విజయవాడలో అలెర్ట్... హాస్పిటల్స్ లో మరో నాలుగు గంటలకే ఆక్సిజన్...

- April 25, 2021 , by Maagulf
విజయవాడలో అలెర్ట్... హాస్పిటల్స్ లో మరో నాలుగు గంటలకే ఆక్సిజన్...

విజయవాడ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత ప్రమాదకర స్థాయికి చేరింది. కొన్ని ఆస్పత్రుల్లో కేవలం మరో నాలుగు గంటలు వరకే సరిపడా ఆక్సిజన్ వున్నట్లు తెలుస్తోంది. దీంతో సదరు హాస్పిటల్స్ యాజమాన్యాలు ఆక్సిజన్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత నెలకొనివుంది కాబట్టి ఎక్కడా లభించకపోవడంతో ఆస్పత్రుల యాజమాన్యాలే కాదు సిబ్బంది, పేషంట్స్ బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ నుండి ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు కానీ ఏపికి సరఫరా చేయడంలేదని ఆరోపిస్తున్నారు. ఇక్కడ కూడా ఆక్సిజన్ కొరత వుందని తెలిసికూడా స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి అయిన ఆక్సిజన్ మహారాష్ట్ర, యూపీకి తరలించడం ఏంటని కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆక్సిజన్ సరఫరాపై ప్రభుత్వం దృష్టి సారించాలంటున్న వైద్యవర్గాలు సూచిస్తున్నాయి.

గత మూడు రోజులుగా ఏపీకి ఆక్సిజన్ సరఫరా లేదంటున్నాయి ఆస్పత్రులు. గతంలో రూ.220 ఉన్న ఆక్సిజన్ సిలిండర్ ప్రస్తుతం రూ.800 అయ్యిందని... అయినా కూడా దొరకని పరిస్థితి వుందన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఆక్సిజన్ కొరత లేకుండా చూసుకుని ప్రజల ప్రాణాలను కాపాడాలని వైద్యవర్గాలు కోరుకుంటున్నాయి.

ఇటీవల తీవ్రమైన ఆక్సిజన్ కొరతతో ఢిల్లీలోని జైపూర్ గోల్డెన్ హాస్పిటల్ లో ఒక్కరాత్రిలో కనీసం ఇరవై మంది రోగులు మృత్యువాత పడ్డారు. కాబట్టి ఇలాంటి ఘటన రాష్ట్రంలో చోటుచేసుకోకుండా చూడాలంటూ హాస్పిటల్స్ యాజమాన్యాలు, ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుకుంటున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com