కరోనా ఎఫెక్ట్..భారీగా తగ్గిన అంతర్జాతీయ వలసలు!

- February 09, 2021 , by Maagulf
కరోనా ఎఫెక్ట్..భారీగా తగ్గిన అంతర్జాతీయ వలసలు!

ఐక్యరాజ్యసమితి: చదువుకోసమో, బతుకుదెరువు కోసమో, కుటుంబ అవసరాలకోసమో కారణమేదైనా ఉన్న ఊరుని, పుట్టిన గడ్డనీ వదిలి ప్రపంచంలోని నలుమూలలకూ వలసవెళుతోన్న వారిలో అత్యధికమంది భారతీయులేనని ఐక్యరాజ్య సమితి తాజా అధ్యయనం వెల్లడించింది. 2020లో ప్రపంచవ్యాప్తంగా భారత దేశం నుంచి వెళ్ళిన వలస జీవులు అక్షరాలా 1.8 కోట్ల మంది. ఐక్యరాజ్య సమితి పాపులేషన్‌ డివిజన్, తాజాగా విడుదల చేసిన ‘ఇంటర్నేషనల్‌ మైగ్రేషన్‌ 2020 హైలైట్స్‌’ నివేదిక, 2020లో 1.8 కోట్ల మంది భారతీయులు విదేశాలకు వలస వెళ్ళినట్లు వెల్లడించింది.

భారత్‌నుంచి వలస వెళ్ళిన అత్యధిక మందికి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, అమెరికా, సౌదీ అరేబియాలు ఆశ్రయం కల్పిస్తోన్నాయి. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న విదేశీ జనాభాలో భారత్‌ప్రథమ స్థానంలో ఉంది. భారత్‌ నుంచి అత్యధికంగా, గణనీయమైన సంఖ్యలో 1.8 కోట్ల మంది ప్రజలు విదేశాలకు వలస వెళ్ళారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే భారతీయులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నారు’’అని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ అఫైర్స్‌(యుఎన్‌డేసా)లోని జనాభా విభాగంలోని జనాభా వ్యవహారాల అధికారి క్లేర్‌ పేర్కొన్నారు.  

ఏఏ దేశాల్లో ఎంత మంది భారతీయులు 
ఒక దేశంలోని ప్రజలు కొన్ని దేశాలకో, లేదా కొన్ని ప్రాంతాలకో వలస వెళతారు, కానీ భారత దేశానికి సంబంధించిన ప్రజలు మాత్రం గల్ఫ్‌ నుంచి ఉత్తర అమెరికా వరకు, ఆస్ట్రేలియా నుంచి యూకె వరకు అన్ని దేశాల్లోనూ, ఖండాల్లోనూ ఉండడం విశేషం. అలాగే మెక్సికోలో ఒక కోటీ పది లక్షల మంది, రష్యాలో ఒక కోటి పది లక్షలు, చైనాలో కోటి మంది, సిరియాలో 80 లక్షల మంది భారతీయులు ఉన్నారు. 2000–2020 మధ్య కాలంలో ప్రపంచంలోని అన్ని దేశాలకు, ప్రాంతాలకు భారత్‌ నుంచి వలస వెళ్ళిన వారి సంఖ్య విస్త్రుతంగా పెరిగింది. అదే కాలంలో భారత్‌ అత్యధికంగా ఒక కోటి మంది లబ్ది పొందారు. అయితే బలవంతపు వలసలు అతి తక్కువ అని, మొత్తం వలస వెళ్ళిన ప్రజల్లో సొంత దేశాన్ని వీడి బలవంతంగా ఇతర దేశాలకు వలస వెళ్ళిన వారు 10 శాతం మాత్రమేనని తెలుస్తోంది. భారత్‌ నుంచి వలస వెళుతున్న వారు ప్రధానంగా శ్రామికులు. విద్యార్థులు. డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు సైతం ఈ లిస్టులో ఉన్నారు. ఇక గల్ఫ్‌ దేశాల ఆర్థికాభివృద్ధిలో భారతీయులదే ప్రధాన పాత్ర  

అత్యధిక వలసలకు ఆశ్రయమిస్తున్న దేశం అమెరికా 
అంతర్జాతీయంగా అత్యధిక మంది వలసలకు ఆశ్రయం ఇస్తోన్న దేశం అమెరికా. 2020లో 5.1 కోట్ల మంది వివిధ దేశాలకు చెందిన ప్రజలు అమెరికాకి వలస వెళ్ళారు. ఇది ప్రపంచంలోని మొత్తం జనాభాలో 18 శాతానికి సమానం. 

భారీగా తగ్గిన అంతర్జాతీయ వలసలు
2000-2020 మధ్య కాలంలో 179 దేశాల్లోని వలసల సంఖ్య పెరిగింది. ఈ సమయంలో జర్మనీ, స్పెయిన్, సౌదీ అరేబియా, యూఏఈ, అమెరికాల్లో అత్యధిక సంఖ్యలో వలసలు పెరిగాయి. అయితే అందుకు పూర్తి భిన్నంగా 2000, 2020 మధ్య కాలంలో 53 దేశాలు, లేదా ప్రాంతాల్లోని అంతర్జాతీయ వలసలు తగ్గుముఖం పట్టాయి. అమెరికా, ఇండియా, పాకిస్తాన్, ఉక్రెయిన్, దేశాల్లో 2000–20 మధ్య కాలంలో అంతర్జాతీయ వలసల సంఖ్య భారీగా పడిపోయింది. అనేక దేశాల్లో సేవారంగం, హోటళ్ళలోనూ పనిచేసే వేలాది మంది ఉద్యోగాలు కోల్పోవడంతో ఇళ్లకు వచ్చారు. కోవిడ్‌ కారణంగా మద్య ఆదాయ దేశాలకు వలసల ద్వారా వచ్చే ఆదాయం 14 శాతం తగ్గింది. ఈ దేశాలకు వలసల ద్వారా వచ్చే ఆదాయం 2019లో 548 బిలియన్‌ డాలర్లు ఉండగా, 2021కి ఇది 470 బిలియన్‌ డాలర్లకు క్షీణించింది. 

కోవిడ్‌తో తగ్గిన వలసలు
కోవిడ్‌ మహమ్మారి అంతర్జాతీయంగా వలస వెళ్ళే వారిని 20 లక్షల మేర తగ్గించిందని, 2019 మధ్య కాలం నుంచి ఆశించిన వృద్ధికంటే వలసవెళ్ళిన వారు 27 శాతం తక్కువ అని ప్రాథమిక అంచనాలు సూచిస్తున్నాయి. రెండు దశాబ్దాలుగా అంతర్జాతీయంగా వలసల సంఖ్య బాగా పెరుగుతూ వచ్చింది. 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా సొంత దేశాల్లో నివసిస్తున్న వారి సంఖ్య 28.1 కోట్లకు చేరింది. 2000 సంవత్సరంలో 17.3 కోట్ల మంది, 2010లో 22.1 కోట్ల మందికి వలసవెళుతున్న వారి సంఖ్య పెరిగింది. ప్రస్తుతం అంతర్జాతీయ మైగ్రెంట్స్‌ సంఖ్య యావత్‌ ప్రపంచం జనాభాలో 3.6 శాతంగా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com