స్వామి వివేకానంద యువతకు గొప్ప రోల్ మోడల్: తెలంగాణ గవర్నర్

- September 11, 2020 , by Maagulf
స్వామి వివేకానంద యువతకు గొప్ప రోల్ మోడల్: తెలంగాణ గవర్నర్

 హైదరాబాద్:విద్యార్థులు, యువత స్వామి వివేకానందుని బోధనలను ఆదర్శంగా తీసుకుని, స్ఫూర్తితో కృషి చేసి తమ శక్తి సామర్థ్యాలను సద్వినియోగం చేసుకోవాలని గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు.విద్యార్ధులు, యువతలో ఆత్మహత్య సంఘటనలు పెరుగుతుండటం పట్ల గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు.జీవితంలో సమస్యలను పూర్తి ధైర్యంతో ఎదుర్కోవడానికి, విజయం సాధించడానికి వివేకానంద బోధనలు అత్యంత ఉపయుక్తమైనవని డా. తమిళిసై అన్నారు. 

వివేకానందుని చారిత్రాత్మక చికాగో ఉపన్యాసం 127వ వార్షికోత్సవం సందర్భంగా రామకృష్ణ మఠం, వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్ లెన్స్ సంస్థలు సంయుక్తంగా సంప్రీతి దినోత్సవం నిర్వహించాయి.ఈ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సంధర్భంగా డా. తమిళిసై మాట్లాడుతూ తాను ఎప్పుడైనా నిరాశకు గురైతే, తాను స్వామి వివేకానందుని రచనలు చదివి పునరుత్తేజితమౌతానని వివరించారు. 
“సమస్తమైన శక్తి మనలోనే దాగుందని, సంకల్ప శక్తితో యువత అనుకున్నది సాధించవచ్చని”, స్వామి వివేకానంద చాటి చెప్పాడని, ఇవి అత్యంత స్ఫూర్తివంతమైన మాటలని గవర్నర్ స్పష్టం చేశారు. 

తనకు 4వ తరగతిలో ఉన్నప్పుడు, తన నాన్న వివేకానందుని పుస్తకం బహుకరించాడని, అప్పటి నుండి తాను వివేకానందుని మాటలు, రచనల ద్వారా నిరంతరం స్ఫూర్తి పొందుతున్నానని డా. తమిళిసై వివరించారు.చికాగో 127 సంవత్సరాల క్రితం వివేకానందుడు భారతీయ వేదాంత చింతన గూర్చి ఒక సింహం వలె గర్జించాడని, ఆయన మాటలు ఇప్పటికీ అనుసరణనీయమని అన్నారు. 

ప్రపంచ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ లో స్వామి చేసిన ప్రసంగాలలో అతి ముఖ్యమైన అంశాలు మూఢత్వాన్ని, ద్వేషాన్ని వదలాలని చెప్పడం. ప్రపంచంలో శాంతి, సౌభ్రాతృత్వం, అభివృద్ధి కోసం వివిధ మతాలు ఒకదానినొకటి గౌరవించడం అత్యంత ఆవశ్యకమైనవన్నాడని డా. తమిళిసై తెలిపారు. 

రామకృష్ణ మఠం, అనాగే 21వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ లు భారతీయ విశిష్ఠ సంస్కృతి, వేదాంత భావనను, వివేకానందుని బోధనలు విశ్వవ్యాప్తం చేయడంలో గొప్పగా పనిచేస్తున్నాయని గవర్నర్ అభినందించారు. 
ఈ కార్యక్రమంలో రామకృష్ణ మఠం వైస్ ప్రెసిడెంట్ స్వామి గౌతమానంద, ఆర్కే మఠం అధ్యక్షులు స్వామి జ్ఞానదానంద, వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ సంస్థ డైరెక్టర్ స్వామి బోధమయానంద, రాకా సుధాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com