ఖమ్మం గడ్డపై షర్మిల సంకల్ప సభ..

- April 09, 2021 , by Maagulf
ఖమ్మం గడ్డపై షర్మిల సంకల్ప సభ..

ఖమ్మం: దివగంత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల తెలంగాణలో రాజకీయ సంకల్పం తీసుకోనున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని పెవిలియన్‌ గ్రౌండ్‌లో ఆమె తలపెట్టిన సంకల్ప సభకు వచ్చారు. భారీ అభిమాన సందోహం మధ్య షర్మిల ఆమె తల్లి విజయలక్ష్మి వచ్చారు. ఈ సభకు విజయలక్ష్మి ప్రత్యేక అతిథిగా వచ్చారు. షర్మిలకు ఆశీస్సులు ఇవ్వడానికే విజయమ్మ వస్తున్నారని చెబుతున్నారు. అంతకుముందు దారి పొడవునా షర్మిల ఘన స్వాగతం పలికారు. లక్ష మందితో సంకల్ప సభను నిర్వహించాలని షర్మిల భావించినా కొవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో కేవలం 6 వేల మందితో నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతినిచ్చారు. అయితే సభకు వైఎస్‌ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. తెలంగాణ రాజకీయాల్లో తన పాత్ర ఏంటన్నదానిపై సంకల్ప సభ ద్వారా షర్మిల స్పష్టతను ఇవ్వనున్నారు. తెలంగాణలో రాజన్న సంక్షేమ పాలన మళ్లీ తీసుకురావాలన్నదే తన సంకల్పమన్న సంగతి ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారీ సమీక్షా సమావేశాల్లో ఆమె వెల్లడించారు. ఖమ్మం సంకల్ప సభలో తన సంకల్పం ఏంటన్నది ప్రజలకు వివరించనున్నారు.

రాజకీయ పార్టీని పెట్టబోతున్నా అని వైఎస్‌ షర్మిల ఖమ్మం సంకల్ప సభ వేదికగా ప్రకటించారు. వైఎస్సార్‌ మొదలుపెట్టిన పాదయాత్ర రోజున కొత్త సంకల్పం తీసుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణ నేలతో ఉన్న అనుబంధంతో వచ్చానని చెప్పారు. రాజశేఖర్‌ రెడ్డి పాలన స్వర్ణయుగం అని తెలిపారు. ప్రశ్నించడానికి.. నిలదీయడానికి పార్టీ పెడుతున్నా అని తెలిపారు. రాజన్న రాజ్యం అందించడానికే కొత్త పార్టీ అని పేర్కొన్నారు. ఉద్యమాల గుమ్మం ఖమ్మం అని ప్రసంగం మొదలుపెట్టారు. 

ఖమ్మం పెవిలియన్‌ మైదానంలో శుక్రవారం నిర్వహించిన సంకల్ప సభలో తన తల్లి వైఎస్‌ విజయమ్మతో కలిసి షర్మిల పాల్గొన్నారు. అంతకుముందు వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్‌ విజయమ్మ ప్రసంగం అనంతరం షర్మిల మాట్లాడారు. పల్లె పల్లె నుంచి వచ్చిన ప్రతి వైఎస్‌ఆర్‌ అభిమానికి నమస్కరిస్తున్నా అని తెలిపారు. రాజన్న బాటలో నడిచేందుకు నేను తొలి అడుగు రాజకీయాల్లో వేస్తున్నట్లు చెప్పారు. రాజన్న సంక్షేమ పాలన తిరిగి రావాలని సంకల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. 18 ఏళ్ల కిందట ఏప్రిల్‌ 9వ తేదీన చేవెళ్ల నుంచి వైఎస్సార్‌ ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర ప్రారంభించిన రోజునే పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. ప్రశ్నించడానికే పార్టీ అవసరమని వివరించారు. పాలకవర్గాన్ని నిలదీయడానికి పార్టీ అని పార్టీ ఏర్పాటుకు కారణాలను షర్మిల వివరించారు. 

ప్రతి రైతు రాజు కావాలని కోరుకున్న నాయకుడు వైఎస్‌ఆర్‌ అని షర్మిల తెలిపారు. ఉచిత విద్యుత్‌ ఇవ్వాలన్న ఆలోచన చేసింది వైఎస్‌ఆరేనని గుర్తుచేశారు. కోటి ఎకరాలకు నీరు ఇవ్వాలని జలయజ్ఞానికి వైఎస్‌ఆర్‌ శ్రీకారం చుట్టారని, వ్యవసాయాన్ని పండగ చేయాలని వైఎస్‌ఆర్‌ కోరుకున్నారని గుర్తుచేశారు. మహిళలు లక్షాధికారులు కావాలని వైఎస్‌ఆర్ కలలు కన్నారు అని షర్మిల తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com