భారత్ నుండి యూఏఈ కు విమానాల పునరుద్ధరణ పై క్లారిటీ

- May 18, 2021 , by Maagulf
భారత్ నుండి యూఏఈ కు విమానాల పునరుద్ధరణ పై క్లారిటీ

యూఏఈ: కోవిడ్ ప్రభావిత దేశాల నుండి విమానాలను తిరిగి ఎప్పుడు ప్రారంభించబోయేది ఇప్పుడప్పుడే స్పష్టత ఇవ్వలేమని యూఏఈ ప్రకటించింది. కోవిడ్ నియంత్రణకు ఆయా దేశాలు అవలంభిస్తున్న విధానాలు, చర్యలను పరిగణలోకి తీసుకొని తగిన నిర్ణయం తీసుకుంటామని ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ & గ్రూప్ ఛైర్మన్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మఖ్తౌమ్ అన్నారు. కోవిడ్ తీవ్రత దృష్ట్యా భారత్ తో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ పై యూఏఈ ట్రావెల్ బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. అయితే..సౌదీ వంటి అరబ్ దేశాలు విమాన సర్వీసులను పునరుద్ధరిస్తున్న వేళ...ట్రావెల్ బ్యాన్ ఎత్తివేతపై యూఏఈ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలోనే ఫ్లైట్ సర్వీసులపై క్లారిటీ ఇచ్చిన షేక్ అహ్మద్..ఫలానా తేది నుంచి విమానాలను పునరుద్ధరిస్తామని ఇప్పుడే చెప్పలేమని అన్నారు. ముఖ్యంగా భారత్ లో సెకండ్ వేవ్ కల్లోలం తమను తీవ్రంగా కలిచివేస్తోందని అన్నారు. భారత్-యూఏఈ మధ్య ప్రయాణికుల రద్దీ ఎప్పుడు ఎక్కువగానే ఉంటుందని, అందుకే తొలి ప్రధాన్యం ఇండియానే అని వివరించారు. కానీ, కోవిడ్ కారణంగా సర్వీసుల పునరుద్ధరణకు వేచి చూడాల్సి వస్తోందన్నారు. అయితే..ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల ప్రయాణాలు సులభతరం అవుతాయని..తమను తాము రక్షించుకుంటూనే సమాజ ఆరోగ్య భద్రత కోసం, ఆంక్షల నుంచి మినహాయింపు పొందేందుకు అవకాశం ఉన్న ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com