పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పై సీఎం జగన్ కీలక సమీక్ష

- March 01, 2021 , by Maagulf
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పై సీఎం జగన్ కీలక సమీక్ష

అమరావతి:ఏ.పీ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కీలక సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. స్పిల్‌వే, అప్రోచ్‌ ఛానల్, అప్‌స్ట్రీం కాఫర్‌ డ్యాం, ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం, గేట్ల అమరిక తదితర కీలక పనుల పురోగతిపై సీఎం ఆరా తీశారు.. అయితే, పోలవరం నిర్మాణంలో గత ప్రభుత్వ తప్పిదాల వల్ల పనులకు ఇబ్బందులు ఏర్పడ్డాయని ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది.. స్పిల్‌ వే పూర్తి చేయకుండా కాఫర్‌ డ్యాం నిర్మాణం వల్ల ఇబ్బందులు వచ్చాయని అభిప్రాయం వ్యక్తం చేశారు అధికారులు.. ఒక పద్ధతి ప్రకారం కాకుండా.. అక్కడక్కడా అరకొరగా పనులు చేసి వదిలిపెట్టారని చర్చించినట్టుగా తెలుస్తోంది.. గతంలో కాఫర్‌ డ్యాంలో ఉంచిన ఖాళీల వల్ల వరదల సమయంలో సెకనుకు సుమారు 13 మీటర్లు వేగంతో వరద ప్రవాహం వచ్చిందని సీఎం వైఎస్ జగన్‌కు తెలియజేశారు అధికారులు.. ఇక, మే నెలాఖరు నాటికి కాపర్‌ డ్యాం పనులను పూర్తి చేస్తామని తెలిపారు.ఇప్పటికే నిర్దేశిత ఎత్తుకు తగిన విధంగా షట్టర్లు బిగింపు పూర్తవుతోందని సీఎంకు వెల్లడించారు అధికారులు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్.. పనిలోపనిగా.. పోలవరం వద్ద వైయస్సార్‌ గార్డెన్స్‌ నిర్మాణంపై కూడా సమీక్ష నిర్వహించారు.. ఈ సందర్భంగా వైయస్సార్‌ గార్డెన్స్‌ మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిపాదనలను సీఎంకు వివరించారు అధికారులు. పోలవరం వద్ద జీ హిల్‌ సైట్‌పై 100 అడుగుల ఎత్తుతో నిర్మించనున్న వైయస్సార్‌ విగ్రహం.. ప్రకృతి సమతుల్యతను పెంచే విధంగా డిజైన్ ఉండాలని సూచించారు సీఎం.. అయితే, పోలవరం ప్రాజెక్టు దిగువన బ్రిడ్జి నిర్మాణం, ఈ బ్రిడ్జి నుంచి జీ హిల్‌ను అనుసంధానిస్తూ రోడ్డును ప్రతిపాదించారు అధికారులు.. ఇక, అనుసంధాన రోడ్డు ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించారు సీఎం వైఎస్ జగన్. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com