హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు కఠిన నిర్ణయం

- February 29, 2016 , by Maagulf
హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు కఠిన నిర్ణయం

హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. లైసెన్సు లేకుండా వాహనం నడిపేవారిని ఎలాంటి విచారణ లేకుండా నేరుగా జైలుకు పంపేలా ఈ చర్యలు ఉండటం గమనార్హం. అంతేనా హెల్మెట్ లేకుండా వాహనం ద్విచక్ర వాహనం నడిపే వాహనచోదకుల నుంచి భారీ మొత్తంలో అపరాధం వసూలు చేయనున్నారు. నానాటికీ పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ట్రాఫిక్‌ పోలీసులు ఈ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చారు. మార్చి 2 నుంచి రహదారులపై ఎవరైనా సరే లైసెన్సు లేకుండా వాహనాలు నడిపితే అక్కడికక్కడే వాటిని స్వాధీనం చేసుకుంటారు. మరుసటి రోజు ఉదయం వాహనం నడిపిన వ్యక్తి తన ధ్రువపత్రాలు, ఫొటోలు తీసుకుని న్యాయస్థానంలో హాజరుకావాలి. వాస్తవానికి మోటార్‌ వాహన చట్టంలో ఇవన్నీ ఉన్నా.
.. పోలీసులు, రవాణా శాఖ అధికారులు వీటిని అవసరమైన సందర్భాల్లోనే వినియోగిస్తూ వచ్చారు. అయితే, బుధవారం నుంచి ఎవరినీ ఉపేక్షించబోమని హైదరాబాద్ ట్రాఫిక్‌ డీసీపీ ఏవీ రంగనాథ్‌ స్పష్టం చేశారు. అదేవిధంగా శిరస్త్రాణం లేకుండా వాహనాలు నడిపితే జరిమానా విధిస్తున్నామని, ఇకపై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తామన్నారు. * అనుమతి పత్రం (లైసెన్సు)లేకుండా తొలిసారి పోలీసులకు పట్టుబడితే.... వాహనం స్వాధీనం చేసుకుని మరుసటి రోజు న్యాయస్థానంలో ఆ వాహన చోదకుడిపై అభియోగపత్రం దాఖలు చేస్తారు. కోర్టు సమయం పూర్తయ్యే వరకూ న్యాయస్థానం ప్రాంగణంలోనే ఉండాలి. అపరాధం కూడా చెల్లించాల్సి ఉంటుంది. * అనుమతి పత్రం లేకుండా రెండోసారి పోలీసులకు దొరికితే.. ఒకరోజు జైలు శిక్ష అనుభవించాలి. 48 గంటల పాటు జైల్లో ఉంటే.. విద్యార్థులైతే భవిష్యత్తులో ఉద్యోగాలు వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉంటుందని ఒక రోజుకు పరిమితం చేశారు. * మూడోసారి పోలీసులకు దొరికితే రెండు రోజుల పాటు జైలు శిక్ష.. జరిమానా చెల్లించాలి. * అయిదు, అంతకంటే ఎక్కువసార్లు దొరికితే వారం రోజులపాటు జైలు శిక్ష అనుభవించడంతో పాటు భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఆయన వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com