గ్రేటర్ లో వెయ్యి అధునాత బస్ షెల్టర్ల నిర్మాణం - మేయర్ బొంతు రామ్మోహన్

- November 13, 2020 , by Maagulf
గ్రేటర్ లో వెయ్యి అధునాత బస్ షెల్టర్ల నిర్మాణం - మేయర్ బొంతు రామ్మోహన్

హైదరాబాద్:విశ్వ‌న‌గ‌రంగా రూపొందుతున్న గ్రేట‌ర్ హైద‌రాబాద్ న‌గ‌రంలో అత్యాధునిక హంగుల‌తో వెయ్యి బ‌స్ షెల్ట‌ర్ల‌ను ఏర్పాటు చేస్తున్నట్లు నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. దిల్ సుఖ్ నగర్ లో నూతనంగా నిర్మించిన ఆరు ఆధునిక బస్ షెల్టర్లను నేడు ఉదయం మేయర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ... ప్ర‌యాణికుల‌కు మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించ‌డంతో పాటు ఏసి, వైఫై, ఏటీఎం, సిసి టి.వి, మొబైల్ చార్జింగ్‌, టాయిలెట్‌ల‌ను ఈ ఆధునిక బ‌స్‌షెల్ట‌ర్‌లలో ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. ఇప్పటికే 292 బస్ షెల్టర్లను నగరవాసులకు అందుబాటులోకి తెచ్చామని అన్నారు. పిపిపి ప‌ద్ద‌తిలో ఏర్పాటు చేసిన ఏసి బ‌స్ షెల్ట‌ర్లను అడ్వాన్స్‌డ్ బ‌స్‌షెల్ట‌ర్లుగా 200x30ఫీట్ల విస్తీర్ణంలో నిర్మించామని, కేవ‌లం పాశ్చ‌త్య దేశాల‌లోని ప్ర‌ముఖ న‌గ‌రాల్లో మాత్ర‌మే ఈ విధ‌మైన బ‌స్ షెల్ట‌ర్లు ఉన్నాయని తెలిపారు.  ఈ బ‌స్‌షెల్ట‌ర్ల‌లోని కొన్నింటిలో డ‌స్ట్‌బిన్‌లు, టాయిలెట్లు, మొబైల్ చార్జింగ్ పాయింట్లు, మంచినీటి సౌక‌ర్యం, వైఫై, ఫ్యాన్లు, టికెట్ కౌంట‌ర్ల‌ను కూడా ఏర్పాటు చేశామని, మరికొన్నింటిలో డ‌స్ట్‌బిన్‌, మొబైల్ చార్జింగ్ పాయింట్‌, టాయిలెట్స్‌, మంచినీటి సౌక‌ర్యం ఏర్పాటు చేశామన్నారు.  ఏసి బస్ షెల్టర్లలో భద్రత కోసం సెక్యురిటీగార్డ్ లను కూడా నియమించామని, ఈ అత్యాధునిక బ‌స్‌షెల్ట‌ర్ల‌ను ఏర్పాటు చేయ‌డం ద్వారా హైద‌రాబాద్ న‌గ‌రం  ప్ర‌ముఖ న‌గ‌రాల్లో మాదిరిగా న‌గ‌ర‌వాసుల‌కు మెరుగైన సౌక‌ర్యం ఏర్ప‌డుతోంద‌ని న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com