జాతినుద్దేశించి మోడీ ప్రసంగం...ఇంతకీ ఏమన్నారంటే...

జాతినుద్దేశించి మోడీ ప్రసంగం...ఇంతకీ ఏమన్నారంటే...

న్యూఢిల్లీ : కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ కోసం ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని, వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగానే అందరికీ అందిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ‘మానవజాతిని కాపాడేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎందరో కృషిచేస్తున్నారు..వ్యాక్సిన్ కోసం మన శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు కష్టపడుతున్నార’ని చెప్పారు.కరోనా వైరస్‌ నుంచి దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని  కోవిడ్‌-19 తర్వాత ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా తేరుకుంటోందని వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్‌ కోసం ప్రపంచంతో పాటు భారత్‌ సైతం వేచిచూస్తోందని అన్నారు.  ప్రధాని మోదీ మంగళవారం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ పండుగల సీజన్‌లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఏ దశలోనూ అలసత్వం అనేది పనికిరాదని హెచ్చరించారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు బాగుందని, పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. 

అమెరికా, బ్రెజిల్‌లో మరణాల రేటు అధికంగా ఉందని, భారత్‌లో మరణాల రేటు తక్కువగా ఉందని పేర్కొన్నారు. ప్రజలు రోజువారీ పనుల్లో నిమగ్నమవుతున్నారని చెప్పారు.అయితే కరోనాతో ప్రమాదం లేదని అనుకోరాదని, మహమ్మారిపై పోరాటం సుదీర్ఘమైనదని స్పష్టం చేశారు. కరోనాపై మనం చివరిదాకా పోరాడాల్సిందే అన్నారు. మాస్క్‌ ధరించకుంటే మనతో పాటు కుటుంబ సభ్యులను ప్రమాదంలోకి నెట్టినట్టేనని ప్రధాని హెచ్చరించారు. లాక్డౌన్‌ ముగిసినా వైరస్‌ అంతం కాలేదన్నది మనం మరువరాదని అన్నారు.

కోవిడ్‌-19పై పోరాటంలో కరోనా పరీక్షల నిర్వహణ కీలకంగా మారిందని, మన వైద్యులు..నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు నిస్వార్ధంగా సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. కరోనా వైరస్‌ అంతమయ్యే వరకూ మనం మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిర్లక్ష్యంగా ఉంటే భారీ మూల్యం చెల్లించుకుంటామని హెచ్చరించారు. ‘మీ అందరినీ సురక్షితంగా చూడాలని అనుకుంటున్నా..ఆరోగ్యంగా ఉండండి జీవితంలో పైకి ఎదగండ’ని అన్నారు. ప్రజలకు దసరా, దీపావళి, ఈద్‌, గురునానక్‌ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.

Back to Top