ప్రపంచవ్యాప్తంగా మార్మోగిన సింగపూర్ కవుల కవితా పటిమ

- April 10, 2021 , by Maagulf
ప్రపంచవ్యాప్తంగా మార్మోగిన సింగపూర్ కవుల కవితా పటిమ

ఉగాది సందర్భంగా 21 దేశాల తెలుగు సంస్థల సమన్వయంతో అమెరికా "తానా" వారు నిర్వహించిన "ప్రపంచ తెలుగు మహా కవి సమ్మేళనం"లో తొలి వేదికలో "శ్రీ సాంస్కృతిక కళాసారథి", సంస్థ సింగపూర్ కు ప్రాతినిధ్యం వహిస్తూ పాల్గొని, సింగపూర్ తెలుగు కవుల ప్రతిభాకేతనాన్ని ఎగురవేసింది. 

సింగపూర్ వాస్తవ్యులైన పదిమంది కవులు కవయిత్రులు తమ చక్కటి కవితలతో, ఛందోబద్ధమైన పద్యాలతో, గేయాలతో ప్రేక్షకులందరినీ అలరించగా,రాధిక మంగిపూడి కార్యక్రమ సమన్వయకర్తగా వ్యవహరించారు.ప్రఖ్యాత సినీ రచయిత భువనచంద్ర ముఖ్యఅతిథిగా పాల్గొని సింగపూర్ తెలుగు కవులకు ప్రోత్సాహిస్తూ ప్రతి కవితను ఆస్వాదిస్తూ తమ అమూల్యమైన వ్యాఖ్యానాన్ని అందించారు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా వారు రచించిన ఒక పాటను స్వరపరిచి పాడి వినిపించడం అందరినీ అలరించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగాధిపతి ఆచార్య సూర్య ధనుంజయ్ విశిష్ట అతిథిగా పాల్గొని కవులకు తమ విలువైన అభినందనలను అందించారు. 

"శ్రీ సాంస్కృతిక కళాసారథి" అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ  "ఇంత ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమంలో తమ సంస్థ, సింగపూర్ కు ప్రాతినిధ్యం వహించడం తమకు ఆనందంగా ఉందని, తానా నిర్వాహకులు తాళ్లూరి జయశేఖర్,చిగురుమళ్ళ శ్రీనివాస్,తోటకూర ప్రసాద్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో కొందరు ఔత్సాహిక రచయితలుగా తొలిసారి కవితాపఠనం చేసినవారు కూడా ఉన్నప్పటికీ తొలి ప్రయత్నంలోనే పెద్దల మెప్పును పొందడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇటువంటి కార్యక్రమాలు ప్రవాసాంధ్ర రచయితలలో నూతన ఉత్సాహాన్ని నింపి తెలుగు సాహిత్య పరంపర కొనసాగేందుకు దోహదం చేస్తుందని "శ్రీ సాంస్కృతిక కళాసారథి" నిర్వాహక వర్గం అభిప్రాయం వ్యక్తం చేశారు. 

కవులుగా రాధాకృష్ణ రేగళ్ళ ,గుడిదేని వీరభద్రయ్య, ఓరుగంటి రోజారమణి, సుబ్బు వి పాలకుర్తి , యడవల్లి శేషు కుమారి, ఊలపల్లి భాస్కర్, మల్లవరపు వేణుమాధవ్,  శైలజ శశి ఇందుర్తి, శ్రీనివాస్ జాలిగామ పాల్గొనగా రాధాకృష్ణ గణేశ్న సాంకేతిక సహకారం, eRemit (శ్రీహరి శిఖాకొల్లు)వారు మరియు Global Indian International School వారు ఆర్ధిక సమన్వయం అందించారు.ఫేస్బుక్ మరియు యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడిన ఈ కార్యక్రమాన్ని సింగపూర్ భారత్-అమెరికా మొదలగు అన్ని దేశాల వారు వీక్షించి వారి అభినందనలు తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com