సెంటర్ ఫర్ డి.ఎన్.ఏ. ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ ని సందర్శించిన ఉపరాష్ట్రపతి

- February 21, 2021 , by Maagulf
సెంటర్ ఫర్ డి.ఎన్.ఏ. ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ ని సందర్శించిన ఉపరాష్ట్రపతి
హైదరాబాద్:దేశంలో అసంక్రమిత వ్యాధుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో యువత ఆరోగ్యకరమైన జీవనశైలి మీద దృష్టి కేంద్రీకరించాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. చైతన్య రహిత జీవనానికి, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలని, ఎన్నో పోషక విలువలున్న భారతీయ సంప్రదాయ ఆహారంతో పాటు యోగ లాంటి వ్యాయామాలను దినచర్యలో భాగం చేసుకోవాలని సూచించారు. 
హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ డి.ఎన్.ఏ. ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రసంగించిన ఉపరాష్ట్రపతి, ఈమధ్యకాలంలో భారతదేశంలో సంభవిస్తున్న మరణాల్లో 61 శాతం మంది గుండె రుగ్మతలు, క్యాన్సర్, డయాబెటిస్ లాంటి అసంక్రమిత వ్యాధుల కారణంగానే మరణిస్తున్నారన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికను ఉటంకించారు.
ఆరోగ్యకరమైన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్ల ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు భారీ జాతీయ ప్రచారం అవసరమని పిలుపునిచ్చిన ఉపరాష్ట్రపతి, ఆరోగ్యకరమైన జీవనశైలి దిశగా సాగేందుకు ప్రజల్లో అవగాహను పెంపొందించాలని శాస్త్రవేత్తలకు సూచించారు. 
చైతన్య రహిత జీవనశైలి, అనారోగ్యకరమైన అహారపు అలవాట్ల వల్ల ఎదురయ్యే ప్రతికూల ప్రభావాల విషయంలో పాఠశాల మరియు కళాశాల విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుక సమష్టి కృషి అవసరమని పిలుపునిచ్చిన ఉపరాష్ట్రపతి, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే గాక, మన సంప్రదాయ ఆహారపు అలవాట్ల దిశగా సాగడం, సంప్రదాయ ఆహార వినియోగాన్ని ప్రోత్సహించడం, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకునే దిశగా సాగాలని సూచించారు. ప్రస్తుతం పెరుగుతున్న తక్షణ ఆహారం (ఇన్ స్టంట్ ఫుడ్) సంస్కృతి మంచిది కాదన్న ఆయన ఇన్ స్టంట్ ఫుడ్ (తక్షణ ఆహారం) అంటే కాన్ స్టాంట్ డిసీజ్ (స్థిరమైన వ్యాధులు) అని హితవు పలికారు. 
జన్యు వ్యాధుల కారణంగా జీవన వ్యవస్థలో ఎదురౌతున్న సమస్యల గురించి ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, శాస్త్రవేత్తలు జన్యు వ్యాధుల నిర్థారణకు సరళమైన, తక్కువ ఖర్చుతో కూడిన పద్ధతులను అభివృద్ధి చేయాలని సూచించారు. భారతదేశంలో కరోనా విషయంలో 10 కంటే ఎక్కువ జన్యు ఉత్పరివర్తనాలను గుర్తించిన సి.డి.ఎఫ్.డి.ని అభినందించిన ఆయన, ఇందులో 4 కొత్త జన్యువులను గుర్తించడం ద్వారా సూచనలు చేయడం, వ్యాధుల నుంచి ప్రజలను కాపాడేందుకు ఎంతో సహాయపడిందని పేర్కొన్నారు. 
 
కార్యక్రమంలో భాగంగా సి.డి.ఎఫ్.డి.లోని పుట్టుకతో వచ్చే అరుదైన జన్యులోపాల ప్రయోగశాలను (పిడియాట్రిక్ రేర్ జెనిటిక్ డిజార్డర్స్ లేబరేటరీ) ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో అసంక్రమిత వ్యాధుల పెరుగుదల గురించి ప్రస్తావించిన ఆయన, అరుదైన జన్యు లోపాలు ఈ వ్యాధుల ప్రధాన సమూహంగా ఏర్పడతాయని తెలిపారు. 
ప్రపంచవ్యాప్తంగా 35 కోట్ల మంది ప్రజలు అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారన్న ఉపరాష్ట్రపతి, భారతదేశంలో వారి సంఖ్య 7 కోట్లు (ప్రతి 20 మందిలో ఒకరు)గా ఉందని తెలిపారు. ఈ భారం సమాజంలో ఆర్థిక వ్యవస్థ మరియు సామాజిక నిర్మాణంపై ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, వాటిలో చాలా వరకూ చికిత్స చేయలేనివని, ఈ పరిస్థితి మారే దిశగా శాస్త్రవేత్తలు దృష్టి కేంద్రీకరించాలని దిశానిర్దేశం చేశారు.
జన్యు ఆధారిత ప్రజారోగ్య పరిశోధనలను ప్రోత్సహిస్తున్న బయోటెక్నాలజీ విభాగం (డి.బి.టి)కి అభినందనలు తెలియజేసిన ఉపరాష్ట్రపతి, పుట్టుకతో వచ్చే అరుదైన జన్యు లోపాల పరిశోధన మీద సి.డి.ఎఫ్.సి. దృష్టిని కేంద్రీకరిస్తోందని, ఇది భారత ప్రభుత్వ సుస్థిర అభివృద్ధి మార్గానికి సానుకూలంగా దోహదపడుతుందని తెలిపారు. మానవ ఆరోగ్యానికి సంబంధించిన లక్ష్యాలు మరియు జన్యువ్యాధుల సామాజిక భారాన్ని ఇది తగ్గించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. 
సి.డి.ఎఫ్.డి. ప్రారంభించిన నాటి నుంచి 60 వేల కుటుంబాలకు జన్యు పరీక్షలు మరియు రోగులకు కౌన్సిలింగ్ సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్న ఉపరాష్ట్రపతి, ఇప్పటి వరకూ వివరాలు తెలియని జన్యుపరమైన లోపాలతో బాధపడుతున్న రోగుల నిర్ధారణ కోసం దేశవ్యాప్తంగా అనేక ఆరోగ్య సంస్థలతో కలిసి పని చేస్తున్న సి.డి.ఎఫ్.డి. చొరవ అభినందనీయమని తెలిపారు. ఈ సంస్థ జన్యు వ్యాధుల మీద అందిస్తున్న సేవలపై మీడియా ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. 
 
కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో మానవజాతి గతంలో ఎప్పుడు ఎదుర్కోని అనేక సమస్యలను ఎదుర్కొందన్న ఉపరాష్ట్రపతి, కోవిడ్ సంక్రమణ కచ్చితమైన నిర్ధారణను అందించిన సి.డి.ఎఫ్.డి.  కరోనా నియంత్రణ పోరాట యోధులను ఆయన అబినందించారు. గత 10 నెలల్లో సి.డి.ఎఫ్.డి. 40 వేల శాంపిల్స్ ను పరీక్షించడం అభినందనీయమని పేర్కొన్నారు. భారతీయ జనాభా కరోనా వైరస్ జన్యు క్రమాన్ని అర్థం చేసుకోవడంలో సి.డి.ఎఫ్.డి. అందించిన సహకారాన్ని అభినందించిన ఆయన, వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొనే మార్గంలో ఇలాంటి ప్రయత్నాలు చక్కని సహకారాన్ని అందిస్తాయని తెలిపారు. 
 
ప్రపంచంలో ఎప్పటికప్పుడు పెరుగుతున్న నేరాల రేటును ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, దోషుల నిర్ణారణ కోసం కోర్టులకు, జాతీయ విచారణ ఎజెన్సీ, సి.బి.ఐ. లకు అత్యాధుని డి.ఎన్.ఎ. వేలి ముద్రల సేవలను అందించిన సి.డి.ఎఫ్.డి సేవలను ప్రశంసించారు. ఇది నిరపరాధుల కుటుంబాలకు ఎంతో ప్రయోజనకారిగా నిలిచిందని తెలిపారు.
 
సి.డి.ఎఫ్.డి. శాస్త్రవేత్తలు, విద్యావేత్తల కృషిని అభినందించిన ఉపరాష్ట్రపతి, పరిశోధనల ఫలితాలను సామాన్యులకు మరింత చేరువ చేసేలా చూడాలని, ప్రజల జీవన నాణ్యతను పెంచే దిశగా పరిశోధనలు సాగాలని, విజ్ఞాన శాస్త్ర అంతిమ లక్ష్యం ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించి, వారి జీవితాలను సంతోషమయంగా మార్చడమేనని తెలిపారు.  
ఈ కార్యక్రమంలో తెలంగాణ హోంమంత్రి  మొహమ్మద్ మహమూద్ ఆలీ, సి.డిఎఫ్.డి. సంచాలకులు డాక్టర్.కె.తంగరాజ్, బయోటెక్నాలజీ విభాగ సీనియర్ అధికారులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com