OLX మోసాలపై షార్ట్ ఫిల్మ్ ను విడుదల చేసిన సజ్జనార్

- December 26, 2020 , by Maagulf
OLX మోసాలపై షార్ట్ ఫిల్మ్ ను విడుదల చేసిన సజ్జనార్

సైబరాబాద్ : ఓఎల్ఎక్స్ మోసాలపై  ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రముఖ నటి, వ్యాఖ్యాత వర్షిణి మరియు కాలేజీ విద్యార్థిని సింధు సంగం కలిసి నటించిన షార్ట్ ఫిల్మ్ ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తన ఛాంబర్‌లో శుక్రవారం విడుదల చేశారు. షార్ట్‌ఫిల్మ్‌లో నటించిన వర్షిణి మరియు సింధు సంగంను,  షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్, స్క్రిప్ట్, డైరెక్షన్, ఎడిటర్‌ హైమను సజ్జనార్ అభినందించి సన్మానించారు. కార్యక్రమంలో సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడిసిపి మాణిక్ రాజ్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏసిపి లక్ష్మీ నారాయణ, ఎస్టేట్ ఆఫీసర్ సంతోష్, ఆర్ఐ అరుణ్ కుమార్ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ... ఓఎల్ఎక్స్ మోసాలపై  ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సెకండ్‌ హ్యాండ్‌ వస్తువుల పేరిట క్రయవిక్రయాలు జరిపే ఆన్‌లైన్‌ పోర్టల్స్‌ను సైబర్‌ నేరగాళ్లు  అక్రమ సంపాదనకు అడ్డాగా మార్చుకుంటున్నారు. తాము ప్రభుత్వోద్యోగులమంటూ, ఆర్మీ అధికారులమంటూ ప్రచారం చేసుకుంటూ తక్కువ ధరకే విలువైన కార్లు, కెమెరాలు అమ్ముతామని నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు.  కొంతమంది ఫిర్యాదులు చేస్తున్నా చాలా మంది ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. 

ఓఎల్‌ఎక్స్‌ ఫ్రాడ్స్‌ నుంచి అప్రమత్తంగా ఉండేందుకు సీపీ సజ్జనార్‌ పలు సూచనలిచ్చారు..

తెలుసుకోండి.. అప్రమత్తంగా ఉండండి..
- వస్తువును ప్రత్యక్షంగా చూడకుండా సోషల్‌ మీడియా వేదికల్లోని ప్రకటనలు నమ్మొద్దు.
- వస్తువును విక్రయించే అసలు యజమానులు ధరను కచ్చితంగా చెబుతారు. సైబర్‌ క్రిమినల్స్‌ ఇచ్చే ప్రకటనల్లో వస్తువుకు సరైన ధర ఉండదు.
- వస్తువు డెలివరీ కాకముందే నగదు ఇవ్వొద్దు.
- వస్తువులను కొనుగోలు చేయాలన్నా, విక్రయించాలన్నా అసలైన వెబ్‌సైట్లనే ఎంపిక చేసుకోండి.
- నగదు వాపసు వస్తుందంటే నమ్మొద్దు.
- గుర్తు తెలియని వ్యక్తులు, ఓఎల్‌ఎక్స్‌ ప్రకటనలకు సంబంధించి క్యూఆర్‌ కోడ్‌లు పంపిస్తే వాటిని క్లిక్‌ చేయొద్దు.
- క్యూఆర్‌ కోడ్‌ ద్వారా డబ్బులు చెల్లించమంటే అది మోసమని గ్రహించాలి.
- ఓఎల్‌ఎక్స్‌ వేదికగా ఆర్మీ అధికారులు, పోలీసు అధికారులమని ఇచ్చే ప్రకటనలకు బోల్తా పడొద్దు. వాటిని ప్రత్యక్షంగా చూసిన తర్వాతే కొనుగోలు చేయాలి. కేవలం ఫొటోల ద్వారా అంటే అది చీటింగేనంటూ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సూచిస్తున్నారు.
- ప్రకటనలో ఉన్న వివరాలను  సరి చూసుకోవాలి.
- మిలటరీ , ఇతర పారా మిలటరీ అధికారులమంటూ పెట్టే ఫొటోలను అసలు నమ్మొద్దు. 
- అడ్వాన్స్‌ డబ్బును వాహనం రిజిస్ట్రేషన్‌ అవ్వగానే ఇస్తామంటే అసలు నమ్మొద్దు.
- ప్రత్యక్షంగా కలవండి...పత్రాలన్నింటిని స్వయంగా పరిశీలించండి.
- సైబర్ నేరాలపై ముక్యంగా ఓ ఎల్ ఎక్స్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏదేని ఫిర్యాదు కోసం  డయల్ 100 లేదా 9490617444 వాట్సాప్ నంబర్ ను సంప్రదించాలన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com