‘ప్రపంచ విశ్వవిద్యాలయాల సదస్సు’ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి

- July 21, 2021 , by Maagulf
‘ప్రపంచ విశ్వవిద్యాలయాల సదస్సు’ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి
  • ప్రతి రంగంలో సుస్థిరత సాధించే దిశగా విశ్వవిద్యాలయాలు కీలకపాత్ర పోషించాలి
  • విద్యాభ్యాసం, విద్యాబోధనకు అనువైన మాధ్యమాన్ని నిర్మించేందుకు సాంకేతికతను వినియోగించుకోవాలి
  • ప్రతి విద్యార్థికి విద్యనందించే విషయంలో కృత్రిమమేధ, బిగ్‌డేటాను సద్వినియోగపరుచుకోవాలన్న ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు
  • తరగతి గదుల్లో విద్యకు ఆన్‌లైన్ తరగతులు ప్రత్యామ్నాయం కాదు
  • భవిష్యత్ తరాల కోసం మిశ్రమ విద్యావిధానాన్ని అభివృద్ధి చేయాలి
  • ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయం నిర్వహించిన ‘ప్రపంచ విశ్వవిద్యాలయాల సదస్సు’ను ఉద్దేశించి ప్రసంగించిన ఉపరాష్ట్రపతి
 
న్యూఢిల్లీ:విద్యను అందించడం మాత్రమే కాకుండా, వివిధ రంగాల్లో నాయకులుగా ఎదిగేలా విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యతను విశ్వవిద్యాలయాలు తీసుకోవాలని ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయం (పానిపట్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ప్రపంచ విశ్వవిద్యాలయాల సదస్సు’ను ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సమావేశ ప్రాంగణం నుంచి బుధవారం ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యాబోధన అనేది విద్యార్థులకు విషయాన్ని చేరవేయడంగానే కాకుండా, వారిలో సృజనాత్మకత, పరిశోధనాత్మకతను పెంపొందించేదిగా ఉండాలని సూచించారు.  
తరగతి గదుల్లో బోధించే విద్యకు ఆన్‌లైన్ విద్యాబోధన సరైన ప్రత్యామ్నాయం కాదన్న ఉపరాష్ట్రపతి, ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ విద్యాభ్యాసాన్ని సమన్వయం చేస్తూ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని సర్వామోదయోగ్యమైన మిశ్రమ విద్యావిధానాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
ప్రారంభం నుంచే విమర్శనాత్మకమైన విధానాన్ని అలవర్చుకోవడం ద్వారా వారు ఎంచుకున్న రంగాల్లో విద్యార్థులు అద్భుతాలు సృష్టించేందుకు అవకాశం ఉందన్న ఉపరాష్ట్రపతి, దీని ద్వారా వారు సామాజిక మార్పులో స్వచ్ఛందంగానే భాగస్వాములవుతారు అని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కారణంగా విద్యారంగంలో మరింత క్రమశిక్షణను పెంపొందించుకునేందుకు అవకాశం కలిగిందన్న ఆయన, గ్రామీణ, పట్టణ అంతరాలను తగ్గించుకుంటూ సమాజంలోని ప్రతి ఒక్కరికీ సమానస్థాయిలో విద్యాబోధన అందించేందుకు మరింత కృషి జరగాల్సిన అవసరం ఉందని సూచించారు. విద్యారంగంలో సాంకేతికత, కృత్రిమమేధ వినియోగాన్ని పెంచడం ద్వారా విద్యాబోధన, విద్యాభ్యాస విధానాలను మరింత సరళీకృతంగా, ప్రభావవంతంగా మార్చుకోవాలని సూచించిన ఉపరాష్ట్రపతి, ప్రతి విద్యార్థికీ విద్యనందించడంలో సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
 
ఈ సదస్సు ఇతివృత్తమైన ‘భవిష్యత్ విశ్వవిద్యాలయాలు: వ్యవస్థాగత సామర్థ్య నిర్మాణం, సామాజిక బాధ్యత, సమాజంపై ప్రభావం’ ను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, మన సమాజంలో నెలకొన్న సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించుకునేందుకు బహుముఖ వ్యూహాలను అమలు చేస్తూ పరస్పర సమన్వయంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. యావత్ ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, పేదరికం, అసమానతలు, అటవీ సంపద విధ్వంసం, కాలుష్యం తదితర అంశాలను ప్రస్తావించిన ఆయన, ఈ సమస్యల పరిష్కారానికి సుస్థిరాభివృద్ధి ఒక్కటే సరైన మార్గమని ఈ దిశగా విశ్వవిద్యాలయాలు పరిష్కార మార్గాలు, కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చి కీలక భూమిక పోషించాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి సూచించారు.
 
భవిష్యత్తులో తలెత్తే ఊహించలేని సవాళ్లు, హఠాత్పరిణామాలకు ఏ ఒక్కరూ సిద్ధంగా లేరనే విషయాన్ని కరోనా మహమ్మారి మనకు గుర్తుచేసిందన్న ఉపరాష్ట్రపతి, అందరూ క్షేమంగా ఉండాలనుకున్నప్పుడే మనం కూడా క్షేమంగా ఉండగలమనే విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు. బహుముఖ వ్యూహాలు, భిన్నసంస్కృతుల మేళవింపు, పరస్పర సమన్వయం కారణంగానే సవాళ్లను ఎదుర్కొని నిలబడగలమని అభిప్రాయపడ్డారు. కరోనాకు టీకాలను కనుగొనడం, సంబంధిత ఇతర అంశాల్లో విశ్వవిద్యాలయాల పాత్రను అభినందించిన ఉపరాష్ట్రపతి, అధ్యాపకులు, పరిశోధనకారులు, విద్యార్థులు అహోరాత్రులు చేసిన కృషికి మానవాళి రుణపడి ఉందన్నారు. 
 
పాఠ్యప్రణాళికను మన సంస్కృతులతో పాటు  ప్రపంచీకరణ నేపథ్యంలో కొత్త ఆలోచనలతో రూపు దిద్దాల్సిన అవసరాన్నీ ఈ సందర్భంగా ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, పరిశోధన, సంయుక్త తరగతుల నిర్వహణ, విద్యార్థుల ప్రాజెక్టులు, పరిశ్రమల భాగస్వామ్యం తదితర అంశాల్లో దేశ, విదేశాల్లోని విశ్వవిద్యాలయాన్నీ పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భారతీయ జ్ఞానాన్ని ప్రపంచాన్ని తెలియజేయడంలో మన విశ్వవిద్యాలయాలు మరింత చొరవతీసుకోవాలన్నారు.
 
ఏ దేశ పురోగతిలోనైనా విద్యారంగం పోషించే పాత్ర కీలకమన్న ఉపరాష్ట్రపతి, సరైన విద్య ద్వారానే  దేశ ఆర్థిక, సామాజిక సాధికారత సాధ్యమవుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ 700 ఉత్తమ విశ్వవిద్యాలయాల జాబితాలో చోటు దక్కించుకోవడంతోపాటు ‘క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌-2021’లో భారతదేశ ఉత్తమ ప్రైవేటు విశ్వవిద్యాలయంగా నిలిచిన ఓపీ జిందాల్ వర్సిటీని అభినందించారు. చదువుతోపాటు విలువలు, నైతికతను బోధించడం పరిశోధనలపై ఆసక్తినిపెంపొందించడం ద్వారా జాతి నిర్మాణంలో విశ్వవిద్యాలయాలు ప్రధానపాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు.
 
భారతదేశంలోని జనాభా పరిమాణం, వైవిధ్యతను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, సమాజంలోని ప్రతి ఒక్కరికీ ఎలాంటి వివక్ష లేకుండా నాణ్యమైన విద్య అందించినప్పుడే మన యువశక్తి సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతామని సూచించారు. ‘వేదాలు, ఉపనిషత్తుల ఘనమైన వారసత్వాన్ని వాటిలోని జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరోసారి భారతదేశాన్ని విశ్వగురువుగా, విజ్ఞానకేంద్రంగా నిలబెట్టాల్సిన సరైన తరుణమిదే’ అని పిలుపునిచ్చారు.
 
మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సులో విద్యారంగాన్ని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మరింత ముందుకు తీసుకెళ్లడంతోపాటు పరిశోధనాత్మక విధానాన్ని ప్రోత్సహించడం తదితర అంశాలపై వినూత్నమైన, సృజనాత్మకమైన అంశాలపై మేథోమధనం జరుగుతుందని ఆశిస్తున్నట్లు ఉపరాష్ట్రపతి తెలిపారు.
 
ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ ధీరేంద్రపాల్  సింగ్, ఓపీ జిందాల్ వర్సిటీ వ్యవస్థాపక చైర్మన్ నవీన్ జిందాల్, విశ్వవిద్యాలయ ఉపకులపతి రాజ్‌కుమార్ సహా 25 దేశాలలోని 150 మందికి పైగా మేధావులు, ఉపకులపతులు అంతర్జాల వేదిక ద్వారా ఈ సదస్సులో పాల్గొన్నారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com