ప్రకృతి సంరక్షణ ప్రజాఉద్యమంగా మారాలి:ఉపరాష్ట్రపతి

- September 09, 2020 , by Maagulf
ప్రకృతి సంరక్షణ ప్రజాఉద్యమంగా మారాలి:ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ:ప్రకృతి సంరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చాల్సిన అవసరముందని.. ఇందుకోసం ప్రతి ఒక్కరు, ముఖ్యంగా యువత ప్రత్యేక చొరవతీసుకోవాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. ‘హిమాలయాల దినోత్సవం’ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో అంతర్జాల వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. ప్రకృతితో మమేకమై జీవించడం అత్యంత ఆవశ్యకమని.. తద్వారా అభివృద్ధిని పునర్నిర్వచించుకుని ముందుకెళ్లాల్సిన అవసరముందని ఆయన దిశానిర్దేశం చేశారు.

హిమాలయాలు అసాధారణ వనరులకు నిలయమని ఉద్ఘాటించిన ఉపరాష్ట్రపతి.. వాటిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని సూచించారు. ప్రాంతీయ సహజ వనరులు, స్థానిక సంస్కృతి, సంప్రదాయ జ్ఞానానికి అనుగుణంగా హిమాలయ ప్రాంతాల అభివృద్ధి వ్యూహాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

పర్యావరణాన్ని కాపాడుకుంటూ జరిగే అభివృద్ధే సుస్థిరాభివృద్ధిగా అభివర్ణించిన ఉపరాష్ట్రపతి, వివిధ కారణాలతో హిమాలయాల్లో పర్యావరణ వ్యవస్థ ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రకృతి విషయంలో మనం చూపుతున్న అశ్రద్ధ కారణంగానే.. తరచూ ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయన్నారు. 

హిమాలయాల పర్యావరణ, ఆర్థిక, సాంస్కృతిక ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ.. ఈ పర్వతాలు లేకుంటే భారతదేశం ఎడారిలా ఉండేదన్నారు. ఇవి భారతదేశాన్ని మధ్య ఆసియా నుంచి వచ్చే శీతలగాలుల నుంచి రక్షించడంతోపాటు.. రుతుపవనాలను ఆపడం ద్వారా ఉత్తరభారతంలో వర్షాలు విస్తారంగా కురిసేందుకు దోహదపడుతున్నాయని గుర్తుచేశారు.

54వేలకు పైగా హిమనీనదాలతో పాటు ఆసియాలోని 10 ప్రధాన నదులకు జన్మస్థానమైన హిమాలయాలు.. భూమండంలోపై ఉన్న దాదాపు సగం జనాభాకు జీవనరేఖగా నిలుస్తున్నాయన్నారు. హిమాలయాల పర్యావరణ హిత జలవిద్యుత్ ఉత్పాదన సామర్థ్యాన్ని కూడా ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు.

ఏటికేడు పెరుగుతున్న భూతాపం కారణంగా హిమాలయాల్లోని హిమానీనదాలు కరిగే రేటు పెరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, ఇది కొనసాగితే భవిష్యత్తులో.. తాగు, సాగునీటితో పాటు వివిధ రకాలుగా హిమాలయాలపై ఆధారపడుతున్న దాదాపు వందకోట్ల మంది జీవితాలపై దుష్ప్రభావం పడుతుందన్నారు. ప్రకృతితో మనం అనుసరిస్తున్న ఈ తీరు ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదని, ప్రకృతి పట్ల ఇలానే వ్యవహరిస్తూ పోతే, దాని ప్రకోపానికి బాధితులం కాక తప్పదని హితవు పలికారు. 

ప్రకృతిని కాపాడుకోవడం మన సంస్కృతిలో భాగమని గుర్తుచేసిన ఉపరాష్ట్రపతి.. 
ప్రకృతి, సంస్కృతిని కలుపుకుని ముందుకు వెళ్తేనే భవిత భవ్యంగా ఉంటుందన్నారు. హిమాలయాల పరిరక్షణ కోసం ఉద్దేశించిన ‘జాతీయ హిమాలయ పర్యావరణ వ్యవస్థ సంరక్షణ పథకం’, ‘సెక్యూర్ హిమాలయాస్’ వంటి పలు ప్రభుత్వ కార్యక్రమాలను కూడా ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. స్థానిక ప్రజలు తమ వ్యవసాయ, నిత్యావసరాలకోసం హిమాలయ అరణ్యాలపై ఆధారపడుతున్నారని.. ఇలాంటి సమయంలో ప్రకృతిని కాపాడుకుంటూ ముందుకెళ్లే సరికొత్త అభివృద్ధి ప్రణాళికలను రూపొందించుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. హిమాలయాలు విస్తరించి ఉన్న రాష్ట్రాలతోపాటు అక్కడ జన్మించి, ప్రవహిస్తున్న నదుల కారణంగా లబ్ధి పొందుతున్న ఉత్తరభారతంలోని రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రజలు కూడా దీనిపై దృష్టిసారించాలని ఉపరాష్ట్రపతి సూచించారు.

పర్యావరణ పరిరక్షణకోసం సేంద్రియ వ్యవసాయం ఉత్తమమైన పద్ధతి అని సూచించిన ఉపరాష్ట్రపతి.. సిక్కిం, మేఘాలయ, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు ఈ దిశగా సాధిస్తున్న ప్రగతిని అభినందించారు. మిగిలిన ప్రాంతాల్లోనూ సేంద్రియ వ్యవసాయాన్ని అలవర్చుకోవడంలో అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు వెతకటంలో ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయాలు కృషిచేయాలని కూడా ఉపరాష్ట్రపతి సూచించారు.

హిమాలయాలు విస్తరించిన రాష్ట్రాల్లో పర్యాటకమే ప్రధాన ఆర్థిక, ఆదాయ వనరు అని పేర్కొన్న ఉపరాష్ట్రపతి.. పర్యావరణహిత పర్యాటకాన్ని ప్రోత్సహించడం ఈ రాష్ట్రాల సుస్థిరాభివృద్ధికి బాటవేస్తుందన్నారు. 

భారతదేశ సంస్కృతితో హిమాలయాలు ముడిపడిఉన్నాయని.. వీటి పర్యావరణ, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అద్భుతమైన ప్రకృతి రమణీయతతోపాటు పవిత్ర పుణ్యక్షేత్రాలకు కూడా హిమాలయాలు ఆలవాలమన్నారు. అంతటి ప్రాముఖ్యత, పవిత్రత ఉన్న హిమాలయాల పరిరక్షణను ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలన్నారు. ఈ ప్రాంత ప్రజల జీవనశైలిలో మార్పులు తీసుకురావడంతోపాటు వ్యవసాయం, సుస్థిర సాంకేతిక వినియోగం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న శ్రీ అనిల్ ప్రకాశ్ జోషి వంటి పర్యావరణవేత్తల కృషిని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు.
ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ రమేశ్ పోఖ్రియాల్ నిశంక్ రాసిన ‘సంసద్ మే హిమాలయ’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. 

ఈ అంతర్జాల కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి  రమేశ్ పోఖ్రియాల్ నిశంక్, కేంద్ర మంత్రులు  జితేంద్ర సింగ్, కిరణ్ రిజిజు, అనురాగ్ ఠాకూర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ బిపిన్ రావత్, కేంద్ర ప్రభుత్వ సాంకేతిక సలహాదారు విజయ్ రాఘవన్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్, ప్రముఖ పర్యావరణ వేత్త డాక్టర్ అనిల్ ప్రకాశ్ జోషితోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com