75 వ స్వాతంత్య్ర వేడుకల జాతీయ కమిటీ తొలి సమావేశంలో ఏ.పీ గవర్నర్

- March 08, 2021 , by Maagulf
75 వ స్వాతంత్య్ర వేడుకల జాతీయ కమిటీ తొలి సమావేశంలో ఏ.పీ గవర్నర్

విజయవాడ: భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్దించి 75 సంవత్సరాలు అవుతున్న తరుణంలో ప్రధాని నేతృత్వంలో ఏర్పడిన జాతీయ కమిటీ సభ్యునిగా ఎంపికైన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ సోమవారం జరిగిన కమిటీ మొదటి సమావేశంలో రాజ్ భవన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. 75 వ భారత స్వాతంత్ర్య వార్షికోత్సవం సందర్భంగా ఈ ఉన్నత స్థాయి జాతీయ కమిటీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది.తొలి సమావేశంలో భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లిఖర్జున్ ఖర్గే, లోక్ సభ మాజీ సభాపతులు మీరా కుమార్, సుమిత్రా మహాజన్ బిజెపి జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్దా తదితరులు ప్రసంగించారు.భారత స్వాతంత్ర్య 75వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా పరిగణనలోకి తీసుకోవలసిన వివిధ అంశాలపై వారు సలహాలను అందించారు. ప్రధాని నరేంద్ర మోడీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమాన్ని దేశ నలుమూలలకు  తీసుకెళ్లడం ద్వారా తమదైన రీతిలో సహకరించిన వీరులు ఎందరో ఉన్నారని, వారి గాధలను వెలుగులోకి తీసుకురావాలని అన్నారు. దేశంలోని 130 కోట్ల జనాభా కలలు, ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని వేడుకలపై దృష్టి సారించాలన్న ప్రధాని, ఐడియాస్@75, విజయాలు@75, చర్యలు@75, పరిష్కారాలు@75 అనే విభిన్న ఇతివృత్తాలతో ముందుకు సాగుదామన్నారు. నేటి తరానికి దేశ స్వేచ్ఛ కోసం పోరాడే అవకాశం రాలేదని, అయితే దేశ అభివృద్ధి కోసం కృషి చేసే అవకాశం ఇప్పుడు మనకు లభించిందని ప్రధాని అన్నారు. గతంలో అసాధ్యమని భావించిన అనేక ఆవిష్కరణలను ఇప్పడు భారతదేశం చేసి చూపగలుగుతుందన్నారు. ఈ సమావేశాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమన్వయ పరిచారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com