ముఖ్యమంత్రి వై.యస్.జగన్ ను కలిసిన దివ్య కుటుంబసభ్యులు

ముఖ్యమంత్రి వై.యస్.జగన్ ను కలిసిన దివ్య కుటుంబసభ్యులు

విజయవాడ:విజయవాడ ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన దివ్య కుటుంబసభ్యులు  ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి ని కలిశారు. హోంమంత్రి మేకతోటి సుచరిత దివ్య కుటుంబసభ్యులను దగ్గరుండి సీఎం ని కలిపించారు. దేవినేని అవినాష్ తో పాటు దివ్య తేజస్విని తండ్రి జోసెఫ్, తల్లి కుసుమ, సోదరుడు దినేష్, బంధువు షకీరా సీఎం ని కలిశారు. దాదాపు అరగంటకు పైగా దివ్య  తల్లిదండ్రులతో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం జరిగింది. దారుణ సంఘటన గురించి దివ్య పేరెంట్స్ సీఎం కి వివరించారు. బాగా కష్టపడి చదువుకునే అమ్మాయిని నాగేంద్ర అనే ప్రేమోన్మాది ఇంట్లోకి చొరబడి నిర్దాక్షిణ్యంగా కత్తితో పొడిచి చంపాడన్నారు. దివ్య కుటుంబసభ్యుల బాధలను, సమస్యలను చాలా ఓపికతతో సీఎం వినడం జరిగింది. తక్షణ ఆర్థిక సహాయంగా 10 లక్షల రూపాయలను దివ్య ఫ్యామిలీ కి సీఎం ప్రకటించారు. 

ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి, జరిగిన సంఘటన గురించి చాలా ఓపికతో విన్నారని దివ్య తండ్రి జోసెఫ్ తెలిపారు. ఎంతో  ఆప్యాయంగా మాట్లాడంతో పాటు, మా కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చారని జోసెఫ్ తెలిపారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తానని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. సీఎం ను కలవాలని అడిగిన వెంటనే హోంమంత్రి సత్వరం స్పందించారని దివ్య తల్లి కుసుమ సంతోషం వ్యక్తం చేసారు. నిందితుడు నాగేంద్ర కోలుకున్న వెంటనే అరెస్ట్ చేసి కఠిన శిక్ష పడేలా చూడలని సీఎం అధికారులను అదేశించారు.

దివ్య కుటుంబానికి జరిగిన అన్యాయం విని సీఎం జగన్మోహన్ రెడ్డి చలించిపోయారని హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. చక్కగా చదువుకునే అమ్మాయిని అన్యాయంగా ఇంట్లోకి చొరబడి హత్య చేయడం దారుణమన్నారు. అమ్మాయిని విచక్షణా రహితంగా దాదాపు 13 కత్తి పోట్లు పొడిచి హత్య చేయడం నిజంగా హేయమైన చర్య అని హోంమంత్రి తెలిపారు. వీరి కుటుంబానికి అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. దివ్య తండ్రి డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నప్పటికీ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని చూసారు. ఈ లోపే దారుణమైన సంఘటన జరగడం చాలా బాధాకరమని హోంమంత్రి విచారణ వ్యక్తం చేశారు. దాడి చేసిన నాగేంద్ర రెండు రోజుల్లో కోలుకునే అవకాశం ఉంది. హాస్పిటల్ నుండి డిచార్జి అయిన వెంటనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిని దిశ ప్రకారం 21 రోజేల్లోనే శిక్ష పడేలా చట్టం రూపొందించడం జరిగింది. దివ్య కు తెలిసితెలియని వయస్సులో నిందితుడు నాగేంద్ర వెంటబడి వేదించాడు. దివ్య తల్లిదండ్రులు ను కూడా కాల్ చేసి బెదిరించాడు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హోంమంత్రి సుచరిత హామీ ఇచ్చారు. ఆపదలో ఉన్న ఆడపిల్లలు డయల్ 100, దిశ యాప్, అదేవిధంగా ఏపీ పోలీస్ సేవ యాప్ కు కాల్ చేయాలని హోంమంత్రి సూచించారు. ఆడపిల్లకు బెదిరింపు కాల్స్ వస్తే భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దివ్య కుటుంబసభ్యులకు జరిగిన అన్యాయం ఏ కుటుంబానికి జరగకుండా చూస్తామని హామీనిచ్చారు. ఆడపిల్లలకు ఎటువంటి సమస్య వచ్చినా భయపడకుండా తల్లిదండ్రులకు చెప్పాలని తెలిపారు. రాష్ట్రంలో ఆడపిల్లలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు.

Back to Top