన మేరకు హైదరాబాద్ పాస్పోర్ట్ కార్యాలయం, వారి డేటాబేస్లో పాత పాస్పోర్ట్ (2004) వివరాలను శోధించింది. ఈ వివరాలను దుబాయ్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా (సిజిఐ) కు అందించగా, తాత్కాలిక పాస్‌పోర్ట్ జారీ చేయడం సహాయపడింది. ఈ విషయంలో దుబాయ్ సిజిఐలో లేబర్ కాన్సుల్స్ గా వ్యవహరిస్తున్న జితేందర్ సింగ్ నేగి, హర్జీత్ సింగ్ సహాయం అందించారు. దుబాయ్ నుండి హైదరాబాద్ కు వెళ్లేందుకు యెల్లయ్య కు ఉచిత ఎయిర్ టికెట్ను కూడా అందించింది భారత కాన్సులేట్.
యూఏఈ లోని ఇమ్మిగ్రేషన్ నిబంధనల ప్రకారం, గడువు ముగిసిన వీసా ఉన్నవారు మరియు చట్టవిరుద్ధంగా నివసిస్తున్న వారందరికీ రోజుకు 25 దిర్హాములు (రూ .500) జరిమానా విధించబడుతుంది. యెల్లయ్య విషయంలో, అతను 16 సంవత్సరాల పాటు 1.46 లక్షల దిర్హాములు (సుమారు రూ .29 లక్షలు) జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఇండియన్ కాన్సులేట్ సహకారంతో ఈ మొత్తం మాఫీ చేయబడటమే కాకుండా యూఏఈ నుండి బయలుదేరడానికి ఎగ్జిట్ పర్మిట్ (ఇమ్మిగ్రేషన్ అవుట్ పాస్) అతనికి జారీ చేయబడింది.
సోమవారం అర్థరాత్రి హైదరాబాద్ చేరుకున్న 48 ఏళ్ల యెల్లయ్య కు రాష్ట్ర ఎన్‌ఆర్‌ఐ సెల్‌కు ఇన్‌ఛార్జి చిట్టిబాబు స్వాగతం పలికారు. అతని శారీరక మరియు మానసిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని, కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు అతనికి ‘ఇంటి నిర్బంధం’ అనుమతించబడింది. భార్య రాజవ్వా, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి యెలయ్య మంగళవారం తన సొంత గ్రామానికి చేరుకోవటం జరిగింది. యెలయ్య గల్ఫ్‌కు బయలుదేరినప్పుడు పుట్టిన కుమార్తె ఇప్పుడు తల్లి అయిందని తెలుసుకొని ఆనందించాడు యెల్లయ్య.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







