శ్రీ సాంస్కృతిక క‌ళాసార‌థి ఆధ్వ‌ర్యంలో అనుగ్రహభాషణం

- February 08, 2021 , by Maagulf
శ్రీ సాంస్కృతిక క‌ళాసార‌థి ఆధ్వ‌ర్యంలో అనుగ్రహభాషణం

సింగపూర్:శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో, సింగపూర్ లో నివసించే తెలుగువారికి ఆదివారంనాడు ఒక అపూర్వ అవకాశం వరించింది.సింగపూర్ జనులనుద్దేశించి తొలిసారిగా అంతర్జాల వేదిక ద్వారా, త్రిభాషా మహాసహస్రావధాని, ఆధ్యాత్మిక ప్రవచనకారులు, 'ప్రణవ పీఠం' సంస్థాపకులు అయిన పూజ్య బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్  ప్రవచించారు.అనంతరం కార్యక్రమంలో  సింగపూర్, ఆస్ట్రేలియా, భారత్ నుండి పాల్గొన్న కొందరు సభ్యులు అడిగిన ధర్మ సందేహాలకు సోదాహరణంగా నివృత్తి మార్గాలను ఉపదేశించారు.

పూర్తి కార్యక్రమం ఇచట వీక్షించగలరు. https://youtu.be/pBKwcgxlNn0

గురువుగారు మాట్లాడుతూ "నేటి యువతరానికి బుద్ధిబలం, భుజబలం, దైవబలం మూడూ చాలా ఆవశ్యకమని, పిల్లలు సన్మార్గంలో నడవడానికి సత్సాంగత్యం వారికి చిన్ననాటి నుండే అలవాటు చేయాలని" అన్నారు.

అనంతరం వాస్తు శాస్త్రం, స్వధర్మ నిర్వహణ, జన్మ చక్రం, శైవాగమ శాస్త్రాలు, సుబ్రహ్మణ్య స్వామి విశిష్టత, నేటి జీవితంలో నైతిక విలువలు మొదలైన అంశాలపై పలువురు అడిగిన ప్రశ్నలకు చక్కటి ఉదాహరణలతో అందరికీ అర్థమయ్యే రీతిలో వివరణలను అందించారు.

శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్ మాట్లాడుతూ "ప్రవాసాంధ్రులుగా ఉంటూ మన సంస్కృతి సంప్రదాయాల పట్ల ఆసక్తి ఉన్నా, మారుతున్న పరిస్థితుల కారణంగా వివిధ ధర్మసందేహాలు మనసులో మా అందరికీ తలెత్తుతూనే ఉంటాయి. ఇటీవల సాంకేతిక సామాజిక మాధ్యమాల ద్వారా రకరకాల అనుమానాలు మొదలై మరింత అయోమయం నెలకొంటున్న ఈ రోజుల్లో, బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ వంటి పండితులు ఆధ్యాత్మికవేత్త ముఖతః మనసులోని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే అవకాశం, మా సంస్థ ద్వారా సింగపూర్ తెలుగు ప్రజలకు లభించడం మా అదృష్టంగా భావిస్తున్నాము." అని పూజ్య పద్మాకర్కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమానికి మంగిపూడి రాధిక వ్యాఖ్యాతగా సభా కార్యక్రమం నిర్వహించగా, ఆకుండి స్నిగ్ధ మరియు జగదీష్ కోడె సమన్వయకర్తగా, రాధాకృష్ణ సాంకేతిక నిర్వాహకుడిగా వ్యవహరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com